
అవి నేను డిగ్రీ చదివేరోజులు. తను నా జూనియర్ పేరు ప్రియా. మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. కానీ పెద్దగా ఎప్పుడూ వ్యక్తపరచలేదు. నా ఎక్జామ్స్ అయిపోయాక నేను మా ఊరు వెళ్లాను. అప్పట్లో ఫోన్లు అంతగా లేవు. తనతో మాట్లాడాలని ఉన్నా ఏం చేయలేని పరిస్థితి. తన ఙ్ఞాపకాలతో అలా రోజులు గడిచేవి. ఓరోజు తనని చూడాలనిపించి హైదరాబాద్ వెళ్లాను. తను అక్కడి నుంచి వేరే హాస్టల్ మారిందని తెలిసింది. హైదరాబాద్‌లో అడ్రస్ పట్టుకోవడం చాలా కష్టం అని ఆరోజు అర్థమైంది. చాలా తిరిగి తిరిగి..తను ఉండే హాస్టల్ దగ్గరికి వెళ్లాను. నన్ను చూడగానే షాక్ అయ్యింది. నీ గురించే ఆలోచిస్తుంటే నువ్వే వచ్చేశావేంటి అని చాలా సర్‌ప్రైజ్‌గా ఫీల్ అయ్యింది. మనం ఎవరినైనా ఇష్టపడుతున్నప్పడు వాళ్లను మనస్ఫూర్తిగా తలుచుకుంటే నిజంగానే అది అవతలి వాళ్లు కూడా ఫీల్ అవుతారు అని ఆ క్షణం అనిపించింది.
కొన్నాళ్ల తర్వాత నాకు పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఏం చేయమంటావ్ అని అడిగింది. ఆ టైంకి నాకు జాబ్ లేదు. ఏ ఉద్యోగం లేకుండా మీ అమ్మాయిని పెళ్లిచేసుకుంటా అని అడగటం కరెక్ట్ కాదనిపించింది. అందుకే నేనేం చేయలేను, నువ్వు ఆ అబ్బాయినే పెళ్లిచేసుకో అన్నాను. వెంటనే కాల్ కట్ చేసింది. మూడ్నెళ్ల తర్వాత తన నుంచి కాల్ వచ్చింది. ఇంకో గంటలో నా పెళ్లి వచ్చి నన్ను తీసుకెళ్లు అని. నేను అప్పుడు బెంగుళూరులో జాబ్ సర్చింగ్‌లో ఉన్నాను. గంటలో రావడం అసాధ్యం. ఒకవేళ వచ్చినా ప్రియాని తీసుకెళ్లి తన ఫ్యామిలీని దూరం చేయలేను. తన పెళ్లి జరిగిపోయింది. ప్రియా ఇప్పుడు సింగపూర్‌లో ఉందని తెలిసింది. తనకి సారి చెప్పాలనే బాధ ఇప్పటికీ నన్ను దహిస్తూనే ఉంటుంది. ప్లీజ్ ప్రియా..ఒక్కసారి కాల్ చెయ్.నీ కాల్ కోసం 8 ఏళ్లుగా ఎదురుచూస్తున్నా. నువ్వు ఎక్కుడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ప్రేమతో నీ అంజి
--అంజిరెడ్డి (కోదాడ)
Comments
Please login to add a commentAdd a comment