గర్భవతినయ్యా.. సమాజం కోసం తప్పు చేయను | Un married College Girl Pregnent story | Sakshi
Sakshi News home page

గర్భవతినయ్యా.. సమాజం కోసం తప్పు చేయను

Published Tue, Oct 1 2019 12:08 PM | Last Updated on Sat, Oct 5 2019 11:42 AM

Un married College Girl Pregnent story - Sakshi

అమ్మ గెస్టెడ్‌ ఆఫీసర్‌, నాన్న బిజినెస్‌ మెన్‌. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండటంతో చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెంచారు. కాలం గడుస్తున్న కొద్ది అమ్మ నాన్నలు వారి పనుల్లో బిజీగా ఉంటడంతో వారితో కనీసం మాట్లాడటానికి కూడా సరిగ్గా సమయం దొరికేది కాదు. ఎదురుపడితే వారి నుంచి వచ్చే మొదటి మాట డబ్బులేమైనా కావాలారా?  అంటూ అడిగి పని ఉందంటూ వెళ్లిపోయేవారు. అప్పుడే ఇంటర్‌మీడియట్‌ పూర్తయింది. మంచి మార్కులు రావడం, ప్రఖ్యాత యూనివర్సిటీల్లో సీటు రావడంతో మా స్నేహితులందరం ఆస్ట్రేలియాకు సరదాగా వెళ్లాం. 

ఆస్ట్రేలియా వెళుతుండగా మొదటిసారి విమానంలో చందర్‌ని చూశా. మా ట్రావెల్‌ ఏజెంట్‌ ద్వారానే అతను కూడా ఆస్ట్రేలియాకు రావడంతో తిరిగి ఇండియా వచ్చే వరకు అతను మాతోనే ట్రావెల్‌ అయ్యాడు. ఓ రోజు ఉదయాన్నే సిడ్నిలోని డార్లింగ్‌ హార్బర్‌ సమీపంలో ఓ రెస్టారెంట్‌లో టిఫిన్‌ చేయడానికి వెళ్లాను. తిరిగి వస్తుండగా అమ్మ దగ్గరి నుంచి ఫోన్‌ రావడంతో మాట్లాడుతూ.. చూసుకోకుండా నడవడంతో ఫౌంటేయిన్‌ నీళ్లలో పడిపోయే సమయంలో ఒక్కసారిగా చందర్‌ చేయిపట్టి లాగాడు. విమానంలోనే తొలిసారి చూపులోనే చందర్‌తో మాట్లాడాలన్న నామదిలోని కోరిక అనుకోకుండా ఇలా నెరవేరింది. ఫౌంటేయిన్‌ నుంచి పైకి వచ్చే నీటి బిందువుల తుంపరలు మాపై అక్షింతలుగా పడుతున్నట్టు అనిపించింది. జాగ్రత్తగా ఉండాలంటూ అతడు ఏదో చెబుతున్నా, అనంతమైన ఆనందంలో అతడికి బదులివ్వడానికి కూడా స్పందించలేకపోయా. కొద్ది సేపటి తర్వాత తేరుకుని మాట్లాడటం ప్రారంభించా. అతడిది కూడా హైదరాబాద్‌ అని, అది కూడా మా పక్క కాలనీనే అని తెలుసుకుని సంబరపడిపోయా. ఆ పరిచయం చాలా తక్కువ సమయంలోనే మమ్మల్ని ఎంతో దగ్గర చేసింది. అతడితో మాట్లాడుతున్నంత సేపు వేరే ప్రపంచంలో ఉన్నట్టు ఉండేది. ఆస్ట్రేలియా పర్యటన క్షణాల్లో ముగిసినట్టనిపించింది. 

హైదరాబాద్‌ వచ్చాక అతడిని చూడకుండా, మాట్లాడకుండా ఉండలేకపోయేదాన్ని. ఓ రోజు చందర్‌తో నా ఫీలింగ్స్‌ని షేర్‌ చేసుకున్నా. సరిగ్గా నేనేం చెప్పాలనుకుంటున్నానో దానికి కొనసాగింపుగా చందర్‌ నుంచి బదులు రావడంతో నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కాలేజీ ప్రారంభమవ్వడంతో హైదరాబాద్‌లో అతను, ఉత్తర్‌ ప్రదేశ్‌లోని కాన్పూర్‌కి నేను వెళ్లాల్సి వచ్చింది. చందర్‌, నేను చదువుతో కుస్తీ పడుతున్నా రోజూ ఫోన్‌లో మాట్లాడుకోకుండా ఉండేవాళ్లం కాదు. ఫోన్‌లో మాట్లాడినా అతడికి దూరంగా ఉన్నాననే బాధ నాలో తీవ్రస్థాయికి చేరుకుంది. సెమిస్టర్‌ పరీక్షలు పూర్తవ్వగానే రాకెట్‌ వేగంతో వచ్చి అతడిపై వాలిపోయాను. మా మధ్య ఏర్పడిన దూరాన్ని.. వీలైనంత తక్కువ చేయాలనుకున్నాను. మా ఇంట్లో ఎవరూ లేని సమయాల్లో చందర్‌తోనే గడిపేదాన్ని. ఎందుకో స్నేహితులు, తల్లిదండ్రుల దగ్గర కూడా లభించనిస్పేస్‌ చందర్‌ దగ్గర దొరికేది. తిరిగి యూనివర్సిటీకి వెళ్లిపోయాక ఓ రోజు ఒంట్లో బాగాలేకపోతే డాక్టర్‌ని సంప్రదించగా నేను గర్భవతినని తెలిసింది.

ఈ విషయాన్ని వెంటనే చందర్‌కి చెప్పాను. మా ప్రేమకి ప్రతిరూపాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని ఇద్దరం నిశ్చయించుకున్నాం. వివాహం విషయంలో ఇప్పుడేనా అంటూ చందర్‌ సంశయించినా, పుట్టబోయే చిన్నారి విషయంలో ఎలాంటి సందేహం లేకుండా ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇంకా చదువు కూడా పూర్తి కాలేదు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు ఎలా చెప్పాలి? వాళ్లు నా నిర్ణయాన్ని స్వీకరిస్తారా ? లేదా ఒకవేళ వాళ్లు ఓకే చెప్పినా పెళ్లి కాకుండానే తల్లిని అవ్వడాన్ని సమాజం ఎలా చూస్తుంది. జీవితంలో చందర్‌ నేను ఖచ్చితంగా మంచి పొజీషన్‌లో సెటిల్‌ అవ్వుతామనే నమ్మకం ఉంది. ఇప్పటికీ నేను తప్పు చేశాను అనే ఇబ్బంది నాకు అనిపించడం లేదు. కానీ, ఈ సమాజం దృష్టిలో మంచిదాన్ని అని నిరూపించుకోవడానికి నా కడుపులో పెరుగుతున్న చిన్నారిని చిద్రం చేసే తప్పు మాత్రం చేయలేను. అందుకే దృఢంగా నిశ్చయించుకున్నా. ఏది ఏమైనా మా ప్రేమ నిజం. దానికి నిదర్శనమైన పసికందును మాత్రం ఈ సమాజం కోసం బలి ఇవ్వాలనుకోవడం లేదు. అయితే చుట్టుపక్కల వాళ్లు చూసే చూపును, వాళ్ల మేకుల్లాంటి మాటలనుంచి తట్టుకునే శక్తి రావాలని కోరుకుంటున్నాను. అటుపై ఏం జరుగుతుందో కాలమే సమాధానం చెప్పాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement