సాయిదుర్గా ప్రసాద్
గునుపూడి విశ్వనాథ శాస్త్రి... ఈ పేరంటే ఏ కొద్ది మందికో తప్ప బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. అదే ఐరన్‌లెగ్ శాస్త్రి అంటే తెలిసిపోతుంది. తనదైన హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఐరన్‌లెగ్ శాస్త్రి 14వ వర్ధంతి నేడు. 2006లో ఆయన మరణించారు. తండ్రి వర్ధంతి సందర్భంగా గునుపూడి సాయిదుర్గా ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘మా నాన్నగారు 7వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత పౌరోహిత్యం చేపట్టారు. హైదరాబాద్ వచ్చాక సినిమా కార్యక్రమాలకు పౌరోహిత్యం చేసేవారు. అలా ఏర్పడిన పరిచయంతో దర్శకుడు ఈవీవీ సత్యనారాయణగారు ‘ప్రేమఖైదీ’లో నాన్నకి అవకాశమిచ్చారు.
అయితే గునుపూడి విశ్వనాథశాస్త్రి పేరు స్క్రీన్ నేమ్‌గా బాగోదని ఐరన్‌లెగ్ శాస్త్రి అని పెట్టారు. ‘ఏవండీ ఆవిడ వచ్చింది, జంబలకిడి పంబ’ సినిమాలు నాన్నకి మంచి బ్రేక్ ఇచ్చాయి. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించారు. అయితే ఐరన్‌లెగ్ శాస్త్రి పేరు పాజిటివ్‌గా కంటే నెగటివ్‌గా క్లిక్ అయింది. నిజంగానే తను ఐరన్‌లెగ్ అని భావించారేమో పౌరోహిత్యానికి పిలవడం మానేశారు. 42ఏళ్లకే నాన్న మాకు దూరమయ్యారు. ఎంబీఏ చేసిన నేను సీఏ ఫైనలియర్ చేస్తున్నాను. నటన మీద ఆసక్తితో ‘ఐరన్‌లెగ్’, ‘ఐరన్‌లెగ్ 2.0’ వంటి షార్ట్ ఫిల్మ్స్ చేశా. ‘జంబలకిడి పంబ’లో నటించా. సంపూర్ణేశ్‌బాబు ‘రాధాకృష్ణ’లో మంచి పాత్ర ఇప్పించారు. మరో సినిమా విడుదల కావాల్సి ఉంది. ఇంకో సినిమాలో నటిస్తున్నా’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment