
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. ఈ క్రమంలో రెక్కాడితే గానీ డొక్కాడని పేదల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. లాక్‌డౌన్ పొడిగింపుతో ఆకలి కేకలు మిన్నంటాయి. గుప్పెడు మెతుకులు దొరక్క మంచినీళ్లు తాగుతూ క్షణమొక యుగంలా బతుకు వెల్లదీస్తున్నారు. అయితే కష్ట సమయంలో ఆదుకునేవాడే అసలైన హీరో అంటూ ఎంతోమంది బాలీవుడ్ హీరోలు ముందుకొచ్చి సాయం చేశారు. తాజాగా స్టార్ హీరో అమీర్ ఖాన్ పేదలకు లాక్‌డౌన్ కష్టాలు దరిచేరకుండా వినూత్నం సాయం చేశాడంటూ ఓ టిక్‌టాక్ వీడియో సోషల్ మీడియాలో అందరి చేత ప్రశంసలు అందుకుంటోంది.
ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. ఢిల్లీలో పేదలకు సాయం చేసేందుకు ఓ ట్రక్కు వీధిలో వచ్చి ఆగుతుంది. అందులో ఉన్నవాళ్లు కిలో గోధుమ పిండి ప్యాకెట్లను పేదలకు అందించారు. అయితే కొందరు మాత్రం ఉత్తి పిండికేనా ఇదంతా.. అని వెనుదిరిగిపోయారు. కానీ కనీసం అది కూడా లేని నిరుపేదలు ముందుకొచ్చి ఆ ప్యాకెట్లను ఆదుర్దాగా అందుకున్నారు. ఎంతో సంతోషంతో వాటిని తీసుకుని ఇంటికి వెళ్లి చూడగా అందులో పదిహేను వేల రూపాయలు కనిపించాయట. ఇక ఈ ట్రక్కును పంపించింది అమీర్ ఖానే అంటున్నారు అతని అభిమానులు. సదరు హీరో మాత్రం ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. (బంగ్లాలో చిక్కుకున్న అమీర్ ఖాన్ తనయుడు)
Comments
Please login to add a commentAdd a comment