అన్నీ భరించాం.. అప్పులు కూడా తీర్చాం | Suresh, Manasa Happy Ending Love Story in Telugu | Sakshi
Sakshi News home page

అన్నీ భరించాం.. అప్పులు కూడా తీర్చాం

Published Wed, Nov 20 2019 2:59 PM | Last Updated on Wed, Nov 20 2019 3:38 PM

Suresh, Manasa Happy Ending Love Story in Telugu - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంబీఏ కోసం మ్యాట్‌కు ప్రిపేర్‌ అవుతూ డిగ్రీ చదువుకున్న కాలేజీలోనే డ్యాన్స్‌ నేర్పుతుండేవాడిని. అప్పుడు యూనివర్శిటీ పోటీల కోసం డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ జరుగుతోంది. ఓ రోజు డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా పంజాబీ డ్రస్‌ వేసుకున్న ఓ అమ్మాయి మా రూంలోకి అడుగుపెట్టగానే నన్ను నేను మర్చిపోయా. తనను అలా చూస్తూ ఉండిపోయా. నా ఫ్రెండ్‌ ‘హాయ్‌ రా మామా!’ అంటూ నన్ను డిస్ట్రబ్‌ చేయటంతో తేరుకున్నాను. అప్పటినుంచి తనపై నాలో ప్రేమ మొదలైంది. మెల్లగా నేను తనతో పరిచయం పెంచుకున్నాను. యూనివర్శిటీ పోటీల కంటే ముందు నా కోసం ఓసారి చికెన్‌ చేసుకువచ్చింది. చికెన్‌ కర్రీ సూపర్‌గా చేసింది. ఫస్ట్‌ టైం నాకోసం చేసిందట. అప్పటికి కూడా మేమిద్దరం లవ్‌ ప్రపోజ్‌ చేసుకోలేదు. తన అల్లరి, మాట, ప్రవర్తన చూసి చిలిపిగా తనను‘కంచు’ అని నిక్‌నేమ్‌ పెట్టాను. ఇలా సాగుతుండగా ఫిబ్రవరి 14న ఒక రోజ్‌ తీసుకెళ్లి తన ఇంటి దగ్గర ప్రపోజ్‌ చేశా.

అంగీకరిస్తుందని అనుకోలేదు. కొన్ని రోజుల తర్వాత ఓకే చెప్పింది. అందరికీ లవ్‌ ప్రాబ్లమ్‌ ఉంటుంది కానీ, మాకు మాత్రం తన అమ్మ ప్రాబ్లమ్‌. ఒక రోజు తను తన అమ్మతో గొడవపడి ఇంటినుంచి వెళ్లిపోయింది. ఆ విషయం నాకు చెప్పలేదు. చెప్పాలా.. వద్దా! అని చాలా ఆలోచించింది. నా ఫ్యామిలీనే నన్ను చూసుకోకపోతే నేనెవరికోసం  బ్రతకాలి అన్న కోపంతో ఆ నైట్‌ ఇంటినుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత నాకు కాల్‌ చేసింది. ‘ఇంట్లో నుంచి నేను వెళ్లిపోతున్నా అని ఎవరికీ చెప్పకూడదనుకున్నా కానీ, నీకు చెప్పాలిగా’ అంది. ఆ క్షణం నా గుండె 100లో కొట్టుకుంది. వెంటనే నా స్నేహితుడు ఇమ్రాన్‌ బైక్‌ తీసుకుని వెళ్లా. అక్కడ తనను కలిసి కొద్దిరోజుల తర్వాత పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చా. తనొక చోట నేనొక చోట జాబ్‌లో జాయిన్‌ అయ్యాం. కానీ తనను కలవకుండా నేనుండలేకపోయా. ఇంట్లో ఏదో అబద్దం చెప్పి తన ఊరికి వెళ్లి తనను తీసుకుని తిరుపతికి వెళ్లొచ్చాం.

ఇక అక్కడనుంచి తిరిగి ఇంటికి చేరుకున్నా మదిలో తెలియని బాధ. మళ్లీ వారం తర్వాత మానస వాళ్ల ఇంటికి వెళ్లి నాతో వస్తావా రావా అని సీరియస్‌గా అడిగేశా. ఆ వెంటనే తను కూడా నా మాటను నన్ను నమ్ని వెంటనే నాతో వచ్చేందుకు సిద్ధమయింది. కానీ మానస వాళ్ల అమ్మ మమ్మల్ని ఆపడానికి చాలా ప్రయత్నించింది. మేము ఎవరినీ లెక్క చేయకుండా బస్టాండ్‌కి వెళితే దొరికి పోతామని.. ఇంకో ఊరికి ఆటోలో వెళ్లి అక్కడ నుంచి మొత్తానికి తప్పించుకుని బెంగళూర్‌ చేరుకున్నాం. మాకు ఇక జీవితంలో మంచి చెడు చెప్పే పెద్దల సపోర్ట్‌ లేకపోవడంతో జీవితం ఏమవుతుందో అన్న భయం మాలో మొదలయింది. కానీ అన్నిటిని ఎదిరించి వచ్చాం.

ఇక ఎలాగైనా మా బతుకులు మేము బతకాలని నిర్ణయించుకుని మాకు దగ్గరలోనే ఉన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వివాహం చేసుకున్నాం. తర్వాత మేం చూడని కష్టం లేదు. అన్నిటినీ తట్టుకున్నాం. కొన్ని రోజులు పిల్లలు వద్దనుకున్నాం. ఆ సమయంలో అమ్మ, నాన్నలు కానీ.. అత్తామామల నుంచి కానీ ఎక్కడా మాకు ఆదరణ లేకపోయింది. కొద్దిరోజులకు తండ్రి చేసిన అప్పులు తీర్చడానికి మాత్రం నేను గుర్తొచ్చాను. అన్నీ భరించాం. ఆ అప్పులు కూడా తీర్చాం. ఇంత కష్టంలో కూడా మా ఇద్దరి మధ్య ఏ రోజూ ఎలాంటి గొడవ రాలేదు. ఇప్పుడు అన్ని విధాలుగా మా వరకు మేం బాగున్నాం. ఇప్పుడు నేను మా మానస, మాకో నాను(అదేనండీ మాకో బాబు). జీవితం అలా సాఫీగా గడిచిపోతోంది.
- సురేష్‌, అనంతపురం


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement