కాలం వెంట కరిగిపోని విషాద ప్రేమకథ | The Sinking of the Titanic, 1997 | Sakshi
Sakshi News home page

కాలం వెంట కరిగిపోని విషాద ప్రేమకథ

Published Sun, Feb 15 2015 11:08 PM | Last Updated on Sat, Sep 2 2017 9:23 PM

కాలం వెంట కరిగిపోని విషాద ప్రేమకథ

కాలం వెంట కరిగిపోని విషాద ప్రేమకథ

అందుకే... అంత బాగుంది  : శ్రీను వైట్ల
 టైటానిక్ (1997)
 తారాగణం - లియొనార్డో డికాప్రియో, కేట్ విన్‌స్లెట్, బిల్లీ జేన్; ఛాయాగ్రహణం - రస్సెల్ కార్పెంటర్; రచన, నిర్మాణం, దర్శకత్వం - జేమ్స్ కామెరూన్; నిడివి - 194 నిమిషాలు; విడుదల - 1997 డిసెంబర్ 19; నిర్మాణ వ్యయం - 20 కోట్ల డాలర్లు (ఇప్పటి లెక్కలో దాదాపు రూ. 1200 కోట్లు); బాక్సాఫీస్ వసూళ్ళు - 218. 7 కోట్ల డాలర్లు (దాదాపు రూ. 13,122 కోట్లు)
 
 అప్పటికి నేను డెరైక్టర్‌ని కాలేదు. డెరైక్షన్ కోసం ప్రయత్నాల్లో ఉన్నాను. ఆ రోజు - సికింద్రాబాద్‌లోని సంగీత్ థియేటర్‌లో ఫస్ట్ షో సినిమాకెళ్లా. అక్కడ ఇసుక వేస్తే రాలనంత జనం. ఓ ఇంగ్లీషు సినిమాకి అంత మంది జనాన్ని చూడడం అదే మొదటిసారి. సినిమా స్టార్ట్ అయ్యింది. ఇక అక్కణ్ణుంచీ నాలో నేను లేను. మనసు టైటానిక్ షిప్ ఎక్కేసింది. ఆ షిప్‌లో ఉన్న వందల మంది జనంలో నేనూ ఒకణ్ణి అన్నట్టుగా ఉంది.
 
 ఆ 194 నిమిషాలూ ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్లిపోయాన్నేను.
 ‘టైటానిక్’... ఈ పేరు తలుచు కుంటేనే ఏదో పులకింత. ఇప్పటి వరకూ బోలెడన్ని హాలీవుడ్ సినిమాలు చూసి ఉంటా. కానీ, నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ఏదంటే తడుముకోకుండా చెప్పే పేరు.. ‘టైటానిక్’ (1997). మామూలుగా హాలీవుడ్ సినిమాలకు సంబంధించి హీరో హీరోయిన్లూ, డెరైక్టర్ పేర్లు మాత్రమే గుర్తుంటాయి. కానీ, ఈ సినిమాకు పనిచేసిన అందరు టెక్నీషియన్ల పేర్లు దాదాపుగా నాకు గుర్తున్నాయి. ముఖ్యంగా హీరో లియోనార్డో డికాప్రియో, హీరోయిన్ కేట్ విన్‌స్లెట్, డెరైక్టర్ జేమ్స్ కామరూన్ పేర్లు అయితే మనం ఎప్పటికీ మరిచిపోలేం. అంతలా వాళ్లు మనతో కనెక్ట్ అయిపోయారు.
 
 ఇవాళ్టికీ ఎప్పుడైనా రీచార్జ్ కావాలనుకున్నప్పుడు నేను చూసే సినిమా ఇదే. నేను ఎక్కువసార్లు చూసిన సినిమా ఇదే.
 టైటానిక్ అనగానే మనకు చరిత్ర పరంగా షిప్ సముద్రంలో మునిగి పోయి, వందల మంది చనిపోయిన ఉదంతం గుర్తుకొస్తుంది. ఆ విషాద దుర్ఘటనకు ఒక అందమైన ప్రేమకథను జోడించడం దర్శకుడి సృజనకు పరాకాష్ఠ. ఆ కథ అందరి హృదయాలను హత్తుకుంది. జాక్ ఒక పేదింటి అబ్బాయి. లాటరీలో రెండు టికెట్లు గెల్చుకుని టైటానిక్ షిప్‌లో థర్డ్ క్లాస్‌లో ప్రయాణం చేసే అవకాశం దక్కించు కుంటాడు. స్నేహితు నితో సహా ఎంతో హుషారుగా ఆ భారీ ఓడలోకి అడుగు పెడతాడు. అదే ఓడలో ప్రయాణం చేస్తున్న అందాల సుందరి రోజ్ అతని కంటపడుతుంది. ఇద్దరి మనసులూ కలుస్తాయి. రోజ్‌కి కాబోయే భర్త ఇది గ్రహించేసి జాక్‌ని దూరం పెట్టడానికి ప్రయత్నిస్తాడు. అతని కళ్లుగప్పి జాక్, రోజ్ ప్రేమించుకుంటుంటారు. కానీ, విధి విచిత్రమైనది. ఆ ఓడ ఓ బలమైన రాయిని ఢీ కొంటుంది. ఓడ మునిగిపోవడం ఖాయం. వీలైనంతమందిని కాపాడే ప్రయత్నంలో సిబ్బంది ఉంటారు. ఈ ఓడ ప్రమాదంలో జాక్ మునిగిపోతాడు. రోజ్ బతుకుతుంది. ఇదీ కథ.
 
 ప్రపంచ చరిత్రలోనే  అత్యంత విషాదమైన టైటానిక్ ప్రమాదానికి, ఇలా ఇద్దరు యువ ప్రేమికుల గాఢమైన ప్రేమను ముడిపెట్టి, మునుపెన్నడూ చూడని స్పెషల్ ఎఫెక్ట్‌లతో సినిమాను ఉద్విగ్నభరితంగా తీయడం కామెరూన్‌కే చెల్లింది. ఈ సినిమా సాంకేతికంగా ఎంత అద్భుతంగా ఉంటుందో, ప్రేక్షకుల్ని ఆ పాత్రలు, సన్నివేశాల్లో లీనం చేసి, భావోద్విగ్నభరిత అనుభవంలో ముంచెత్తడంలో అంతకన్నా అద్భుతంగా ఉంటుంది. ఒక క్యారెక్టర్ పాయింటాఫ్ వ్యూలో సినిమాను చూపించడం గొప్ప థాట్.
 
 సర్వసాధారణంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టే సినిమాల్లోనూ విమర్శకులు ఏవో తప్పులు చెబుతుంటారు. కానీ, ఈ సినిమాను విమర్శకులు కూడా మెచ్చారు. ఆస్కార్ పురస్కారాల్లో 14 నామినేషన్స్ సాధించిన ఘనత ఈ సినిమాకే దక్కుతుంది. 1950లో ‘ఆల్ ఎబౌట్ ఈవ్’ సినిమాకు కూడా 14 నామినేషన్లు వచ్చాయి. మొత్తానికి ‘టైటానిక్’ చిత్రం ఏకంగా 11 ఆస్కార్‌లు గెలుచుకుంది. ఒక హాలీవుడ్ సినిమాకు ఇన్ని ఆస్కార్లు రావడమనేది అంతకు ముందు ‘బెన్‌హర్’ (1959) విషయంలో జరిగింది. వసూళ్ల పరంగా బిలియన్ డాలర్ల మార్కు దాటిన తొలి సినిమా కూడా ఇదే.
 
 దర్శకుడు జేమ్స్ కామెరూన్‌కు ఈ సినిమాపై మక్కువ తీరక, ఓడ ప్రమాదం జరిగి వందేళ్ళవుతున్న వేళ
 ‘టైటానిక్ -3డి’ వెర్షన్‌ను 2012 ఏప్రిల్ 4న విడుదల చేశారు. అది కూడా పెద్ద హిట్టే. అదనంగా 343.6 మిలియన్ డాలర్లు వసూలు చేసింది ఈ త్రీడీ వెర్షన్. అనేక సినిమాలు వాణిజ్య విజయం సాధిస్తాయి. కానీ,  కొన్ని సినిమాలే బాక్సాఫీస్ బద్దలు కొట్టడంతో పాటు చిరకాలం ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాయి. అలాంటి అరుదైన హాలీవుడ్ ఆణిముత్యం - ‘టైటానిక్’. ఈ సినిమా చూస్తుంటే, అప్రయత్నంగా మీకు కన్నీళ్ళొస్తాయి. దూరమైన ఆ ప్రేమ జంటను చూస్తుంటే, గుండె పిండేసినట్లవుతుంది. వెరసి, సినిమా చూసిన అనుభవం నుంచి తొందరగా తేరుకోలేరు. పెపైచ్చు, వీలున్నప్పుడల్లా ఆ కథను మళ్ళీ మళ్ళీ మీకు కావాల్సినవాళ్ళతో కలసి తెరపై చూడాలనిపిస్తుంది. అందుకే, ‘టైటానిక్’ నాకు ఇష్టమైన ఆధునిక హాలీవుడ్ కళాఖండం.
 
 సెల్యులాయిడ్ సైంటిస్ట్
 ఇవాళ్టి తరానికి జేమ్స్ కామెరూన్ పేరు చెప్పగానే సంచలనాత్మక సైన్స్-ఫిక్షన్ చిత్రం ‘అవతార్’ (2009) గుర్తుకొస్తుంది. కానీ, సినీ రచయిత, దర్శకుడు, నిర్మాత జేమ్స్ ఫ్రాన్సిస్ కామెరూన్ గడచిన మూడున్నర దశాబ్దాల కాలంలో హాలీవుడ్ తెరపై సృష్టించిన అద్భుతం అదొక్కటే కాదు. బాక్సాఫీస్ చరిత్రలో అతి పెద్ద హిట్లుగా ఇప్పటికీ చెప్పుకొనే - సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘టెర్మినేటర్ (1984), విషాదాంత ప్రేమకథ ‘టైటానిక్’ (’97) ఆయన సృష్టే. ‘ఎలియెన్స్’ (’86), ‘ది ఎబిస్’ (’89), ‘ట్రూ లైస్’ (’94) ఆయన అందించినవే. సినిమాలతో పాటు డాక్యుమెంటరీల రూపకల్పనలోనూ కామెరూన్‌ది ప్రత్యేక ముద్ర. నీటి లోపల దృశ్యాలను చిత్రీకరించడం లాంటి విషయాల్లో ఎంతో నైపుణ్యం సంపాదించిన ఆయనకు ‘డిజిటల్ 3డి ఫ్యూజన్ కెమేరా సిస్టమ్’ రూపకల్పనలోనూ భాగం ఉంది. ఇవన్నీ చూసే ఆయనను కొందరు ‘సగం సైంటిస్ట్, సగం ఆర్టిస్ట్’గా పేర్కొంటూ ఉంటారు. కామెరూన్ దర్శకత్వ శైలి హాలీవుడ్‌తో సహా పలువురు చిత్ర దర్శకులపై గణనీయమైన ప్రభావం చూపింది.
 
 టైటానిక్ అణువణువూ ఆసక్తికరమే!
  ఈ చిత్రానికి ముందుగా ‘ప్లానెట్ ఐస్’ అని పేరు పెడదామను కున్నారట! కానీ, చివరకు ‘టైటానిక్’ ఓడ పేరునే సినిమాకూ పెట్టారు  వాస్తవికతకు ఎంత ప్రాధాన్యమిచ్చారంటే... టైటానిక్ ఓడను నిజంగా నిర్మించిన ‘వైట్ స్టార్ లైన్’ కంపెనీ మీద పరిశోధనలు చేసిన వారి పర్యవేక్షణలోనే ఈ సినిమా కోసం ఓడనూ, దాని లోపలి హంగూ ఆర్భాటాలనూ తీర్చిదిద్దారు   సినిమాలో కథానాయక పాత్ర జాక్ (నటుడు లియొనార్డో డికాప్రియో), కథానాయిక రోజ్ (నటి కేట్ విన్‌స్లెట్) రేఖాచిత్రాలను గీస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ, ఆ బొమ్మలు గీస్తున్నట్లు సినిమాలో కనిపించేవి హీరోవి కావు - దర్శకుడు కామెరూన్‌వి. ఆయనే ఆ స్కెచ్‌బుక్‌లోని బొమ్మలన్నీ గీశారు  ఈ సినిమా కోసం అత్యంత భారీ ఓడ సెట్‌ను వేశారు. ఆ సెట్ మొత్తాన్నీ హైడ్రాలిక్ జాక్స్ మీద ఉంచారు. ఓడ మునిగిపోతూ, ఒరిగిపోతున్న దృశ్యాలు తీసేందుకు వీలుగా దాదాపు 6 డిగ్రీల మేర సెట్టింగ్ మొత్తం పక్కకు ఒరిగేలా అలా సౌకర్యం ఉంచుకున్నారు  గ్రాండ్ స్టెయిర్‌కేస్ రూమ్‌లోకి  నీళ్ళు చొచ్చుకువచ్చే సీన్‌ను పక్కాగా ప్లాన్ చేశారు.
 
  ఎందుకంటే, ఆ నీళ్ళలో మొత్తం సెట్, ఫర్నిషింగ్‌లు పాడైపోతాయి కాబట్టి, ఒకే ఒక్క షాట్‌లో అనుకొన్న ఎఫెక్ట్ వచ్చేలా చిత్రీకరించాల్సి వచ్చింది  డిజిటల్ ప్రదర్శన ఇంకా రాని ఆ రోజుల్లో ఈ సినిమా ఎంత బ్రహ్మాండంగా, ఎన్నేసి రోజులు, ఎన్నేసి ప్రదర్శనలు ఆడిందంటే, ప్రొజెక్టర్‌లో వేసీ వేసీ, రీళ్ళు గీతలు పడిపోవడంతో సినిమా పంపిణీదారులైన ‘పారామౌంట్’ వాళ్ళు కొత్త కాపీలను పంపాల్సి వచ్చిందట!   ఒక పక్కన థియేటర్లలో బ్రహ్మాండంగా ఆడుతున్న రోజుల్లోనే జనం డిమాండ్ మేరకు ‘టైటానిక్’ చిత్రం వీడియోగా కూడా విడుదలైపోయింది. అప్పట్లో అలా జరిగిన తొలి చిత్రం అదే!
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement