
ప్రతీకాత్మక చిత్రం
కాలేజీలో చేరిన కొత్తలో ఓ రోజు... మా క్లాస్‌లోకి అడుగుపెట్టింది హెచ్‌ఆర్‌ఎమ్ లెక్షరర్. ఆమెను చూడగానే నా చిన్ననాటి స్నేహితురాలు? గుర్తుకు వచ్చింది. ఆమె వయసు నా కంటే 2,3 సంవత్సరాలు అటుఇటుగా ఉంటుంది. దీంతో ఆమె మీద అభిమానం మొదలైంది. ఆ రోజు క్లాస్‌లో హోం వర్కు ఇచ్చి మరుసటి రోజు రాసుకుని రమ్మంది. ఆమె మీద ఉన్న అభిమానంతో ఓ స్పైరల్ బైండింగ్ బుక్‌లోని పేపర్ చించిమరీ హోంవర్కు రాశాను. మరుసటి ఆమె అందరి దగ్గరా హోంవర్కు పేపర్లును కలెక్ట్ చేస్తోంది. నేను నా పేపర్‌ను ఆమెకిచ్చాను. ఆమె దాన్ని చూడగానే ‘ఏం బాబు! ఇంతకంటే మంచి పేపర్ దొరకలేదా?’ అంటూ ఆ పేపర్‌ను నా ముఖాన కొట్టినంత పనిచేసింది. నా ఈగో దెబ్బతింది! ‘ఏదో అభిమానం కొద్ది ఖరీదైన పుస్తకంలోని పేపర్ చించి రాస్తే.. నా ముఖాన కొడుతుందా’ అని ఆమె మీద అలిగాను. ఇందులో ఆవిడ తప్పుకుడా ఏం లేదు.. ఎందుకంటే ఇక్కడ ఆ పేపర్ అంచులు కుక్కలు చింపిన ఇస్తర్లలా ఉన్నాయి. అందుకే ఆమె కొప్పడ్డది. ఓ రోజు ఆమె క్లాసులు చెబుతుంటే నా లోకంలో నేను ఉన్నాను.
ఇది గమనించిన ఆమె నన్ను పిలిచి ‘ ఏం బాబు! క్లాసు బోరుకొడుతోందా?’ అని అడిగింది. ఆమె అలా హఠాత్తుగా అడిగే సరికి నా గుండె జారిపోయినంతపనైంది. అందరిముందు బుక్కయ్యానన్న ఫీలింగ్. వెంటనే ‘లేదు మేడమ్’ అని చెప్పి క్లాసు మీద శ్రద్ధ చూపించాను. అప్పటినుంచి నాలో భయం, చిరుకోపం మొదలైంది. ఆమె క్లాసంటే కళ్లప్పగించి మరీ వినేవాడిని, ఆమె నన్ను టార్గెట్ చేస్తుందేమోనని కళ్లు కూడా పక్కకు తిప్పకుండా ఆమె వైపు చూసేవాడిని. ఓ రోజు క్లాసులోకి అడుగుపెట్టి పోడియం దగ్గరకు వెళ్లగానే ఆమె నన్ను పైకి లేపింది. నేను షాక్!. ఏవో క్వశ్చన్లు అడిగింది. ఏదో చెప్పటానికి ట్రై చేశా.. అరకొరగా చెప్పా. ఆ వెంటనే ఆమె ‘ బాగా చెప్పావ్! క్లాప్స్ కొట్టండమ్మా’ అంది మా క్లాస్ మేట్స్‌ని.
‘నేనేమి చెప్పానో నాకు కూడా అర్థం కాలేదు. ఈమెకు ఏం అర్థం అయ్యింది?’ అనుకున్నా మనసులో. అలా ఓ రెండు సార్లు అడిగింది. అప్పటినుంచి ఆమె చెప్పిన క్లాసులను శ్రద్ధగా వినేవాడిని, నేర్చుకునేవాడిని. అయితే క్లాసులో ఒక్కొక్కరిగా అందర్ని క్వచ్చన్లు అడిగి నన్ను మాత్రం అడిగేది కాదు. ఆ రోజునుంచి ఆమె మీద నాకు ఏదో తెలియని ఇది మొదలైంది. ఆమె క్లాసు చెప్పటానికి రాకపోతే ఏదో వెలితిగా అనిపించేది. ఆమె కారణంగా నాకు హెచ్‌ఆర్ సబ్జెక్టు ఇష్టమైన సబ్జెక్టుగా అయిపోయింది. యాధృచ్ఛికమో, దేవుడిలీలో వారంలో చాలా రోజులు మేము వేసుకున్న డ్రెస్ కలర్లు మ్యాచ్ అయ్యేవి. కాలేజ్ క్యాంపస్‌లో ఆమె ఎక్కడన్నా ఎదురైతే నా గుండె వేగంగా కొట్టుకునేది.
అప్పుడప్పుడు మా కళ్లు కలుసుకునేవి. ఓ రోజు మార్కెటింగ్ క్లాస్ జరుగుతోంది. అప్పుడు తనొచ్చింది. హ్యాపీగా ఫీలయ్యా! చేతిలోంచి ఏదో కార్డు తీసి సార్‌కు ఇస్తోంది. ఏంటా అని చూస్తే పెళ్లి పత్రిక.. నేను షాక్! ఏదో తెలియని బాధమొదలైంది. ఆమెకు పెళ్లవుతుందని కాదు! నా నుంచి తను దూరం అయిపోతుందని. మరుసటి రోజు నీరసంగా క్లాస్‌కు వచ్చాను. మాటల సందర్భంలో ఆ పెళ్లి వాళ్ల అక్కదని తెలిసింది. చాలా సంతోషించాను. సైడ్ లుక్స్‌తో కాలం ఇట్టే గడిచిపోయింది. రెండేళ్లు పూర్తయ్యాయి. థర్డ్ ఇయర్ మొదలైంది. ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో తీపి గుర్తులు.. థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్ పూర్తవుతున్నపుడు తను మా కాలేజీనుంచి వేరే కాలేజీకి వెళ్లిపోయింది. (గమనిక : ఇది నా వైపు నుంచి నేను ఊహించుకున్న ప్రేమ కథ)
- వెంకీ, కర్నూలు
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment