
ఇరవై కోట్ల భారీ సెట్
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తయారవుతున్న ‘2.0’ ఇప్పుడు ఓ సంచలనం. ఆరేళ్ల క్రితం వచ్చిన ‘రోబో’(తమిళంలో ‘ఎంతిరన్’)కి సీక్వెల్‌గా శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి వేసిన ఒక భారీ సెట్ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఈ సీక్వెల్ కోసం శంకర్ ఏకంగా రూ. 20 కోట్ల ఖర్చుతో చెన్నై శివారుల్లో ఒక భారీ సెట్ వేయించారు. ‘రోబో’లో వచ్చే కీలకమైన పతాక సన్నివేశాల కోసం ఆ రోజుల్లోనే చె న్నై శివార్లలో రూ. 5 కోట్ల వ్యయంతో సెట్ వేసి ఔరా అనిపించారు.
ఇప్పుడీ రెండో భాగంలో హీరో రజనీకాంత్, విలన్‌గా నటిస్తున్న హిందీ హీరో అక్షయ్ కుమార్‌ల మధ్య వచ్చే పోరాట సన్నివేశాల కోసం ఆర్ట్ డెరైక్టర్ ముత్తురాజ్ పర్యవేక్షణలో ఈ కొత్త సెట్‌ను తీర్చిదిద్దారు. ‘శివాజీ’ నుంచి ‘రోబో’ దాకా (‘ఐ’ ను మినహాయిస్తే) చిత్రాల్లోని యాక్షన్ సన్నివేశాలకు పీటర్ హెయిన్‌ను ఎంచుకున్న శంకర్ ఈ సారి ‘2.0’ కోసం హాలీవుడ్ చిత్రాలు ‘ట్రాన్స్‌ఫా ర్మర్స్’, ‘మిషన్ ఇంపాజిబుల్’కు పనిచేసిన హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్‌ను ఆశ్రయించారు.
మార్చిలో చిత్రీకరించనున్న ఈ పోరాట సన్నివేశాల కోసం యూనిట్ తలమునకలై ఉంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇందులో హీరోయిన్ అమీజాక్సన్ ఓ హ్యూమనాయిడ్ రోబో అన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
చెన్నైకి... ‘కబాలి’!
ఒక పక్క ‘రోబో’ సీక్వెల్ ‘2.0’కు భారీ సన్నాహాలు సాగుతుంటే, మరో పక్క రంజిత్ దర్శకత్వంలోని ‘కబాలి’లో గ్యాంగ్‌స్టర్ పాత్ర పోషిస్తున్న రజనీకాంత్ మలేసియాలో సుదీర్ఘ షూటింగ్ ముగించుకొని, చెన్నైకి తిరిగొచ్చారు. మలేసియాలోని భారీ షెడ్యూల్లో రజని పోర్షన్ పూర్తయి పోయింది. మిగిలిన చిత్ర యూనిట్ కూడా వచ్చేవారం మొదటికల్లా చెన్నైకు తిరిగివస్తోంది. ఆ వెంటనే ‘కబాలి’ ప్యాచ్‌వర్క్‌ను చెన్నైలో పూర్తి చేయడానికి సన్నాహాలు సాగుతున్నాయి. అంటే, ఇక పూర్తి స్థాయిలో ఈ సూపర్‌స్టార్ ఫోకస్ ‘2.0’ మీదే అన్నమాట!