ప్రతీకాత్మక చిత్రం
2008 డిసెంబర్ నెలలో సైన్స్ ఫేయిర్ కోసమని నాగలాండ్ బయలుదేరాం. విజయవాడనుంచి మా ప్రయాణం మొదలైంది. మూడు రోజుల పాటు ట్రైన్‌లో ప్రయాణిస్తే కానీ, మేము వెళ్లాల్సిన చోటుకు చేరుకోలేము. మొదటిసారి అన్ని రోజులు ప్రయాణించటం చాలా కొత్తగా ఉంది. సాయంత్రమే ట్రైన్ బయలుదేరింది. ఎవరి సీట్లు వాళ్లకు కేటాయించారు. ఓ రోజు ఆలోచిస్తూనే స్తబ్ధుగా గడిచిపోయింది. మరుసటి రోజునుంచి కొత్త స్నేహాలు మొదలయ్యాయి. ఆడ,మగ తేడాలేకుండా అందరం కలిసిపోయి బాగా మాట్లాడుకునేవాళ్లం. నాకు మామూలుగానే సిగ్గు ఎక్కువ. అయినప్పటికి కొంచెం ధైర్యం చేసి అందరితో కలిసిపోయాను. సాయంత్రం సరదాగా కబుర్లు చెప్పుకున్నాం, అంత్యాక్షరి ఆడుకున్నాం. అప్పుడే ఓ అమ్మాయి మాట, పలుకు, పాట నన్ను బాగా ఆకట్టుకున్నాయి. అప్పటివరకు నేను తన ముఖంవైపు నేరుగా చూడలేదు. అప్పుడు చూడాలనిపించి చూశా! చూడగానే నా మనసు దోచేసింది. అప్పటినుంచి ఆమె మాటలు కూడా నాకు తియ్యటి పాటల్లా వినిపించటం మొదలయ్యాయి.
ఎందుకో ఒకరకమైన ఆకర్షణకు గురయ్యాను. ఏ పనీ లేకపోయినా తనకోసమే ఆమె బోగిలోకి వచ్చేవాడిని, అటు ఇటు తిరిగేవాడిని. మొత్తానికి తను కూడా నన్ను చూడటం మొదలుపెట్టింది. మరసటి రోజు సాయంత్రం మళ్లీ అందరు గ్రూపుగా అయ్యారు. సరదాగా మాట్లాడుకోవటం, పాడుకోవటం చేశారు. నేను తన ఎదురుగా కూర్చుని ఉన్నా. నేను పాడాల్సిన టైం వచ్చింది. ‘ నాలోనె పొంగెను నర్మదా.. నీళ్లలో పూసిన తామర.. అంతట్లో మారెను రుతువులా! పిల్లా నీ వల్ల’ తనవైపు చూస్తూ పాడాను. తను నవ్వింది! బాగుందని పొగిడింది. థాంక్స్ కూడా చెప్పింది.. కళ్లతో.. అది నాకు మాత్రమే అర్థమైంది. నాగాలాండ్‌లో ఉన్నన్ని రోజులు ఇద్దరం కలిసే ఉండేవాళ్లం. అయినా ఏదీ మాట్లాడుకునే వాళ్లం కాదు. అలా పది రోజులు! టెన్ బ్యూటిఫుల్ డేస్ తనతో ఉన్నాను. సైన్స్ ఫేయిర్ అయిపోయి తిరిగి వస్తున్నపుడు చాలా బాధేసింది.
ఆ రోజు రాత్రి డిసెంబర్ 31.. ట్రైన్‌లోనే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నాం. అప్పట్లో మా దగ్గర ఫోన్లు ఉండేవి కావు. ఉన్నా ఏం లాభం ఈ పదిరోజుల్లో ఏ రోజూ మేము మాట్లాడుకోలేదు! ఏం చేస్తాం. మళ్లీ అందరూ ఓ చోట గ్రూపుగా అయ్యారు. పాటలు, ఆటలు మొదలుపెట్టారు. తనిప్పుడు నా ఎదురుగా ఉంది. ఇద్దరం ఒకరినొకరు చూసుకుంటున్నాం. ఎందుకో సందర్భం కాకపోయినా ఓ పాట‘ అదే నువ్వు! అదే నేను అదే గీతం పాడనా..’ తన కళ్లలో భావాల్ని నేను కనిపెట్టలేకపోయాను. అది బాధో! ప్రేమో!.. ఏదో తెలియదు కానీ, నా కళ్లు కొద్దిగా చెమర్చాయి. రాత్రి నిద్ర పట్టలేదు. తనను కలిసి కనీసం వెళ్లొస్తానని కూడా చెప్పలేకపోయాను. పొద్దున లేచే సరికే తను దిగిపోయింది. నా గుండెలో కలుక్కుమన్న భావన. మాట్లాడలేకపోయానని నన్ను నేను చాలా తిట్టుకున్నా. ఇది జరిగి దాదాపు 12 సంవత్సరాలు అవుతోంది. తన జ్ఞాపకాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. తన మనసులో నా స్థానం ఏంటన్న ప్రశ్న ఇప్పటికీ నన్ను తొలుస్తూనే ఉంది.
- విఘ్నేశ్, రాయచోటి
Comments
Please login to add a commentAdd a comment