ప్రతీకాత్మక చిత్రం
ఉన్నత చదువుల కోసం స్వగ్రామాన్ని వదిలి విశాఖపట్నంలో చదువుకుంటున్న రోజులవి. 2010 అక్టోబర్ 10న అమ్మ డబ్బులు పంపితే తీసుకోవడానికి ఆర్టీసీ బస్టాండుకు వెళ్లా. అక్కడే తనని మొదటిసారి చూశా. తనకి, నాకు సుమారు 50 అడుగులకుపైగా దూరం. తన కళ్లు నన్ను ప్రత్యేకంగా ఆకర్షించాయి. నేను కూడా తననే చూస్తూ ఉండిపోయా. కాసేపటికి తను వెళ్లిపోయింది. తన వెంటే వెళ్దాం అనుకున్నా. కానీ కుదరలేదు. అలా అప్పటికి తనని మిస్ అయ్యా. కానీ తన ఊహల నుండి దూరం కాలేకపోయా. దాదాపు పది రోజులు గడిచింది. మళ్లీ నేను బస్సులో ఉండగా.. తను ఎదురుగా బస్సు కోసం చూస్తోంది. అప్పుడూ తను నన్ను చూసింది. తన కళ్లు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. మరో నాలుగు రోజులకి అంటే అక్టోబర్ 24న మేం ఉంటున్న వీధిలో కనిపించింది.
నాకోసమే వచ్చిందేమో అనుకున్నా. కానీ తను ఉండేది మా వెనుక వీధిలోనేనని తెలిసింది. ఆలస్యం చేయడం ఇష్టం లేక వెంటనే పేరు అడిగి తెలుసుకున్నా. పేరు కాస్త పాతగానే ఉండడంతో ఓ... అన్నా. అంతే నా వైపు సీరియస్‌గా చూసింది. నేను సర్ది చెప్పేలోగా వెళ్లిపోయింది. తన వెంటే వెళ్లా. తను రోజూ ఆ దారిలోనే కాలేజీకి వెళ్తోందని తెలిసి.. నా మొదటి క్లాస్ ఎగ్గొట్టి మరీ తనకోసం ఎదురు చూసేవాణ్ని. తర్వాత కొద్ది రోజులకు ఫోన్ నెంబర్లు మారాయి, మాటలు పెరిగాయి. నిజానికి తనంటే నాకు ఎంత ఇష్టమో తనకి నేనంటే అంతకంటే ఇష్టమని చెప్పింది. తనే ప్రపోజ్ చేసింది. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్న నేను ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఓకే చెప్పా.
అలా ఏడాది గడిచింది. నేను పైచదువుల కోసం హైదరాబాద్ వచ్చా. అప్పటి నుండి తన ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. కాల్ చేస్తే లిఫ్ట్ చేసేది కాదు. ఎప్పుడూ కాల్ వెయిటింగ్. కొత్త కొత్త సిమ్ కార్డులు తీసుకునేది. కలిసినప్పుడు ఆ సిమ్ కార్డులు తీసి తన పర్సులో పెట్టేది. ఒక సారి ఏదో నెంబర్ నుండి మెసేజ్ వస్తే ‘ఎవరు’ అని అడిగా ‘అన్నయ్య’ అని చెప్పింది. ఆ నెంబర్‌కు కాల్ చేశా. నన్ను తన అన్నయ్యగా ఆ వ్యక్తికి చెప్పిందన్నాడు. మనసు విరిగిపోయింది. తర్వాత మరో వ్యక్తి అర్ధరాత్రిపూట కాల్ చేసి బయటకు వెళ్దాం అన్నాడు. ఎవరు అని ప్రశ్నిస్తే సమాధానం లేదు. ఎదురింటి వ్యక్తి అని తర్వాత తెలిసింది.
చివరికి నేను హైదరాబాద్లో ఉంటే నాకోసం హైదరాబాద్ వెళ్తున్నా అని తన ఎదురింటి వ్యక్తికి చెప్పింది. కానీ నన్ను అన్నయ్యగా పరిచయం చేసిన వ్యక్తితో కలిసి హైదరాబాద్ మొత్తం తిరిగి వారం రోజులు వాళ్లింట్లోనే ఉందని తర్వాత తెలిసింది. అయినా తనే కావాలనుకున్నా. చివరికి నువ్వు నాకొద్దు అంటూ వేరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. నాకు కన్నీరు మిగిల్చింది. తను చేసిన మోసాన్ని భరించలేకపోయా. ఉన్న ఉద్యోగం వదిలేశా. పిచ్చోడిలా చీకటి గదిలో రోజుల తరబడి కూర్చుని ఏడ్చా. ఇప్పుడు నన్ను ఇష్టపడ్డ మనిషిని పెళ్లి చేసుకున్నా. తన పేరు వినిపించిన ప్రతిసారి పాత గాయం నొప్పెడుతూనే ఉంది.. గొంతు మెలిపెడుతూనే ఉంది.
- సంతోష్, విజయవాడ
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment