‘తలైవి’ కోసం రూ.100 కోట్లు? | 100 Crore Budget For Kangana Ranaut Thalaivi Movie | Sakshi
Sakshi News home page

‘తలైవి’ కోసం రూ.100 కోట్లు?

Jun 6 2019 10:53 AM | Updated on Aug 21 2019 10:25 AM

100 Crore Budget For Kangana Ranaut Thalaivi Movie - Sakshi

తమిళసినిమా: ఇప్పుడు ఒక భారీ చిత్రం నిర్మించాలంటే మినిమమ్‌ బడ్జెట్‌ రూ.100 కావలసిందే. సరే ఏ సూపర్‌స్టార్‌నో హీరోగా నటిస్తే పెట్టిన పెట్టుబడిని ఎలాగోలా తిరిగి రాబట్టుకోవచ్చుననే ధైర్యం ఉంటుంది. అయితే ఇక్కడ నటి కంగనా రానౌత్‌ను నమ్మి ఒక నిర్మాత రూ.100 కోట్ల బడ్జెట్‌లో చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారనే టాక్‌ స్ప్రెడ్‌ అయ్యింది. ఆ చిత్రం పేరే తలైవి. ఈ టైటిల్‌తోనే చిత్ర పూర్వాపరాలు అందరికీ అర్థం అయిపోయి ఉంటాయి. అవును నాటి ప్రఖ్యాత నటీమణి, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇతివృత్తంతో తెరకెక్కనున్న చిత్రమే తలైవి. నిజానికి జయలలిత జీవిత చరిత్రతో ప్రస్తుతం రెండు చిత్రాలు తెరకెక్కుతున్నాయి.

అందులో ఒక చిత్రం పేరు ది ఐరన్‌ లేడీ. ఇందులో నటి నిత్యామీనన్‌ జయలలిత పాత్రలో నటిస్తున్నారు. మరో చిత్రం తలైవి. దీనికి విజయ్‌ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో బాలీవుడ్‌ సంచలన నటి కంగనా రానౌత్‌ టైటిల్‌ పాత్రలో నటించనున్నారు. ఇందుకోసం స్లిమ్‌గా ఉండే కంగన చాలా కసరత్తులు చేసి జయలలితగా జీవించడానికి కాస్త బరువు కూడా పెరిగిందట. కాగా వచ్చే నెల ద్వితీయార్థంలో సెట్‌పైకి వెళ్లడానికి సిద్ధం అవుతున్న ఈ తలైవి చిత్రాన్ని రూ.100 కోట్ల బడ్జెట్‌లో నిర్మించనున్నట్లు తాజా సమాచారం. ఇంతకు ముందు తెలుగులో ఎన్‌టీఆర్, మహానాయుడు చిత్రాలను నిర్మించిన విబ్రి సంస్థ తలైవి చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నిర్మించనుందని తెలిసింది. ఈ సంచలన చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా అప్పుడెప్పుడో దామ్‌ధూమ్‌ చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన నటి కంగనా రానౌత్‌ మళ్లీ తలైవి చిత్రం ద్వారా మరోసారి తమిళ ప్రేక్షకుల ముందుకు రానుందన్నమాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement