300 జతల ‘సోనూ’ వేర్
సిక్స్ ప్యాక్ బాడీ... ఫ్యాషనబుల్ డ్రెస్... స్టయిల్... ఫిట్‌నెస్ ఫ్రీక్ అంటే - బాలీవుడ్ నటుడు సోనూ సూద్. ‘వదల బొమ్మాళీ వదల’ అన్న ఈ బాబుగారి గురించి కొత్త సంగతి ఒకటి బయటకొచ్చింది. అయ్యగారి ఇంటి నిండా... షూసే అట! విషయం ఏంటంటే, కొత్త రకం చెప్పులు... రకరకాల బూట్లు... రంగురంగుల చెప్పులు... ఎక్కడ కనిపించినా సోనూ సూద్ కాళ్ళు పీకేస్తాయట! ఆ బూట్లు, చెప్పులు కొని ఇంటికి పట్టుకెళ్ళేదాకా అయ్యగారి చేతులూరుకోవు.
ఈ పాదరక్షల పిచ్చి ఎక్కడి దాకా వెళ్ళిందయ్యా అంటే, ఏకంగా ఇంట్లో 300కు పైగా జతల షూస్ వచ్చి చేరాయి. అరల్లో, బ్యాగుల్లో నిండా అవే! అసలు ప్యాక్ విప్పని చెప్పులే సోనూ ఇంట్లో రెండు సూట్‌కేసుల నిండా ఉన్నాయట. ఇదే స్పీడ్‌లో వెళితే... రాబోయే రోజుల్లో షూస్ పెట్టుకోవడానికే వేరే ఫ్లాట్ కావాల్సి ఉంటుందేమో! ఈ మాట ఎవరో కాదు... సోనూయే స్వయంగా చెప్పారు. అన్నట్లు, అచ్చం ఇలాగే కొత్త షూస్ వ్యామోహం ఉన్న అందాల రాశి సుస్మితాసేన్ సైతం సోనూ దెబ్బకు ఢామ్మంది.
ఈ పిచ్చిలో సోనూతో తాను పోటీపడలేనం టోంది. పనిలో పనిగా... ఫిట్‌నెస్, ఫ్యాషన్‌లో మాత్రం సోనూ మియాకు సాటి లేరంటోంది. సరే.. ఆ సంగతలా ఉంచితే, వందల కొద్దీ చెప్పులు చూడాలంటే, షోరూమ్‌కే కాదు.. సోనూ ఇంటికి కూడా వెళ్లొచ్చేమో! గిట్టనివాళ్ళు మాత్రం ఇవన్నీ ‘సోనూ మియా కొనుక్కొచ్చినవా? కొట్టుకొచ్చినవా? ఎవరైనా కొడితే వచ్చినవా’ అంటున్నారట. హతవిధీ!