3 కోట్ల ‘అర్ధనారి’కి 15 కోట్ల ఆఫర్!
అర్జున్ యజత్, మౌర్యాని జంటగా పత్తికొండ సినిమాస్ పతాకంపై రవికుమార్, భరత్ రాజ్, కర్లపూడి కృష్ణ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘అర్ధనారి’.
భాను శంకర్ చౌదరి దర్శకత్వం వహించారు. రవివర్మ సంగీత దర్శకుడు.
శుక్రవారం విడుదలైన ఈ చిత్రం కాన్సెప్ట్ బాగుందనే టాక్ వచ్చింది.
వసూళ్లు కూడా బాగున్నాయని దర్శకుడు భానుశంకర్ ఆనందం వ్యక్తం చేశారు.
ఇంకా ఆయన పలు విశేషాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.
♦ మా యూనిట్ సభ్యులందరూ హైదరాబాద్‌లోని శ్రీ మయూరి థియేటర్లో సినిమా చూశారు. నేను నిజామాబాద్‌లో ప్రేక్షకులతో కలసి చూశాను. నిజామాబాద్ మల్టీప్లెక్స్‌లో మార్నింగ్ రెండు షోలు వేశారు. ప్రేక్షకుల స్పందన చూసి మరో రెండు షోలు పెంచారు. ముఖ్యంగా మహిళలు సెకండాఫ్‌లో ఎమోషనల్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయంటున్నారు. శుక్రవారం మార్నింగ్ మినిమమ్ ఓపెనింగ్స్ వచ్చాయి. మ్యాట్నీకీ, ఫస్ట్ షోకీ కలెక్షన్స్ పెరిగాయి.
సాధారణంగా ఏ మాత్రం ఇమేజ్ లేని ఆర్టిస్టుల సినిమాలకు కలెక్షన్స్ తక్కువే ఉంటాయి. ఈ సినిమాకి మౌత్ టాక్ బలంగా ఉండడంతో ప్రతి షోకి కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఆర్టిస్టులందరూ చక్కగా నటించారు. ఇలాంటి మంచి కథలు, సినిమాలు మరిన్ని రావాలని చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి స్పందన వస్తుందని ఊహించలేదు.
♦ కరెంట్, రోడ్, ఓటు హక్కు.. ఇలా సమాజంలో కళ్ల ముందు ఉండే ప్రతి అంశం గురించి ఈ సినిమాలో చర్చించాను. సామాన్యుడు తన బాధ్యతలను విస్మరించడం వల్లే సమాజంలో అన్యాయాలు ఎక్కువైయ్యాయన్నది చూపించాను. ముఖ్యంగా సినిమాలో చూపించిన పంచ సూత్రాల సన్నివేశానికి అద్భుత స్పందన లభిస్తోంది. రాజకీయ నాయకులందరూ ఈ పంచ సూత్రాలను అమలుపరిస్తే దేశం ప్రగతిపథంలో పయనిస్తుంది.
♦ ‘అర్ధనారి’ కథ తయారు చేసుకున్నాక పలువురు నిర్మాతల్ని కలిశాను. ‘ఈ రోజుల్లో సందేశాలు చెప్తే ఎవరు వింటారండీ. ప్రతి ఒక్కరిలో స్వార్థం పెరిగింది. దేశభక్తి ఎవరికి కావాలండీ’ అని డిజప్పాయింట్ చేశారు. ‘దేశం గురించి చెప్పడం కూడా తప్పే’ అన్నట్లు మాట్లాడారు. సందేశం ఇవ్వాలంటే స్టార్ హీరోలు మాత్రమే ఇవ్వాలన్నారు. కొత్తవాళ్లు చెప్తే చూడరని అన్నారు. నిర్మాతలు ఎం.రవికుమార్, భరత్ రాజ్, కర్లపూడి కృష్ణలు కథ విని, ‘ఈ కథతోనే సినిమా తీద్దాం.
వేరే కథ వద్దు’ అని ఎంకరేజ్ చేశారు. కొత్త నటీనటులతో 3 కోట్ల నిర్మాణ వ్యయంతో సినిమా తీయడం రిస్కే. కానీ, ఎంతో ఫ్రీడమ్ ఇచ్చారు. ఇలాంటి మంచి కథతో సినిమా తీయడం ఇండస్ట్రీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా క్లిష్టమైన ప్రక్రియ. కమర్షియల్ హంగుల పేరుతో తీసిన కథనే మళ్లీ మళ్లీ తీస్తున్నారు. సందేశాత్మక కథలు, సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారని మా ‘అర్ధనారి’ నిరూపించింది.
♦ శుక్రవారమే హిందీ, తమిళ, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమల నుంచి రీమేక్ రైట్స్ కోసం పలువురు నిర్మాతలు సంప్రతించారు. ఆయా భాషల్లో స్టార్ హీరోలు నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అన్ని భాషల్లో కలిపి సుమారు15 కోట్ల రూపాయలు రీమేక్ రైట్స్ ఆఫర్ రావడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులోనూ సమాజానికి ఉపయోగపడే కథలతో సినిమాలు చేస్తాను.