
బ్రేకప్ నామ సంవత్సరం
హిందీ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు వెండితెర మీద కన్నా, నిజజీవితంలోనే చాలా బ్రేకప్ లవ్‌స్టోరీలు కనిపిస్తున్నట్లున్నాయి. పెళ్లైనవారూ, పెళ్లి కానివారూ ఈ బ్రేకప్ స్టోరీస్‌తో మీడియాలో పతాక శీర్షికలెక్కుతున్నారు. ఇక.. రీసెంట్‌గా బ్రేకప్ అయినవాళ్ల గురించి తెలుసుకుందాం..
కంచికి చేరిన... కోహ్లీ, అనూష్కా శర్మ లవ్!
క్రికెటర్ విరాట్ కోహ్లీ, నటి అనూష్కా శర్మల ప్రేమ విఫలమైనట్లేనా? అవును. ఈ విఫల ప్రేమ గాథ దాదాపు అధికారికమేనని తాజా వార్తలు సూచిస్తున్నాయి. దాదాపు రెండేళ్ళుగా ఈ జంట గాఢమైన ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, పెళ్ళి విషయంలో విభేదాలు రావడంతో వీరిద్దరూ తమ ప్రేమ కథకు ‘ది ఎండ్’ కార్డు వేసేశారని లేటెస్ట్ సమాచారం.
ఫొటోలు పంచుకొనే సోషల్ మీడియా వేదిక ‘ఇన్‌స్టాగ్రామ్’లో అనూష్కను విరాట్ ఫాలో కావడం ఆ మధ్య మానేశారు. అప్పటి నుంచి వీళ్ళ ప్రేమకథ కంచికి చేరినట్లేనని మీడియాలో పుకార్లు షికార్లు చేస్తూ వచ్చాయి. అయితే, ఇలా సోషల్ మీడియాలో ‘అన్ ఫాలో’ కావడం మామూలు ‘ప్రణయ కలహ’మేనని ట్యాబ్లాయిడ్స్ చెబుతూ వచ్చాయి. తీరా ఇప్పుడు వివాహ ప్రతిపాదనపై ఈ జంట మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయనీ, దాంతో విడిపోయారనీ అభిజ్ఞ వర్గాల భోగట్టా. అయితే, దీనికి సంబంధించి వీరిద్దరి నుంచి అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. ఆంతరంగిక వర్గాల సమాచారం ప్రకారం - ఈ ఏడాదిలోనే పెళ్ళి చేసుకుందామంటూ కోహ్లీ ప్రతిపాదించారట! కానీ, అనూష్కా శర్మ ఆ ప్రతిపాదనను తోసిపుచ్చారట. విరాట్‌తో పెళ్ళి కన్నా కెరీర్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలని ఆమె భావించినట్లు సమాచారం. పెళ్ళి విషయమై ఈ ఇద్దరి మధ్య కొద్ది కాలంగా చర్చ జరుగుతోందనీ, అదే వారి మధ్య అభిప్రాయ భేదాలకు కారణమనీ సన్నిహితులు కూడా ధ్రువీకరించారు.
లగేజ్ సర్దుకున్న కత్రినా!
మొత్తం మీద, విరాట్ - అనూష్క శర్మల బ్రేకప్ కథ ఇప్పుడు సంచలనమై కూర్చుంది. విచిత్రం ఏమిటంటే - హిందీ చిత్ర పరిశ్రమకు ఈ ఏడాది ‘విఫల ప్రేమకథల సంవత్సరం’గా పరిణమిస్తున్నట్లు కనిపిస్తోంది. అనుష్క-విరాట్‌ల బాటలో ప్రముఖ హీరో రణ్‌బీర్ కపూర్, కత్రినా కైఫ్‌లు కూడా తమ ప్రేమకు ఫుల్‌స్టాప్ పెట్టేశారు. వీరి మధ్య ప్రేమ మొన్న జనవరిలో బ్రేకప్ అయింది. కొన్ని నెలలుగా రణ్‌బీర్ ఇంట్లోనే అతనితో సహజీవనం చేశారు కత్రినా. బ్రేకప్ తర్వాత తన లగేజ్ సర్దుకుని వేరే ఇంటికి వెళ్లిపోయారు. విశేషం ఏంటంటే.. రణ్‌బీర్, కత్రినాలకు సర్ది చెప్పడానికి వాళ్ల పేరెంట్స్ సన్నాహాలు చేస్తున్నారట. విరిగిన గాజు ముక్క అతకదనే చందంగా ఈ ఇద్దరూ మళ్లీ కలవడానికి ససేమిరా అంటున్నారట.
పదహారేళ్ల బంధానికి ఫుల్ స్టాప్
మంచి నటునిగా, దర్శకునిగా ఫర్హాన్ అఖ్తర్‌కి బాలీవుడ్‌లో మంచి పేరుంది. 19 ఏళ్ల క్రితం అధునా భద్నానీతో ప్రేమలో పడ్డారాయన. మూడేళ్ల పాటు ప్రేమించుకుని 2000వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పదహారేళ్ల వైవాహిక జీవితంలో ఫర్హాన్, అధునాకి మధ్య మనస్పర్థలు వచ్చిన దాఖలాలేవీ కనిపించలేదు. ఇప్పుడు ఈ ఇద్దరూ విడిపోవాలనుకోవడానికి హీరోయిన్ అదితీ రావ్ హైదరి కారణం అని తెలుస్తోంది. ఆమెతో ఫర్హాన్ ఎఫైర్ సాగిస్తున్నారనే టాక్ ఉంది. బహుశా భార్య నుంచి విడిపోవడానికి అదో కారణమై ఉంటుందని బాలీవుడ్‌లో ఓ టాక్ ఉంది.