ప్రతీకాత్మక చిత్రం
డిగ్రీ అయిపోగానే జర్నలిజం చేయటానికి హైదరాబాద్‌లోని ఓ కాలేజ్‌లో చేరాను. జర్నలిజం అంటే నాకు చిన్నప్పటినుంచి ఇష్టం. కాలేజ్‌కు దగ్గరలో ఓ హాస్టల్‌లో ఉండేదాన్ని. క్లాసులు స్టార్ట్ అయిన కొద్ది రోజుల వరకు నాకెవరూ ఫ్రెండ్స్ అవ్వలేదు. నెల తర్వాత అందరితో నాకు మంచి బాండ్ ఏర్పడింది. ముఖ్యంగా రాజీవ్‌తో! అతడు నా బెస్ట్ ఫ్రెండ్. అన్ని విషయాల్లో తోడుగా ఉండేవాడు. పర్సనల్ విషయాలను సైతం షేర్ చేసుకునేవాళ్లం. అయినప్పటికి ఎప్పుడూ హద్దులు దాటలేదు. కించపర్చుకునేలా మాట్లాడుకోలేదు. అతనంటే నాకు అభిమానం, గౌరవం ఏర్పడింది.
అతడికి కూడా నేనంటే అంతే మర్యాద. చూస్తుండగానే రోజులు ఇట్టే గడిచిపోయాయి. ఉద్యోగాలు ఇద్దరినీ దూరం చేశాయి. ఎంత దూరం ఉన్నా మేము రెగ్యులర్‌గా ఫోన్‌లోనో, సోషల్ మీడియాలోనో టచ్‌లో ఉండేవాళ్లం. ఉద్యోగంలో చేరిన కొద్దిరోజులకే నాకు పెళ్లి జరిగింది. అతడ్ని కూడా పెళ్లికి పిలిచా! రాలేదు. తర్వాత చాలా రోజులు అతడితో నేను టచ్‌లో లేను. ఓ సంవత్సరం తర్వాత అతడే నాకు కాల్ చేశాడు. ఇక అప్పటినుంచి మేము టచ్‌లో ఉంటున్నాం. ఓ సారి మాటల సందర్భంలో ‘‘ఇంకెన్నాళ్లని ఇలా ఉంటావ్. పెళ్లి చేసుకోవా’’ అని అడిగా. అందుకు తను నన్ను ఎదురు ప్రశ్నించాడు‘‘ నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావ్?’’ అని. నేను షాక్ అయ్యాను. వెంటనే తేరుకుని‘‘ నాకు పెళ్లి చేసుకోవాలని ఉండింది. అందుకే చేసుకున్నాను’’ అని చెప్పా.
దానికి అతడు ‘‘ నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. నేను చేసుకోను’’ అన్నాడు. అతడి మాటల్లో ఏదో బాధ తొంగిచూసింది. నాకప్పుడర్థమైంది! రాజీవ్ నన్ను ప్రేమిస్తున్నాడని. అతడు ఇన్ని రోజులు చూపించిన అభిమానం, గౌరవం నాపై ప్రేమ అని తెలిసి నా మనసులో ఏదో మూల బాధకలిగింది. ఫోన్ పెట్టేసి బాగా ఏడ్చాను. అతను చాలా మంచి వాడు. తను ప్రేమకు దూరమవ్వటానికి నేనే కారణమని తట్టుకోలేకపోతున్నా. అప్పుడు అతడి ప్రేమను అర్థం చేసుకోలేకపోయా. ధైర్యం చేసి తను కూడా చెప్పలేకపోయాడు. బెస్ట్ ఫ్రెండ్ ప్రేమిస్తున్నాడని తెలిసి ఏం చేయాలో అర్థం కావటం లేదు.
- మౌనిక, బళ్లారి
Comments
Please login to add a commentAdd a comment