Sad love story
-
నువ్వు కుదరదంటే చచ్చిపోతా!!
అతడి పేరు సుభాష్! మా ఇంటి పక్కనే వాళ్ల ఇళ్లు. మా రెండు కుటుంబాల మధ్య మంచి రిలేషన్ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే దూరపు బంధుత్వం కూడా. తను నాకు బావ వరుస అవుతాడు. చాలా స్నేహంగా ఉండేవాళ్లం చిన్నప్పటినుంచి. ఇంటర్ ఫైనల్ ఇయర్లో ఉన్నపుడు నాకు ప్రపోజ్ చేశాడు. నేనప్పుడు ఓకే చెప్పలేదు. డిగ్రీ ఇద్దరం ఒకే కాలేజ్‌లో చేరాము. నెలకోసారైనా నాకు ఐ లవ్ యూ చెప్పేవాడు. తెలిసిన వ్యక్తి, మంచి వాడు, పైగా రెండు కుటుంబాల మధ్య మంచి రిలేషన్ ఉంది! కాబట్టి, పెళ్లికి ఒప్పుకుంటారని నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్‌లో ఓకే చెప్పాను. నాతో చాలా ప్రేమగా ఉండేవాడు. ఓ వ్యక్తినాపై ఇంతలా ప్రేమ చూపించడం నాకు బాగా నచ్చేది. చూస్తుండగానే మా ప్రేమలో ఏడేళ్లు ఇట్టే గడిచిపోయాయి. ఈ ఏడేళ్లలో ఎన్నో మార్పులు. నాకు, అతడికి మధ్య ఎన్నో కలవని పాయింట్లు ఉన్నాయి. రోజురోజుకు అతడిపై ప్రేమ తగ్గుతూ వచ్చింది. ఇక మీదట అతడితో కలిసి ఉండటం కుదరదనిపించింది. ఇదే విషయం అతడికి చాలాసార్లు చెప్పి చూశాను. ‘ నేను నీతో కలిసి ఉండలేను’ అని. దానికి అతడు చాలా సీరియస్ అయ్యేవాడు, బాగా తిట్టేవాడు. కొన్ని రోజుల తర్వాత క్షమాపణలు చెప్పి, ‘ నువ్వు కుదరదంటే నేను చచ్చిపోతాను’ అనేవాడు. అయినా పట్టువదలకుండా అతడికి నచ్చజెప్పటానికి ప్రయత్నించేదాన్ని. ‘మనిద్దరి దార్లు వేరు.. ఎప్పటికీ కలవవు’ అని. పట్టించుకునేవాడు కాడు. మేమిద్దరమూ పెళ్లి చేసుకోవాలనుకున్న విషయం మా ఇంట్లో వాళ్లకు కూడా తెలుసు. నేను మా ఇంట్లో ఈ విషయం చెప్పటానికి ప్రయత్నించినపుడు వాళ్లు కూడా నా మాట వినలేదు. అతడితో బ్రేకప్ చెప్పి, మా రిలేషన్‌కు ఓ ఎండ్‌కార్డ్ వేద్దామని చేస్తున్న ప్రయత్నం ఎప్పటికి ఫలిస్తుందో. - శీ విధ్య, సూర్యాపేట లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
తనతో గొడవ.. ఫైనల్ రౌండ్లో..
కాలేజీకి వెళ్లి చదువు కోవడం.. ఇంట్లో పని చేయడం తప్ప ఏమీ తెలియని నా జీవితంలోకి అనుకోకుండా ఓ అమ్మాయి వచ్చింది. ఎప్పుడూ గొడవ పడే మేము ఫ్రెండ్స్‌గా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. నేను ఏ అమ్మాయి గురించి మాట్లాడినా గొడవ పడేది. అప్పుడే అర్థం అయింది.. తను నన్ను ప్రేమిస్తోందని. తన పుట్టినరోజుకు ముందు రోజు నాకు ప్రపోజ్ చేసింది. అప్పుడు నాకు పెద్దగా ఏమీ అనిపించలేదు కానీ, హాలిడేస్‌కు తను ఇంటికి వెళుతుంటే నాకు ఏడుపొచ్చింది. ఆ రోజు అర్థమైంది! తనని నేను ప్రేమిస్తున్నానని. ‘నేను ఎక్కడికీ వెళ్లను బుజ్జి! మళ్లీ వస్తాగా’ అని తను వెళ్లిపోతుంటే చాలా బాధ. ఆ రోజు నుండి ఈ రోజు వరకు తను వచ్చి వెళ్లిన ప్రతీసారి బాధ పడుతూనే ఉన్నా. ఎందుకంటే ఎంత సేపు చూసినా తను నన్ను వదిలి వెళ్లే చివరి నిమిషం చాలా బాధిస్తోంది. అందరి లవ్ స్టోరీలో లాగే మా లవ్‌లో కూడా గొడవలు వచ్చాయి. కానీ, అపుడు మేము విడిపోలేదు. అడ్జస్ట్ అవుతూనే వచ్చాము. కానీ మా ప్రేమ పెళ్లి వరకు తీసుకు వెళ్లాలంటే మనీ, క్యాస్ట్ ప్రాబ్లమ్స్‌గా మారాయి. క్యాస్ట్ మార్చలేం కదా అందుకే మనీ అయినా ఉండాలనుకున్నాం. మాది ఒక పూర్ ఫ్యామిలీ! ఎంత పూర్ అంటే తనతో ఒక నైట్ ఫోన్ కాల్ మాట్లాడాలంటే వన్ డే హోటల్ సర్వర్‌గా పనిచేసే వాడిని. తనకి ఒక రింగ్ కొనాలని రెండు నెలలు బార్లో సర్వర్‌గా పని చేశా. తను రిచ్ గాళ్! ఎలా అయినా మా ఫ్యామిలీ, నేనూ డెవలప్ అవ్వాలనుకున్నాం. మా డాడీని ఒప్పించి చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాం. ఎలాగో డెవలప్ అయ్యాం. ఇక నేను మంచి జాబ్ చేయాలనుకున్నపుడు! ‘సాఫ్ట్వేర్ జాబ్ ట్రై చెయ్’ అని చెప్పింది. ఎందుకంటే కొద్ది టైంలో ఎక్కువ శాలరీ రావాలంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్ కరెక్ట్ అనుకున్నాం. తనని సీఏ చేయమని చెప్పా. నాకా ఒక ముక్క ఇంగ్లీష్ రాదు! సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఎలా? అనుకున్నా అప్పుడే వాళ్ల అక్కకి పెళ్లి చూపులు స్టార్ట్ అయ్యాయి. తరువాత తనకి, సో! త్వరగా కోర్స్ చేసి మంచి జాబ్ తెచ్చుకోవాలి. ఆరు నెలల్లో చేయాల్సిన కోర్స్ ఒక నెలలో చేసి జాబ్ ట్రైల్స్‌కు ఫిబ్రవరి 14న వెళ్లా. నాకు తన దగ్గరకి వెళ్లాలని ఉండేది. తనకేమో నేను జాబ్ కోసం వెళ్లాలని ఉండేది. జాబ్‌కోసం సెర్చ్ చేస్తున్న టైంలో తనకి ఎగ్జామ్స్. నేను ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యా! ఎంతో కష్టపడి ఇంటర్వ్యూ ఫైనల్ రౌండ్‌కు వెళ్లా. మా ఇద్దరి మధ్యా చిన్న గొడవ వల్ల సరిగా ఏకాగ్రత ఉంచలేక ఫైనల్ రౌండ్లో జాబ్ మిస్ అయింది. చదవకుండా టైం వేస్ట్ చేస్తోందని తనని తిట్టా. కానీ, మామూలే మళ్లీ చదవకుండా ఉండే సరికి కోపంలో బాగా తిట్టి, ‘నెల రోజులు వెయిట్ చెయ్ అమ్ము! గొడవ పడటానికి కరెక్ట్ టైం కాద’ని చెప్పా. వన్ మంత్ మాట్లాడలేదు. నాకు జాబ్ వచ్చేసింది! ఫుల్ హ్యాపీతో తనకి చెప్పా. అంతే ఏమైందో తెలీదు. ఆ వన్ మంత్ తను చాలా బాధ పడి నాపై ద్వేషం పెంచుకుంది. ‘నేను నీ సెకండ్ ఆప్షన్! నేను ఉంటే జాబ్ తెచ్చుకోలేవా’ అని వెళ్లి పోయింది. తనే తిరిగి వస్తుందిలే అనుకున్నా. కానీ రాలేదు . తను వస్తుందని 4 సంవత్సరాలుగా వెయిట్ చేస్తూనే ఉన్నా. ‘తప్పకుండా వస్తావ్ కదా అమ్ము .. నీకోసం ఎదురు చూస్తూనే వుంటా . మిస్ యూ అమ్ము.. లవ్ యు బంగారం ...లవ్ యూ ఫరెవర్ బంగారం.. - బుజ్జి లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
ఆ ఊహే బాగుంది! లేకుంటే..
అది 2005! నేను 8వ తరగతిలోకి అడుగు పెట్టాను. మా క్లాస్‌లో కొత్తగా ఓ అమ్మాయి చేరింది. తను ఆగష్టు 15న పాట పాడింది. మొదటి సారిగా తను పాడుతుంటే నేను వినడం. ఎంత స్వీట్ వాయిసో తనది! మళ్లీ మళ్లీ వినాలనిపించింది. రెండు జడలు వేసుకుని చాలా క్యూట్‌గా ఉండేది. స్కూల్ వెనకే వాళ్ల ఇల్లు. రోజు స్కూల్ అయిన వెంటనే తనని ఫాలో చేసేవాడిని. సెలవులు అయితే చాలు సైకిల్ వేసుకుని వాళ్ల వీధిలో తిరగటమే నా పని. నా ప్రేమ సంగతి ఆమెకు చెప్పాలంటే భయం. టెన్త్‌లో తను జాయిన్ అయిన ట్యూషన్లోనే నేనూ జాయిన్ అయ్యా. ఎప్పుడూ ఆమెను అలా చుస్తూ ఉండి పోయే వాడ్ని తప్ప ధైర్యం చేసి చెప్పలేకపోయా. నా బెస్ట్ ఫ్రెండ్ ఒకతను తనకి ప్రపోజ్ చేశాడు. ఇప్పుడు ప్రేమించే వయసు కాదని చెప్పి పంపింది. తన కళ్లను చూసినప్పుడల్లా తను నన్నే చూస్తోందని అనుకునే వాడ్ని. అలా టెన్త్ కూడా అయిపోయింది. తరువాత మేము వేరే వేరే కాలేజీలలో చేరటంతో దూరం పెరిగి పోయింది. కానీ, తను గుర్తుకు రాని రోజు లేదు. ఎప్పుడు తన ధ్యాసే. డిగ్రీ థర్డ్ ఇయర్లో ఉన్నపుడు తనకు పెళ్లి అయి పోయింది.ఇప్పటికీ అనుకుంటూ ఉంటా‘ ఒకవేళ తనకి చెప్పి ఉంటే నా ప్రేమను అంగీకరించి ఉండేదేమో?’ అని!(ఆ ఊహే బాగుంది లేకుంటే, నేను చెప్పి తను కాదని ఉంటే తట్టుకోలేకపోయేవాడ్ని). - మణికంఠ లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
నేనెంత పిచ్చిపని చేశానో అర్థమవుతోంది
కొన్ని సంవత్సరాల క్రితం నాకు ఇష్టం లేకపోయినా మా అమ్మానాన్నల బలవంతంమీద ఓ మాట్రిమొనియల్ సైట్లో నా వివరాలు నమోదుచేశా. ఆ మాట్రిమొనియల్ సైట్లోనే వరుణ్‌తో నాకు పరిచయం ఏర్పడింది. పరిచయం పెరిగే కొద్ది అతడిపై ప్రేమ పుడుతుందని భావించా. అయితే ఆ సమయంలో మానసికంగా నా ఆరోగ్యం అంతగా బాగోలేదు. నా బెస్ట్ ఫ్రెండ్స్‌తో కూడా ఈ విషయాలు మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అతడిని సరిగా పట్టించుకునేదాన్ని కాదు. అతడు మాత్రం నాకు తరచు ఫోన్ చేస్తుండేవాడు. ప్రేమగా మాట్లాడుతుండేవాడు. నాకు ఇష్టం లేకపోయినా ఇబ్బంది పడుతూనే మాట్లాడేదాన్ని. అతడి వైపునుంచి నాపై ఆశలు పెరుగుతూపోయాయి. నాకు మాత్రం అతడిమీద ఇష్టం కలగలేదు. దీంతో నాకు పెళ్లి ఇష్టం లేదని చెప్పి, వరుణ్‌తో మాట్లాడటం మానేశాను. అయితే పూర్తిగా సంబంధాలు తెంచుకున్న రెండు సంవత్సరాల తర్వాత అతడిపై ఇష్టం మొదలైంది. ఇప్పుడు ఆలోచిస్తుంటే నేనెంత పిచ్చిపని చేశానో అర్థమవుతోంది. తప్పు చేశానన్న భావనలోంచి బయటపడలేకుండా ఉన్నా. ఎలాగైనా అతడ్ని కలిసి క్షమాపణ చెప్పాలనిపిస్తోంది. దానికి తోడు మా వాళ్లు వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని చూస్తున్నారు. నాకు మాత్రం వరుణ్‌ను పెళ్లి చేసుకోవాలని ఉంది. అర్థం కాని విషయం ఏంటంటే అతడింకా పెళ్లి చేసుకోకుండా అలానే ఉన్నాడా? ఇప్పుడు నేను ఫోన్ చేస్తే ఎలా స్పందిస్తాడు? ఇలాంటి ప్రశ్నలే నా మెదడును తినేస్తున్నాయి. ఎలాగైనా అతడితో మాట్లాడాలని ఉంది. - శైలజా, చిత్తూరు చదవండి : ఆ రోజునే పెళ్లి చేసుకుంటాం! లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
నా లక్! ఆమె కూడా ఆ రోజునుంచి..
2006 నా లైఫ్‌ను మార్చేసిన సంవత్సరం. అవి నేను ఇంటర్ చదువుత్నురోజులు. చాలా అల్లరిగా.. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడిని. నేనప్పటివరకు ఏ అమ్మాయినీ లవ్ చేయలేదు. ఓ రోజు లంచ్ బ్రేక్‌లో.. క్లాస్ రూంలో ఓ ఇద్దరు ఫ్రెండ్స్ చాలా గట్టిగా మాట్లాడుకుంటున్నారు. ఏంట్రా మీ గోల అని నేను వెళ్లి అడిగాను. వాళ్లు ఒక అమ్మాయికోసం అని చెప్పారు. ‘ఏవర్రా అమ్మాయి’ అని అడిగా. వాళ్లు ఓ పేరు చెప్పారు. ‘ఆ అమ్మాయి నాకు తెలియదు రా!’ అన్నాను. ‘చూపిస్తాము ఆగు’ అన్నారు. అమ్మాయి కోసం వేయిట్ చేస్తున్నాం. అప్పుడు వచ్చింది.. నా లైఫ్‌లోకి ఒక అమ్మాయి. అలా గేట్ వైపు చూశాను. అప్పుడే సైకిల్ దిగి నడుచుకుంటూ వస్తోంది. ఆమె కళ్లు కారు లైట్లలా ఉన్నాయి. ఆ ఒక్క క్షణంలో నా మనసును దోచేసింది. ఇంకేం ఉంది! నా లైఫ్ పట్టాలు ఎక్కింది. ఇక ప్రతీరోజు తననే చూస్తూ, తను నవ్వితే నాలో తెలియని ఆనందం. ఫైనల్‌గా క్లాస్‌లోని కొందరు వెర్రి వాళ్లు నేనా అమ్మాయికి లైన్ వేస్తున్నానని చెప్పేశారు. అదేంటో నా లక్! తను ఆ రోజునుంచి నన్ను అబ్జర్వ్ చేస్తూ నావైపు చూస్తూ ఉండేది. అలా ఓ సంవత్సరం గడిచిపోయింది. ఇంటర్ సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది. నా మనసులోని మాట తనకు చెప్పలేకపోయా. తనే ధైర్యం చేసి ‘నన్ను లవ్ చేస్తున్నావా’ అని అడిగింది. కానీ, నేను పూర్ ఫ్యామిలీ, తనకి ప్రపోజ్ చేసే ధైర్యం చేయలేకపోయా. కానీ, తను చాలా సార్లు నా ప్రేమను తెలిపే చాన్స్‌లు ఇచ్చింది. నేనే ఉపయోగించుకోలేకపోయా. ఇంటర్ అయిపోయింది. తను డిగ్రీ, నేను బీటెక్ జాయిన్ అయ్యాను. అప్పటికీ నేను వాళ్ల కాలేజీకి వెళ్లే వాడిని తనను చూడటానికి. అయినా నా ప్రేమను తనకు చెప్పలేకపోయా. నా లైఫ్‌లో మర్చిపోలేని అమ్మాయి తను. 2012లో బీటెక్ అయిపోయింది. బెంగళూరులో జాబ్‌లో జాయిన్ అయ్యాను. తర్వాత తెలిసింది! తనకు పెళ్లి అయిపోయిందని. ఇప్పటికీ తను నా మనసులో ఉంది. - సందీప్, ఒంగోలు లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
తను నవ్వింది! బాగుందని పొగిడింది..
2008 డిసెంబర్ నెలలో సైన్స్ ఫేయిర్ కోసమని నాగలాండ్ బయలుదేరాం. విజయవాడనుంచి మా ప్రయాణం మొదలైంది. మూడు రోజుల పాటు ట్రైన్లో ప్రయాణిస్తే కానీ, మేము వెళ్లాల్సిన చోటుకు చేరుకోలేము. మొదటిసారి అన్ని రోజులు ప్రయాణించటం చాలా కొత్తగా ఉంది. సాయంత్రమే ట్రైన్ బయలుదేరింది. ఎవరి సీట్లు వాళ్లకు కేటాయించారు. ఓ రోజు ఆలోచిస్తూనే స్తబ్ధుగా గడిచిపోయింది. మరుసటి రోజునుంచి కొత్త స్నేహాలు మొదలయ్యాయి. ఆడ,మగ తేడాలేకుండా అందరం కలిసిపోయి బాగా మాట్లాడుకునేవాళ్లం. నాకు మామూలుగానే సిగ్గు ఎక్కువ. అయినప్పటికి కొంచెం ధైర్యం చేసి అందరితో కలిసిపోయాను. సాయంత్రం సరదాగా కబుర్లు చెప్పుకున్నాం, అంత్యాక్షరి ఆడుకున్నాం. అప్పుడే ఓ అమ్మాయి మాట, పలుకు, పాట నన్ను బాగా ఆకట్టుకున్నాయి. అప్పటివరకు నేను తన ముఖంవైపు నేరుగా చూడలేదు. అప్పుడు చూడాలనిపించి చూశా! చూడగానే నా మనసు దోచేసింది. అప్పటినుంచి ఆమె మాటలు కూడా నాకు తియ్యటి పాటల్లా వినిపించటం మొదలయ్యాయి. ఎందుకో ఒకరకమైన ఆకర్షణకు గురయ్యాను. ఏ పనీ లేకపోయినా తనకోసమే ఆమె బోగిలోకి వచ్చేవాడిని, అటు ఇటు తిరిగేవాడిని. మొత్తానికి తను కూడా నన్ను చూడటం మొదలుపెట్టింది. మరసటి రోజు సాయంత్రం మళ్లీ అందరు గ్రూపుగా అయ్యారు. సరదాగా మాట్లాడుకోవటం, పాడుకోవటం చేశారు. నేను తన ఎదురుగా కూర్చుని ఉన్నా. నేను పాడాల్సిన టైం వచ్చింది. ‘ నాలోనె పొంగెను నర్మదా.. నీళ్లలో పూసిన తామర.. అంతట్లో మారెను రుతువులా! పిల్లా నీ వల్ల’ తనవైపు చూస్తూ పాడాను. తను నవ్వింది! బాగుందని పొగిడింది. థాంక్స్ కూడా చెప్పింది.. కళ్లతో.. అది నాకు మాత్రమే అర్థమైంది. నాగాలాండ్‌లో ఉన్నన్ని రోజులు ఇద్దరం కలిసే ఉండేవాళ్లం. అయినా ఏదీ మాట్లాడుకునే వాళ్లం కాదు. అలా పది రోజులు! టెన్ బ్యూటిఫుల్ డేస్ తనతో ఉన్నాను. సైన్స్ ఫేయిర్ అయిపోయి తిరిగి వస్తున్నపుడు చాలా బాధేసింది. ఆ రోజు రాత్రి డిసెంబర్ 31.. ట్రైన్లోనే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నాం. అప్పట్లో మా దగ్గర ఫోన్లు ఉండేవి కావు. ఉన్నా ఏం లాభం ఈ పదిరోజుల్లో ఏ రోజూ మేము మాట్లాడుకోలేదు! ఏం చేస్తాం. మళ్లీ అందరూ ఓ చోట గ్రూపుగా అయ్యారు. పాటలు, ఆటలు మొదలుపెట్టారు. తనిప్పుడు నా ఎదురుగా ఉంది. ఇద్దరం ఒకరినొకరు చూసుకుంటున్నాం. ఎందుకో సందర్భం కాకపోయినా ఓ పాట‘ అదే నువ్వు! అదే నేను అదే గీతం పాడనా..’ తన కళ్లలో భావాల్ని నేను కనిపెట్టలేకపోయాను. అది బాధో! ప్రేమో!.. ఏదో తెలియదు కానీ, నా కళ్లు కొద్దిగా చెమర్చాయి. రాత్రి నిద్ర పట్టలేదు. తనను కలిసి కనీసం వెళ్లొస్తానని కూడా చెప్పలేకపోయాను. పొద్దున లేచే సరికే తను దిగిపోయింది. నా గుండెలో కలుక్కుమన్న భావన. మాట్లాడలేకపోయానని నన్ను నేను చాలా తిట్టుకున్నా. ఇది జరిగి దాదాపు 12 సంవత్సరాలు అవుతోంది. తన జ్ఞాపకాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. తన మనసులో నా స్థానం ఏంటన్న ప్రశ్న ఇప్పటికీ నన్ను తొలుస్తూనే ఉంది. - విఘ్నేశ్, రాయచోటి -
బెస్ట్ ఫ్రెండ్ ప్రేమిస్తున్నాడని తెలిసి..
డిగ్రీ అయిపోగానే జర్నలిజం చేయటానికి హైదరాబాద్‌లోని ఓ కాలేజ్‌లో చేరాను. జర్నలిజం అంటే నాకు చిన్నప్పటినుంచి ఇష్టం. కాలేజ్‌కు దగ్గరలో ఓ హాస్టల్లో ఉండేదాన్ని. క్లాసులు స్టార్ట్ అయిన కొద్ది రోజుల వరకు నాకెవరూ ఫ్రెండ్స్ అవ్వలేదు. నెల తర్వాత అందరితో నాకు మంచి బాండ్ ఏర్పడింది. ముఖ్యంగా రాజీవ్‌తో! అతడు నా బెస్ట్ ఫ్రెండ్. అన్ని విషయాల్లో తోడుగా ఉండేవాడు. పర్సనల్ విషయాలను సైతం షేర్ చేసుకునేవాళ్లం. అయినప్పటికి ఎప్పుడూ హద్దులు దాటలేదు. కించపర్చుకునేలా మాట్లాడుకోలేదు. అతనంటే నాకు అభిమానం, గౌరవం ఏర్పడింది. అతడికి కూడా నేనంటే అంతే మర్యాద. చూస్తుండగానే రోజులు ఇట్టే గడిచిపోయాయి. ఉద్యోగాలు ఇద్దరినీ దూరం చేశాయి. ఎంత దూరం ఉన్నా మేము రెగ్యులర్‌గా ఫోన్లోనో, సోషల్ మీడియాలోనో టచ్‌లో ఉండేవాళ్లం. ఉద్యోగంలో చేరిన కొద్దిరోజులకే నాకు పెళ్లి జరిగింది. అతడ్ని కూడా పెళ్లికి పిలిచా! రాలేదు. తర్వాత చాలా రోజులు అతడితో నేను టచ్‌లో లేను. ఓ సంవత్సరం తర్వాత అతడే నాకు కాల్ చేశాడు. ఇక అప్పటినుంచి మేము టచ్‌లో ఉంటున్నాం. ఓ సారి మాటల సందర్భంలో ‘‘ఇంకెన్నాళ్లని ఇలా ఉంటావ్. పెళ్లి చేసుకోవా’’ అని అడిగా. అందుకు తను నన్ను ఎదురు ప్రశ్నించాడు‘‘ నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావ్?’’ అని. నేను షాక్ అయ్యాను. వెంటనే తేరుకుని‘‘ నాకు పెళ్లి చేసుకోవాలని ఉండింది. అందుకే చేసుకున్నాను’’ అని చెప్పా. దానికి అతడు ‘‘ నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. నేను చేసుకోను’’ అన్నాడు. అతడి మాటల్లో ఏదో బాధ తొంగిచూసింది. నాకప్పుడర్థమైంది! రాజీవ్ నన్ను ప్రేమిస్తున్నాడని. అతడు ఇన్ని రోజులు చూపించిన అభిమానం, గౌరవం నాపై ప్రేమ అని తెలిసి నా మనసులో ఏదో మూల బాధకలిగింది. ఫోన్ పెట్టేసి బాగా ఏడ్చాను. అతను చాలా మంచి వాడు. తను ప్రేమకు దూరమవ్వటానికి నేనే కారణమని తట్టుకోలేకపోతున్నా. అప్పుడు అతడి ప్రేమను అర్థం చేసుకోలేకపోయా. ధైర్యం చేసి తను కూడా చెప్పలేకపోయాడు. బెస్ట్ ఫ్రెండ్ ప్రేమిస్తున్నాడని తెలిసి ఏం చేయాలో అర్థం కావటం లేదు. - మౌనిక, బళ్లారి -
నాకు పెళ్లయ్యింది..పర్లేదు వచ్చెయ్
డిగ్రీ అయిపోయాక గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అవుతున్న సమయంలో ఆర్ఆర్బీ పోస్టులు పడటంతో ఓ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాను. చదువు, ఇళ్లు తప్పా ఇంకేమీ తెలియదు. ఇన్స్టిట్యూట్లో నాకు చాలా మంది ప్రపోజ్ చేశారు. కానీ నేను అవన్నీ పట్టించుకునేదాన్ని కాదు. ఒకరోజు లంచ్ టైంలో నాతో మాట్లాడటానికి ట్రై చేశాడు. ఏదో బుక్ కావాలనే సాకుతో మాట్లాడుతున్నాడు. లైట్ తీసుకున్నా. తర్వాత అప్పుడప్పుడు హాయ్, హలో చెప్పుకునేవాళ్లం. ఒకరోజు వచ్చి నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఐడీ అడిగాడు. ఫ్రెండ్లీగానే అనుకొని నేను చెప్పా. తర్వాత ఫేస్బుక్లో మెసేజ్‌లు చేసేవాడు. చాలా క్యాజువల్‌గా మాట్లాడుకునేవాళ్లం. ఒకరోజు ప్రపోజ్ చేశాడు. తను చాలా మంచివాడు. ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, నేనంటే చాలా ఇష్టం. ఇంకేముంది..తను వద్దని చెప్పడానికి నా దగ్గర ఒక్క కారణం కూడా లేదు. అలా తన ప్రపోజల్‌కి కొన్ని నెలల తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చా. కానీ మేం పెద్దగా మాట్లాడుకునేవాళ్లం కాదు. అప్పుడప్పుడు చాటింగ్, లేదా కాల్స్. ఒక్కసారి కూడా బయటికి వెళ్లలేదు. ఈ గ్యాప్‌లోనే తనకు మంచి జాబ్ వచ్చి చెన్నై వెళ్లిపోయాడు. అందరిలాగే మా రిలేషన్‌లోనూ చిన్నచిన్న గొడవలు అయ్యేవి. కొన్నిసార్లు రోజుల పాటు మాట్లాడకుండా ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇంతలో మావాళ్లు నాకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. విషయం తనకు చెప్పా. పెద్దగా రెస్పాన్స్ ఏమీ లేదు. అసలు పట్టించుకునేవాడు కాదు. పైగా ఇలాంటి అనవసరమైన విషయాలు చెప్పి నా టైం వేస్ట్ చేయకు అని కసిరేవాడు. చాలా బాధేసేది. ఎవరికి చెప్పాలో అర్థమయ్యేది కాదు. రెండు నెలల తర్వాత నాకు ఓ సంబంధం ఫిక్స్ చేశారు మా పేరేంట్స్. విషయం చెప్పా. మళ్లీ అదే వెటకారం. కంగ్రాట్స్, హ్యాపీగా పెళ్లి చేసుకో అన్నాడు. నా గుండె పగిలినంత బాధ. ప్రేమించే వ్యక్తితో..నాకు వేరే వాళ్లతో పెళ్లి ఫిక్స్ అయ్యింది అని చెబితే కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన తనని ఏం అనాలి? నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ పెళ్లి నాకు వద్దు అని గట్టిగా అరవాలనిపించేది. ఏమీ చేయలేని నిస్సహాయత. పెళ్లికి మావాళ్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో తన నుంచి కాల్ వచ్చింది. ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకో. నాకు నువ్వు కావాలి అని. ఈ విషయం నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడూ రియాక్ట్ అయ్యుంటే పరిస్థితి వేరేలా ఉండేది. పెళ్లికి ఇంకా కొన్ని రోజులుండగా ఇలా చెబితే నేనేం చేయాలి?అప్పటికే పెళ్లి ఏర్పాట్లన్నీ అయిపోయాయి. ఇరు కుటుంబాల్లో నెలకొన్న సంతోషాన్ని, పరువును దూరం చేయడం ఇష్టంలేక..పెళ్లికి సిద్ధపడ్డాను. నా మ్యారేజ్ అయ్యాక తనే నన్ను మర్చిపోతాడులే అనుకున్నా. ఎందుకంటే తను అన్నింటినీ లైట్ తీసుకుంటాడు అనుకున్నా. పరిస్థితులు మారాయి. నా పెళ్లి జరిగి మూడు నెలలైనా నన్ను మర్చిపోలేదు. నా కోసం పిచ్చివాడిలా మారాడని ఫ్రెండ్స్ ద్వారా తెలిసి..ఏడ్వటం తప్పా ఇంకేమీ చేయలేను. మా ఊర్లో తెలిసిన బందువుల ఇంట్లో ఫంక్షన్ ఉంటే వెళ్లాను. తను అక్కడికి వచ్చాడు. నీతో మాట్లాడాలి. బైక్ ఎక్కు అన్నాడు. తనకి నశ్చచెప్పడానికి ట్రై చేశా. తను నా మాట వినలేదు. నేనే అక్కడ్నుంచి వెళ్లిపోయా. తర్వాత తెలిసిందేమంటే తను ఆ రోజంతా అక్కడే నాకోసం వెయిట్ చేశాడని. చాలా సార్లు తనని కన్విన్స్ చేయడానికి ట్రై చేశా. తను మాత్రం అస్సలు వినట్లేదు. నా భర్తతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పెడితే చాలు..తన కోపం కట్టలు తెచ్చుకుంటుంది. కోపంతో పిచ్చోడిలా బిహేవ్ చేస్తూ సూసైడ్‌కి కూడా ప్రయత్నించాడు. తను ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదు. ఇప్పటికీ నాతో వచ్చెచ్ పెళ్లిచేసుకుందాం అంటాడు. ప్రేమ మా జీవితాలతో ఎలా చెలగాటం ఆడుతుందో చూడండి. తన కోసం ఆరోజు నేనెంత ప్రాధేయపడ్డా, బతిమిలాడా...కానీ తను మాత్రం ఎంతో నిర్లక్ష్యంగా మాట్లాడాడు. ఇప్పడు నాకు వేరే అబ్బాయితో పెళ్లయ్యింది. విలువలు, కట్టుబాట్లను తెంచుకొని నీకోసం నేను రాలేనురా నన్ను క్షమించి. నా నిస్సహాయతను అర్థం చేసుకో. నా మీద ప్రేమ చంపేసుకో. నీకు నా కన్నా మంచి అమ్మాయి భార్యగా రావాలని కోరుకుంటున్నా. దయచేసి నీ జీవితంలో ఇంకో అమ్మాయికి చోటివ్వు. --- ఇట్లు నీ స్వీటి -
కాలం వెంట కరిగిపోని విషాద ప్రేమకథ
అందుకే... అంత బాగుంది : శ్రీను వైట్ల టైటానిక్ (1997) తారాగణం - లియొనార్డో డికాప్రియో, కేట్ విన్స్లెట్, బిల్లీ జేన్; ఛాయాగ్రహణం - రస్సెల్ కార్పెంటర్; రచన, నిర్మాణం, దర్శకత్వం - జేమ్స్ కామెరూన్; నిడివి - 194 నిమిషాలు; విడుదల - 1997 డిసెంబర్ 19; నిర్మాణ వ్యయం - 20 కోట్ల డాలర్లు (ఇప్పటి లెక్కలో దాదాపు రూ. 1200 కోట్లు); బాక్సాఫీస్ వసూళ్ళు - 218. 7 కోట్ల డాలర్లు (దాదాపు రూ. 13,122 కోట్లు) అప్పటికి నేను డెరైక్టర్ని కాలేదు. డెరైక్షన్ కోసం ప్రయత్నాల్లో ఉన్నాను. ఆ రోజు - సికింద్రాబాద్‌లోని సంగీత్ థియేటర్లో ఫస్ట్ షో సినిమాకెళ్లా. అక్కడ ఇసుక వేస్తే రాలనంత జనం. ఓ ఇంగ్లీషు సినిమాకి అంత మంది జనాన్ని చూడడం అదే మొదటిసారి. సినిమా స్టార్ట్ అయ్యింది. ఇక అక్కణ్ణుంచీ నాలో నేను లేను. మనసు టైటానిక్ షిప్ ఎక్కేసింది. ఆ షిప్లో ఉన్న వందల మంది జనంలో నేనూ ఒకణ్ణి అన్నట్టుగా ఉంది. ఆ 194 నిమిషాలూ ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్లిపోయాన్నేను. ‘టైటానిక్’... ఈ పేరు తలుచు కుంటేనే ఏదో పులకింత. ఇప్పటి వరకూ బోలెడన్ని హాలీవుడ్ సినిమాలు చూసి ఉంటా. కానీ, నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ఏదంటే తడుముకోకుండా చెప్పే పేరు.. ‘టైటానిక్’ (1997). మామూలుగా హాలీవుడ్ సినిమాలకు సంబంధించి హీరో హీరోయిన్లూ, డెరైక్టర్ పేర్లు మాత్రమే గుర్తుంటాయి. కానీ, ఈ సినిమాకు పనిచేసిన అందరు టెక్నీషియన్ల పేర్లు దాదాపుగా నాకు గుర్తున్నాయి. ముఖ్యంగా హీరో లియోనార్డో డికాప్రియో, హీరోయిన్ కేట్ విన్స్లెట్, డెరైక్టర్ జేమ్స్ కామరూన్ పేర్లు అయితే మనం ఎప్పటికీ మరిచిపోలేం. అంతలా వాళ్లు మనతో కనెక్ట్ అయిపోయారు. ఇవాళ్టికీ ఎప్పుడైనా రీచార్జ్ కావాలనుకున్నప్పుడు నేను చూసే సినిమా ఇదే. నేను ఎక్కువసార్లు చూసిన సినిమా ఇదే. టైటానిక్ అనగానే మనకు చరిత్ర పరంగా షిప్ సముద్రంలో మునిగి పోయి, వందల మంది చనిపోయిన ఉదంతం గుర్తుకొస్తుంది. ఆ విషాద దుర్ఘటనకు ఒక అందమైన ప్రేమకథను జోడించడం దర్శకుడి సృజనకు పరాకాష్ఠ. ఆ కథ అందరి హృదయాలను హత్తుకుంది. జాక్ ఒక పేదింటి అబ్బాయి. లాటరీలో రెండు టికెట్లు గెల్చుకుని టైటానిక్ షిప్లో థర్డ్ క్లాస్‌లో ప్రయాణం చేసే అవకాశం దక్కించు కుంటాడు. స్నేహితు నితో సహా ఎంతో హుషారుగా ఆ భారీ ఓడలోకి అడుగు పెడతాడు. అదే ఓడలో ప్రయాణం చేస్తున్న అందాల సుందరి రోజ్ అతని కంటపడుతుంది. ఇద్దరి మనసులూ కలుస్తాయి. రోజ్కి కాబోయే భర్త ఇది గ్రహించేసి జాక్‌ని దూరం పెట్టడానికి ప్రయత్నిస్తాడు. అతని కళ్లుగప్పి జాక్, రోజ్ ప్రేమించుకుంటుంటారు. కానీ, విధి విచిత్రమైనది. ఆ ఓడ ఓ బలమైన రాయిని ఢీ కొంటుంది. ఓడ మునిగిపోవడం ఖాయం. వీలైనంతమందిని కాపాడే ప్రయత్నంలో సిబ్బంది ఉంటారు. ఈ ఓడ ప్రమాదంలో జాక్ మునిగిపోతాడు. రోజ్ బతుకుతుంది. ఇదీ కథ. ప్రపంచ చరిత్రలోనే అత్యంత విషాదమైన టైటానిక్ ప్రమాదానికి, ఇలా ఇద్దరు యువ ప్రేమికుల గాఢమైన ప్రేమను ముడిపెట్టి, మునుపెన్నడూ చూడని స్పెషల్ ఎఫెక్ట్‌లతో సినిమాను ఉద్విగ్నభరితంగా తీయడం కామెరూన్‌కే చెల్లింది. ఈ సినిమా సాంకేతికంగా ఎంత అద్భుతంగా ఉంటుందో, ప్రేక్షకుల్ని ఆ పాత్రలు, సన్నివేశాల్లో లీనం చేసి, భావోద్విగ్నభరిత అనుభవంలో ముంచెత్తడంలో అంతకన్నా అద్భుతంగా ఉంటుంది. ఒక క్యారెక్టర్ పాయింటాఫ్ వ్యూలో సినిమాను చూపించడం గొప్ప థాట్. సర్వసాధారణంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టే సినిమాల్లోనూ విమర్శకులు ఏవో తప్పులు చెబుతుంటారు. కానీ, ఈ సినిమాను విమర్శకులు కూడా మెచ్చారు. ఆస్కార్ పురస్కారాల్లో 14 నామినేషన్స్ సాధించిన ఘనత ఈ సినిమాకే దక్కుతుంది. 1950లో ‘ఆల్ ఎబౌట్ ఈవ్’ సినిమాకు కూడా 14 నామినేషన్లు వచ్చాయి. మొత్తానికి ‘టైటానిక్’ చిత్రం ఏకంగా 11 ఆస్కార్లు గెలుచుకుంది. ఒక హాలీవుడ్ సినిమాకు ఇన్ని ఆస్కార్లు రావడమనేది అంతకు ముందు ‘బెన్హర్’ (1959) విషయంలో జరిగింది. వసూళ్ల పరంగా బిలియన్ డాలర్ల మార్కు దాటిన తొలి సినిమా కూడా ఇదే. దర్శకుడు జేమ్స్ కామెరూన్‌కు ఈ సినిమాపై మక్కువ తీరక, ఓడ ప్రమాదం జరిగి వందేళ్ళవుతున్న వేళ ‘టైటానిక్ -3డి’ వెర్షన్‌ను 2012 ఏప్రిల్ 4న విడుదల చేశారు. అది కూడా పెద్ద హిట్టే. అదనంగా 343.6 మిలియన్ డాలర్లు వసూలు చేసింది ఈ త్రీడీ వెర్షన్. అనేక సినిమాలు వాణిజ్య విజయం సాధిస్తాయి. కానీ, కొన్ని సినిమాలే బాక్సాఫీస్ బద్దలు కొట్టడంతో పాటు చిరకాలం ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాయి. అలాంటి అరుదైన హాలీవుడ్ ఆణిముత్యం - ‘టైటానిక్’. ఈ సినిమా చూస్తుంటే, అప్రయత్నంగా మీకు కన్నీళ్ళొస్తాయి. దూరమైన ఆ ప్రేమ జంటను చూస్తుంటే, గుండె పిండేసినట్లవుతుంది. వెరసి, సినిమా చూసిన అనుభవం నుంచి తొందరగా తేరుకోలేరు. పెపైచ్చు, వీలున్నప్పుడల్లా ఆ కథను మళ్ళీ మళ్ళీ మీకు కావాల్సినవాళ్ళతో కలసి తెరపై చూడాలనిపిస్తుంది. అందుకే, ‘టైటానిక్’ నాకు ఇష్టమైన ఆధునిక హాలీవుడ్ కళాఖండం. సెల్యులాయిడ్ సైంటిస్ట్ ఇవాళ్టి తరానికి జేమ్స్ కామెరూన్ పేరు చెప్పగానే సంచలనాత్మక సైన్స్-ఫిక్షన్ చిత్రం ‘అవతార్’ (2009) గుర్తుకొస్తుంది. కానీ, సినీ రచయిత, దర్శకుడు, నిర్మాత జేమ్స్ ఫ్రాన్సిస్ కామెరూన్ గడచిన మూడున్నర దశాబ్దాల కాలంలో హాలీవుడ్ తెరపై సృష్టించిన అద్భుతం అదొక్కటే కాదు. బాక్సాఫీస్ చరిత్రలో అతి పెద్ద హిట్లుగా ఇప్పటికీ చెప్పుకొనే - సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘టెర్మినేటర్ (1984), విషాదాంత ప్రేమకథ ‘టైటానిక్’ (’97) ఆయన సృష్టే. ‘ఎలియెన్స్’ (’86), ‘ది ఎబిస్’ (’89), ‘ట్రూ లైస్’ (’94) ఆయన అందించినవే. సినిమాలతో పాటు డాక్యుమెంటరీల రూపకల్పనలోనూ కామెరూన్‌ది ప్రత్యేక ముద్ర. నీటి లోపల దృశ్యాలను చిత్రీకరించడం లాంటి విషయాల్లో ఎంతో నైపుణ్యం సంపాదించిన ఆయనకు ‘డిజిటల్ 3డి ఫ్యూజన్ కెమేరా సిస్టమ్’ రూపకల్పనలోనూ భాగం ఉంది. ఇవన్నీ చూసే ఆయనను కొందరు ‘సగం సైంటిస్ట్, సగం ఆర్టిస్ట్’గా పేర్కొంటూ ఉంటారు. కామెరూన్ దర్శకత్వ శైలి హాలీవుడ్‌తో సహా పలువురు చిత్ర దర్శకులపై గణనీయమైన ప్రభావం చూపింది. టైటానిక్ అణువణువూ ఆసక్తికరమే! ఈ చిత్రానికి ముందుగా ‘ప్లానెట్ ఐస్’ అని పేరు పెడదామను కున్నారట! కానీ, చివరకు ‘టైటానిక్’ ఓడ పేరునే సినిమాకూ పెట్టారు వాస్తవికతకు ఎంత ప్రాధాన్యమిచ్చారంటే... టైటానిక్ ఓడను నిజంగా నిర్మించిన ‘వైట్ స్టార్ లైన్’ కంపెనీ మీద పరిశోధనలు చేసిన వారి పర్యవేక్షణలోనే ఈ సినిమా కోసం ఓడనూ, దాని లోపలి హంగూ ఆర్భాటాలనూ తీర్చిదిద్దారు సినిమాలో కథానాయక పాత్ర జాక్ (నటుడు లియొనార్డో డికాప్రియో), కథానాయిక రోజ్ (నటి కేట్ విన్స్లెట్) రేఖాచిత్రాలను గీస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ, ఆ బొమ్మలు గీస్తున్నట్లు సినిమాలో కనిపించేవి హీరోవి కావు - దర్శకుడు కామెరూన్వి. ఆయనే ఆ స్కెచ్బుక్లోని బొమ్మలన్నీ గీశారు ఈ సినిమా కోసం అత్యంత భారీ ఓడ సెట్‌ను వేశారు. ఆ సెట్ మొత్తాన్నీ హైడ్రాలిక్ జాక్స్ మీద ఉంచారు. ఓడ మునిగిపోతూ, ఒరిగిపోతున్న దృశ్యాలు తీసేందుకు వీలుగా దాదాపు 6 డిగ్రీల మేర సెట్టింగ్ మొత్తం పక్కకు ఒరిగేలా అలా సౌకర్యం ఉంచుకున్నారు గ్రాండ్ స్టెయిర్‌కేస్ రూమ్‌లోకి నీళ్ళు చొచ్చుకువచ్చే సీన్‌ను పక్కాగా ప్లాన్ చేశారు. ఎందుకంటే, ఆ నీళ్ళలో మొత్తం సెట్, ఫర్నిషింగ్‌లు పాడైపోతాయి కాబట్టి, ఒకే ఒక్క షాట్లో అనుకొన్న ఎఫెక్ట్ వచ్చేలా చిత్రీకరించాల్సి వచ్చింది డిజిటల్ ప్రదర్శన ఇంకా రాని ఆ రోజుల్లో ఈ సినిమా ఎంత బ్రహ్మాండంగా, ఎన్నేసి రోజులు, ఎన్నేసి ప్రదర్శనలు ఆడిందంటే, ప్రొజెక్టర్‌లో వేసీ వేసీ, రీళ్ళు గీతలు పడిపోవడంతో సినిమా పంపిణీదారులైన ‘పారామౌంట్’ వాళ్ళు కొత్త కాపీలను పంపాల్సి వచ్చిందట! ఒక పక్కన థియేటర్లలో బ్రహ్మాండంగా ఆడుతున్న రోజుల్లోనే జనం డిమాండ్ మేరకు ‘టైటానిక్’ చిత్రం వీడియోగా కూడా విడుదలైపోయింది. అప్పట్లో అలా జరిగిన తొలి చిత్రం అదే!