![Breakup Love Stories In Telugu : Murali Sad Love - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/13/sad-love_A%20M.jpg.webp?itok=9wEiD2Qc)
ప్రతీకాత్మక చిత్రం
బహుశా అది ఆగస్టు 15 అనుకుంటా! మా స్కూల్లో జెండా వందన కార్యక్రమం అవ్వగానే మా ఫ్రెండ్ నాతో ‘మా ఊరికి వెళ్దాము. మా స్కూల్లో ఇంకా బాగా చేస్తారు’ అని చెప్పి తీసుకెళ్ళాడు. మేము అక్కడికి వెళ్లాము. బస్‌స్టాప్ పక్కనే వాళ్ల స్కూలు ఉంది. బస్సు దిగగానే ఎదురుగుండా ఉన్న స్టేజి పైన డాన్స్ చేస్తూ ఓ అమ్మాయి కనిపించింది. డాన్స్ అయిపోయిన తర్వాత పాట పాడడానికి వచ్చింది. ఆమె పాడిన పాట అక్కడే నిలబడి శ్రద్ధగా విన్నాను. అయితే నేను వెళ్లక ముందు చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నదంట. నాలుగు నుంచి అయిదు వరకు బహుమతులు ఆమెకే వచ్చాయి. చాలా బాగా డాన్స్ చేసింది, చాలా బాగా పాడింది! ఇవన్నీ చూసి ఈ అమ్మాయి నా కోసమే పుట్టిందని అనుకున్నాను. అయితే నన్ను తీసుకెళ్లిన మా స్నేహితుడిని ఆమె గురించి అడిగాను. ‘ఆమె పేరు రాధ, తను ఇప్పుడు ఏడవ తరగతి’ అని చెప్పాడు.
అయితే నేను అడిగాను ‘ఇక్కడ ఏడవ తరగతి వరకే ఉంది కదా! మరి 8వ తరగతి, 9వ తరగతి, పదవ తరగతి ఎక్కడ చదువుకుంటుంది’ అని. అతను తెలీదని సమాధానం ఇచ్చాడు. నేను సరే అని ఊరుకున్నాను. అలా తన ఏడవ తరగతి అయిపోయింది. మళ్లీ పాఠశాలలు తెరుచుకున్నాయి. నా అదృష్టానికి తను నేను చదువుకున్న స్కూల్‌కే వచ్చింది. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పాడు ‘నువ్వు అడిగావే ఆ అమ్మాయి రాధ! తను ఇప్పుడు ఈ స్కూల్‌కి వచ్చింది. ఇక్కడే పదవ తరగతి వరకు చదువుకుంటుందంట’ అన్నాడు. నాకు చెప్పలేనంత సంతోషం. ఇంకొక విషయం ఏమిటంటే రాధ, విమల మంచి స్నేహితులు. నాకు రాధ పరిచయం అయితే నా స్నేహితునికి విమల పరిచయమయ్యింది. నా స్నేహితుడికి విమలకి మధ్య కూడా ప్రేమ చిగురించింది.
మొత్తానికి కొద్ది రోజులు గడిచేసరికి మా రెండు జంటలు ప్రేమలో ఉన్నాయి. అలా అలా నా పదవ తరగతి అయిపోయింది. ఒక సంవత్సరం పాటు ఇంటి దగ్గరే ఉండాల్సి వచ్చింది. ఈ సంవత్సరంలో తన పదవ తరగతి కూడా అయిపోయింది. నేను ఒక కాలేజీలో తను ఒక కాలేజీలో చేరిపోయాము. ఇలా మా ప్రేమ కాస్తా ఏడు సంవత్సరాల వరకు సాగింది. తరువాత విడిపోవడం కూడా జరిగింది. ఎలా అంటే వాళ్ల తమ్ముడు ఒకరోజు మమ్మల్ని చూసి వాళ్ల అమ్మకి చెప్పేశాడు. వాళ్ల అమ్మ తనకు సంబంధాలు చూడడం మొదలు పెట్టింది. ఇదిలా ఉండగా మా ఇంట్లో నుంచి కూడా నాకు ఎక్కడైనా పనికి వెళ్లమని ఒత్తిడి తెచ్చారు. అలా నేను ఒక కంపెనీలో పనికి చేరాను. కొద్ది రోజులకే తనకు పెళ్లి కూడా అయిపోయింది. పెళ్లి అయిన తర్వాత కూడా నాకు తన భర్త ఫోన్‌తో ఫోన్ చేసి మాట్లాడేది. కొద్ది రోజుల తర్వాత తన భర్త ఫోన్ నెంబర్ ఛేంజ్ చేసి కొత్త నెంబర్ తీసుకున్నాడు.
ఆ నెంబర్ నాకు తెలియదు! ఎప్పటికైనా తను నాకు తప్పకుండా ఫోన్ చేస్తుందని నా నెంబర్ మార్చలేదు. 2007నుంచి ఇప్పటివరకు కూడా నేను నా నెంబర్‌ను మార్చలేదు. గత సంవత్సరం ఆగస్టు 15, 2018న నా ఫ్రెండ్ ప్రియురాలు విమల ఫేస్‌బుక్‌లో నాకు పరిచయం అయ్యింది. తను నన్ను అడిగింది ‘రాధతో మాట్లాడతావా?’ అని. నేను సరే అన్నాను. ఆమె రాధ ఫోన్ నెంబర్ మెసేజ్ చేసింది. మరుసటి రోజు ఆగస్టు 16, 2018 రాధ నాకు ఫోన్ చేసి స్వాతంత్రం వచ్చినంత పని చేసింది. నా ఆనందానికి అవధులు లేవు. తను కూడా చెప్పింది ‘ఎట్టి పరిస్థితిలోనూ నేను నిన్ను మళ్లీ కలుస్తాననుకున్నా. ఆ కోరిక నెరవేరింది’ అని. ‘అవును నిజమే కానీ, మనకు విమల దేవత! మనం తను చేసిన సహాయానికి ఎలా రుణం తీర్చుకోవాలో అర్థం కావట్లేదు’ అని అన్నాను. ఇప్పుడైతే వాళ్ల భర్త, వాళ్ల ఫ్యామిలీ అందరూ మాట్లాడుతున్నారు.
- మురళీ
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment