సిగరెట్లు మానేసిన మహేశ్ బాబు!
మహేశ్ బాబు.. ఈ పేరు వింటే చాలు.. అమ్మాయిల గుండెల్లో గుబులు పుడుతుంది. నమ్రతతో పెళ్లయినా.. గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు పుట్టినా కూడా మహేశ్ అంటే క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అలాంటి మహేశ్ బాబు.. ఒకప్పుడు చైన్ స్మోకర్ అట. సెట్ మీద ఉన్నా, బయటకు వెళ్లినా కూడా చేతిలో ఎప్పుడూ సిగరెట్టు వెలుగుతూ ఉండాల్సిందే. ఎన్నిసార్లు సిగరెట్ మానేయాలనుకున్నా కూడా మళ్లీ మళ్లీ కాలుస్తూనే ఉండేవాడట.
అలాంటి సమయంలో మహేశ్ బాబుకు ఓ స్నేహితుడు పొగతాగడం మానేయడం ఎలా అనే విషయంలో సెల్ఫ్ హెల్ప్ పుస్తకం ఒకటి బహూకరించారు. ఇలాంటివి చేయడం అంటే చెప్పినంత సులభం కాదని, మానేసిన ప్రతిసారీ తనకు మళ్లీ కాల్చాలనే కోరిక చాలా గట్టిగా ఉండేదని మహేశ్ అన్నాడు. అలెన్ కార్ రాసిన ఆ పుస్తకంలో మాత్రం.. పొగతాగే అలవాటు మానేయడం ఎలా అనే విషయం చాలా బాగా రాశారని, ఆ పుస్తకం చదివిన తర్వాత తాను ఇంతవరకు అసలు సిగరెట్ అన్నదే ముట్టుకోలేదని మహేశ్ తెలిపాడు. తాను నటించే సినిమాల్లో కూడా సిగరెట్ తాగే సన్నివేశాలు వద్దనే చెబుతానని, దానివల్ల అభిమానులకు తప్పుడు సందేశం వెళ్తుందని అన్నాడు. అన్ని విషయాల్లో తమ హీరోను ఆదర్శంగా తీసుకునే యువత.. ఈ విషయంలో కూడా ఆయన్ను ఆదర్శంగా తీసుకుని వెంటనే పొగతాగే అలవాటు మానేయడం మంచిది.