
తన పేరు ఏంజిల్ (నేను అలానే పిలుస్తాను). ఎంసెట్ కౌన్సిలింగ్‌లో చూశా నా ఏంజిల్‌ని. తొలిచూపు ప్రేమంటే అప్పటి వరకు నమ్మని నేను తనని చూడగానే ఫిక్స్ అయ్యా ఈ అమ్మాయే నా దేవత అని. సాయంత్రం వరకు జరిగింది కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా. తనతో పాటు వాళ్ల ఫ్రెండ్ లిల్లి ఉంది. వెళ్లేటప్పుడు అడిగా నా ఏంజిల్ నెంబర్ ఇవ్వమని. కొంచెం ఆలోచించి నెంబర్ ఇచ్చింది. ఆ తర్వాత ప్రతీరోజు చాట్ చేసేవాళ్లం. కొన్నాళ్లకు నాకో నిజం తెలిసింది ఏంటంటే..నేను చాట్ చేస్తున్నాది నా ఏంజిల్‌తో కాదు, లిల్లీతో అని. చాలా కోపమొచ్చింది లిల్లీపై. ఎందుకు ఇలా చేశావని అడిగితే తన దగ్గర్నుంచి సమాధానం రాలేదు.
తర్వాత నా ఏంజిల్ నుంచి కాల్ వచ్చింది. ఐస్‌క్రీమ్ పార్లర్‌లో కలుద్దాం అని. అప్పటివరకు చాలా కోపంగా ఉన్న నాకు ఏంజిల్ మాటలు చల్లని జలపాతాల్లా అనిపించాయి. వెళ్లాను నా ఏంజిల్‌తో పాటు లిల్లీ కూడా అక్కడికి వచ్చింది. తనపై చాలా కోపంగా ఉన్నానని అర్థమయ్యినట్లుంది. రాగానే ఇద్దరూ నాకు సారీ చెప్పారు. ఎందుకు ఇలా చేశావ్ అని లిల్లీని గట్టిగా నిలదీశాను. నేనే ఇలా చేయమన్నాను అంది నా ఏంజిల్. ఆశ్చర్యంతో ఎందుకు అని అడిగాను. ఇప్పటి వరకు చాలా మంది ప్రపోజ్ చేశారు. నువ్వు కూడా చూడగానే నెంబర్ అడిగావ్ అంటే ఖవ్చితంగా ప్రపోజ్ చేస్తావ్ అని డౌట్ వచ్చింది అందుకే నువ్వు ఎలాంటివాడివో తెలుసుకుందాం అని మా ఫ్రెండ్‌తో చాట్ చేయించా అంది. నాకేం అర్థం కాలేదు. కానీ నా గురించి తెలుసుకోవాలని చాట్ చేసింది అంటే ఎక్కడో నామీద మంచి అభిప్రాయం ఉందనే కదా అని లోలోపలే నవ్వుకున్నా. తర్వాత నా ఏంజిల్‌తో కాల్స్, చాటింగ్ అలా రోజులు గడిచాయి. నాతో ఏంజిల్ చాలా సరదాగా మాట్లాడుతుంది. ఇద్దరం కలిసి ఎన్నో సినిమాలకు వెళ్లాం.
ఇంక లేట్ చేయకుండా నా మనసులో చెప్పాలని డిసైడ్ అయ్యా. ఒకరోజంతా ఎలా ప్రపోజ్ చేస్తే బావుంటుందని తెగ ప్రాక్టీస్ చేశా. తర్వాతి రోజు తనకి కాల్ చేసి ప్రపోజ్ చేశా. వెంటనే కాల్ కట్ చేసింది. ఏం అయ్యిందో అర్థం కాలేదు కానీ రెండు గంటల తర్వాత ఒక ఎస్‌ఎంఎస్ వచ్చింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని. నా లైఫ్‌లో ఫస్ట్ టైం అనిపించింది ఏదో సాధించానని. ఆరోజు నుంచి నా జీవితం మరింత అందంగా అనిపిస్తుంది.
--సాండీ, గుంటూర్
Comments
Please login to add a commentAdd a comment