
ప్రతీకాత్మక చిత్రం
నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులవి. కో ఎడ్యుకేషన్ కాలేజి. తడబడుతున్న అడుగులతో క్లాస్ రూమ్‌లోకి అడుగు పెట్టగానే ఒక్కసారిగా శరీరమంతా కంపించింది. అప్పటివరకు కేవలం ఆడపిల్లలతో కలసి చదువుకున్న నేను! అబ్బాయిల మధ్య నుండి నడుస్తూ బెంచ్ దగ్గరకు వెళ్తుంటే ఎన్నో కిలోమీటర్లు నడుస్తున్నట్లుగా అనిపించింది. క్లాస్లో ప్రక్క బెంచ్లో ఒక పొడుగాటి అబ్బాయి. మొహం సరిగ్గా చూడలేదు. క్లాస్ అయిపోయాక బాయ్స్ అందరూ బయటకు వెళ్తుంటే వెనుకనుండి చూశాను. అందంగా ఉన్నాడనిపించింది. తిరిగి అతను లోపలికి వస్తుంటే అనుకోకుండా చూపు కలిసింది. ‘ఛ.. ఛ.. ఏమనుకుంటాడో’ అని చూపు తిప్పుకున్నాను. గమనించినట్టున్నాడు.. పలకరింపుగా నవ్వాడు. భయం వేసింది. ఇప్పట్లా హలో, హాయ్, ఒరేయ్, ఒసేయ్ తెలియని రోజులవి. ఇంటర్ సగం రోజులు అయితేనే గానీ కనీసం పలకరించుకోవడం కూడా జరగలేదు. ప్రతి రోజు క్లాస్‌లోకి రాగానే అతను వచ్చాడా? లేదా? అని చూడడం నాకు తెలియకుండానే అలవాటైపోయింది.
అతను కూడా నాకు లానే నన్ను గమనించేవాడనుకుంటా. వెంటనే పలకరింపుగా అతని పెదవులు విచ్చుకునేవి. ఒక రోజు అతను కాలేజ్‌కి రాలేదు. ఏదో వెలితిగా అనిపించింది. మర్నాడు వచ్చాడు. కొద్దిసేపయ్యాక, ముందు రోజు క్లాస్‌లో చెప్పిన ఇంగ్లీష్ నోట్స్ ఇవ్వగలరా అని నెమ్మదిగా అడిగాడు. ఇచ్చాను. కానీ మనసులో భయం. నా బుక్ అతని దగ్గర ఉన్నట్టు ఎవరైనా చూస్తే బాగుండదేమో అని. మర్నాడు జాగ్రత్తగా తెచ్చి ఇచ్చేశాడు. తర్వాతనుంచి ఎక్కడైనా కన్పిస్తే పలకరింపుగా నవ్వేవాడు. తిరిగి నవ్వడానికి కూడా భయమే. అప్పుడప్పుడు మాట్లాడ్డానికి ట్రై చేసేవాడు. అంతకు మించి మా పరిచయం ముందుకు సాగలేదు.
సాగలేదు అనడం కరెక్ట్ కాదేమో.. నేనే కొనసాగించలేదేమో అని ఇప్పుడు అన్పిస్తుంది. అప్పటి సామాజిక పరిస్థితులు, నేను పెరిగిన వాతావరణం నన్ను అలా భయ పెట్టేవి. ఇంటర్మీడియట్ అయిపోతుండగా ఏదో బాధ. ఇక ఎవరి దారి వారిదే కదా అని. ఫైనల్ ఎక్షామ్స్ దగ్గర పడుతుండగా ఒకరోజు సడెన్‌గా, ‘మీరు ఏమీ అనుకోకపోతే మీ ఫొటో ఒకటి ఇస్తారా’ అని అడిగాడు. గుండె చాలా స్పీడ్‌గా కొట్టుకుంది. అంత ధైర్యంగా ఎలా అడిగాడబ్బా అనుకున్నా. మనసులో ఇవ్వాలనుంది. కానీ పిరికితనం. మా ఇద్దరి గురించి ఎవరైనా రూమర్స్ స్ప్రెడ్ చేస్తారేమో అని. కానీ అప్పటికే మా క్లాస్లో కొంతమంది కేవలం మా చూపుల పరిచయానికే ఒక కథ అల్లేశారని నాకు తర్వాత తెలిసింది.
అయినా నాకు అంత ధైర్యం ఎలా వచ్చిందో ఒక ఫోటో ఇచ్చాను. స్పామ్ బుక్‌లో కూడా అతను 'మీ గురించి ఆలోచించే వారి గురించి మీరు మర్చిపోరని ఆశిస్తూ ' అని వ్రాశాడు. ఇన్ని సంవత్సరాలైనా ఇంకా ఆ కొటేషన్ నాకు గుర్తుండిపోయింది. నేను కూడా కొంచెం చొరవ చూపిస్తే మా పరిచయం కొంచెం ముందుకు సాగి వేరే విధంగా ఉండేదేమో కానీ, నా వల్లే కేవలం నా వల్లే మాది చెరో దారి అయిపోయిందని ఇప్పటికీ నాకు అన్పిస్తూ ఉంటుంది. సోషల్ మీడియా, సెల్ కెమెరాలు, ఫోన్ చేసుకోవడం తెలియని జనరేషన్ మాది. మొదటి పరిచయంలోనే క్లోజ్‌గా మూవ్ అవడం, మోకాళ్ల మీద కూర్చుని రోజా పువ్వులు ఇచ్చుకోడం అంటారా.. ఆ సమస్యే లేదు. కానీ, ఆ తెలిసీ తెలియని అమాయకత్వపు చూపులలో ఎన్నో అర్థాలు, ఎంతో ప్రేమ, ఎంతో బాధ, ఎంతో స్నేహపూరితమైన వాత్సల్యం అన్నీ కలగాపులగంగా గుర్తొచ్చినప్పుడు మనసులో తీయటి బాధ.
- కుమారి
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment