
ప్రతీకాత్మక చిత్రం
మాది పులివెందుల దగ్గర పల్లె. నాకు నా మరదలంటే చిన్నప్పటి నుండి ఇష్టం. ఎంతలా అంటే ఆ అమ్మాయి స్కూల్‌కు వెళ్లే సమయానికి నేను కావాలనే పేపర్ చదవడానికి రోడ్ దగ్గరికి వెళ్లేవాడిని. మళ్లీ ఇంటికి వచ్చేటప్పుడు నా సైకిల్ వేసుకుని వెళ్లేవాడిని. ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యడానికి కాదండోయ్! కేవలం చూడడానికి మాత్రమే. అలా ఆ అమ్మాయి 10వ తరగతి అయిపోయే వరకు జరిగింది. టెన్త్ పరీక్షలు అయిపోయాయి. ఇంటర్ కడపకు వెళ్తోందనగా ఒకరోజు ఓ లెటర్ ఇచ్చింది. అందులో "నువ్వంటే నాకు ఇష్టం! హాలిడేస్ వచ్చాక హాస్టల్‌లో ఉన్న కాయిన్ ఫోన్ నెంబర్ ఇస్తాను" అని ఉంది. నేను కూడా సరే అన్నాను. ఆ క్షణంలో నాకు అందరిలాగా బయట తిరగాలని అనిపించలేదు. అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఎలాగైనా చదివి, మంచి ఉద్యోగం సంపాదించి వాళ్ల నాన్నని అడుగుదాం అనిపించింది. తను కాలేజీకి వెళ్లిపోయింది. నేను హాలిడేస్ కోసం చూస్తూ ఉన్నా.
వినాయకచవితికి వచ్చింది తను. నేనైతే ఆ అమ్మాయి కోసం ఉదయం టిఫిన్ తిని అక్కడికి దగ్గరలోని అరుగు మీద కూర్చునేవాడిని. అప్పుడప్పుడు అలా బయటికి వచ్చి వెళ్లేది. చూపులతోనే మాట్లాడుకునేవాళ్లం. అలా తినడం అక్కడే కూర్చుని వెయిట్ చెయ్యడం.. అలా 5 రోజులు గడిచిపోయాయి. నాతో మాట్లాడితే ఎంతో పొంగిపోయేవాడిని. ఎప్పుడు సెలవులు వచ్చినా అక్కడే కూర్చొని బయటికి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉండేవాడిని. ఏమైనా చెప్పాలనుకుంటే పేపర్‌లో రాసి ఇచ్చేది. మళ్లీ అది చదివాక చింపేసేయ్ అనేది. నేను అలాగే చింపేసే వాడిని. ఎందుకంటే తన మీద ఉన్న నమ్మకం. ఈ విషయం వాళ్ల నాన్నకు తెలిసింది.
ఆయన నాకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. అందుకే ఆ అమ్మాయిని ఏమైనా అంటాడేమో అని మాట్లాడటం తగ్గించా. నేను మాట్లాడటం లేదు కాబట్టి తను ఏమైందని అడిగేది. ఏం జరిగిందో వివరిస్తూ ఓ పేపర్లో రాసి తనకు ఇచ్చా. అప్పటినుంచి వాళ్ల నాన్న ముందే మాట్లాడేది. నేను ఎప్పుడూ 30 నిమిషాలు కంటిన్యూగా తనతో మాట్లాడలేదు. కానీ తనంటే చాలా ప్రేమ. కానీ నా డిగ్రీ సెకండ్ ఇయర్‌లో సరిగ్గా వినాయక చవితి నాడు ‘నువ్వంటే నాకు ఇష్టం లేదు’ అనేసింది. ఆ రోజు ఎంతగా ఏడ్చానంటే.. నా ముందు వెనక ఎవరు ఉన్నారన్న సంగతి పట్టించుకోకుండా అందరి ముందే ఏడ్చేశా. ఆ తర్వాత తన మీద కోపంతో ఎంబీఏ చేసి మంచి జాబ్ తెచ్చుకున్నా. ఒకవిధంగా చెప్పాలంటే ఆ అమ్మాయి అలా చేయడం వల్ల నేను ఇలా సెటిల్ అయ్యాను. ఆరోజు తనని కారణం కూడా అడగలేదు ‘నేనంటే ఎందుకు ఇష్టం లేదు’ అని.
- గురునాథ్
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment