
ప్రతీకాత్మక చిత్రం
చిన్నప్పటినుంచి నా మరదలే నా భార్య అంటూ ఇంట్లో బయట అందరూ అనేవాళ్లు. అప్పుడు చాలా కోపంగా అనిపించేది. వీల్లేంటి నాతో ఇలా అంటున్నారని. తర్వాత చాలా కాలం తనను చూడలేదు. ఒకసారి వాళ్ల ఊరిలో ఫంక్షన్‌కు వెళ్లినపుడు చూశా. చాలా అందంగా కనిపించింది. నేను జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత ఓ రోజు తను మా ఊరు వచ్చింది. అప్పుడు నేను ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని అడిగా. సమాధానం చెప్పకుండా వెళ్లిపోయింది. వెయిట్ చేయాలా అని అడిగితే తెలియదంది. తనకు నా మీద ఆ అభిప్రాయం లేదేమోనని ఊరుకున్నాను. ఆ తర్వాత మా అమ్మ అడిగింది ‘ తనను పెళ్లి చేసుకోరా! మీ ఇద్దరు బాగుంటారు’ అని. నేను చూద్దాంలే అమ్మా అని ఊరుకున్నా.
ఒకసారి వాళ్ల ఊరు వెళ్లినపుడు ఎదురుపడి ఇద్దరం అలా నిలజడిపోయాం. ఇంతలో అక్క కొడుకు నిద్రలేచి ఏడుపు మొదలుపెట్టాడు. దీంతో అక్కా వాళ్లు మా దగ్గరకు వచ్చేశారు. అరే మాట్లాడే ఛాన్స్ మిస్సయిందే అని చాలా బాధపడ్డా. ఇవన్నీ మనకు సెట్టవ్వవులే అనుకుని ఊరికే ఉన్నా. ‘సంబంధం చూస్తే చేసుకుంటావా?’ అని చుట్టాలెవరో అడిగారు. నేను ‘ఇప్పుడే వద్దులే’ అని అన్నా. ఇంతలో ఒకసారి అక్కకు కాల్ చేస్తే కలవలేదు. అప్పుడు మరదలు వాళ్ల ఇంటికి ఫోన్ చేస్తే తనే ఫోన్ తీసుకెళ్లింది.
అక్కతో మాట్లాడి ఫోన్ కట్ చేశాక తనే కాల్ చేసింది. ‘ఏమి కాల్ చేశావు’ అని అడిగితే ‘ ఇప్పటివరకు నువ్వు చెప్తావని ఎదురు చూశా. ఎప్పుడో నాలుగేళ్ల క్రితం ఏమో తెలియదు అన్నానని ఇప్పుడు నువ్వేమీ చెప్పట్లేదు. నేనంటే నీకు ఇష్టం పోయిందా.’ అని అడిగింది. నాకు మాటలు రాలేదు. ‘మనం పెళ్లి చేసుకుందాం రా!’ అంది. ఎగిరి గంతేశా. నాన్నతో చెప్పా తనని చేసుకుంటానని. ఓకే చెప్పేశారు. త్వరలో తనతో నా కొత్త జీవితం ప్రారంభం కాబోతోంది. ఆ కలల్లోనే ఇప్పుడు తేలిపోతున్నా.
- రామ్, శ్రీకాకుళం
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి