ఆమె మాటలు విని నేను షాక్‌! | Gokul Ramana Happy Ending Telugu Love Story Gooty | Sakshi
Sakshi News home page

ఆమె మాటలు విని నేను షాక్‌!

Feb 14 2020 4:50 PM | Updated on Feb 14 2020 7:27 PM

Gokul Ramana Happy Ending Telugu Love Story Gooty - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తన పేరు కౌసల్య! మెడిసిన్‌ చదువుతున్నపుడు మా మధ్య ప్రేమ చిగురించింది. మెడిసిన్‌ అయిపోయిన తర్వాత వేరు వేరు హాస్పిటల్లలో డాక్టర్లుగా జాయిన్‌ అయ్యాం. తరచూ ఫోన్‌లో మాట్లాడుకునే వాళ్లం. ఎంత బిజీగా ఉన్నా.. వారంలో కనీసం మూడు సార్లైనా కలుసుకునేవాళ్లం. మా ప్రేమలో నాలుగు సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. చిన్నచిన్న గొడవలు, అలకలు, సర్దుకుపోవడాలు మామూలైపోయాయి. అయినా మా మధ్య ప్రేమ తగ్గలేదు. ఇద్దరివీ వేరువేరు కులాలు! పెద్ద వాళ్లను ఒప్పించటానికి కష్టపడాల్సి వస్తుందనుకున్నాం. అనుకున్నట్లుగానే జరిగింది. తన ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకున్నా. మా ఇంట్లో ససేమీరా! అన్నారు. నిత్యం మా వాళ్లతో గొడవలు పడేవాడ్ని. మా ఇంట్లో మా పెళ్లికి ఒప్పుకోవటం లేదని కౌసల్య వాళ్ల ఇంట్లో తెలిసినప్పటినుంచి వాళ్లలో మార్పు వచ్చింది. నేను వాళ్ల ఇంటికి వెళ్లినపుడు సరిగా పలకరించేవారు కాదు. నేను మాత్రం పట్టించుకునేవాడిని కాదు. నెల రోజుల తర్వాత మా ఇంట్లో కూడా పెళ్లికి ఒప్పుకున్నారు. నా ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

వెంటనే తనకు ఫోన్‌ చేసి విషయం చెప్పా. తను మొదట నమ్మలేదు! నిజమని తెలిసి సంతోషించి. ఇంట్లో వాళ్లకు చెప్పి ఫోన్‌ చేస్తానంది. నేను తన ఫోన్‌ కోసం ఎదురు చూస్తూ ఉన్నా. కానీ గంటలు గడుస్తున్నా తన నుంచి ఫోన్‌ రాలేదు. నేను ఫోన్‌ చేస్తుంటే తియ్యటం లేదు. రాత్రి పడుకోబోయేముందు ఓ సారి ట్రై చేద్దామని ఫోన్‌ చేశా. తను ఫోన్‌ ఎత్తింది. నా మాటలకు సరిగా స్పందించ లేదు. ఏమైందని అడిగా.. ఏం లేదంది. చెప్పమని పట్టుబట్టే సరికి చెప్పింది. తన మాటలు విని నేను షాక్‌ అయ్యాను. ఈ పెళ్లి తన ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదంట. ఎందుకంటే మా అమ్మానాన్నలకు ఇష్టం లేకుండా కౌసల్యను పెళ్లిచేసుకుంటే. అత్తారింట్లో వేధింపులు తప్పవని వాళ్లు భయపడుతున్నారు. నేను వాళ్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాను. పెళ్లైన తర్వాత వేరు కాపురం పెడతానని కూడా మాటిచ్చాను.

ఏం చెప్పినా వినే పరిస్థితిలో వాళ్లు లేరు. కొన్ని రోజులకే కౌసల్యకు వేరే వ్యక్తితో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. నేను తనని ఇంటికి తీసుకొస్తానని మా అమ్మానాన్నకు చెప్పా. వాళ్లు ఒప్పుకోలేదు. కౌసల్య అమ్మానాన్నలు ఒప్పుకుంటేగానీ, పెళ్లి జరగదని తెగేసి చెప్పారు. తన మనసులో ఏం ఉందో అడిగా.. తను మాత్రం నేనేం చేసినా తనకు ఓకే అంది. ఆ మరుసటి రోజే రిజిస్ట్రర్‌ ఆఫీసులో పెళ్లి చేసుకున్నాం. రెండు ఇళ్లకు దూరంగా ఇళ్లు తీసుకుని కాపురం పెట్టాం. సంవత్సరం గడిచింది. కౌసల్య ఇంట్లో వాళ్లు మాతో కలిసిపోయారు. కానీ, మా ఇంట్లో వాళ్లు సీరియస్‌గానే ఉన్నారు. మేము విడిపోయి పెద్దవాళ్లను సంతోషపెట్టగలమనే నమ్మకం నాకు లేదు. పిల్లల సంతోషం పెద్దలకు ముఖ్యం కానప్పుడు వారి గురించి ఎందుకు ఆలోచించాలి అనిపించింది. అందుకే అలా చేశా. మా వాళ్లు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా..
- గోకుల్‌ రమణ, గుత్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement