
విలువలున్న సినిమాలే తీస్తాను..!
‘‘సత్యం, మార్గం, లక్ష్యం, నమ్మకం... వీటినే ఆయుధాలుగా చేసుకొని ఐదుగురు యువకులు చేసిన పోరాటమే ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. యువతరం తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని చెప్పే సినిమా ఇది’’ అని ప్రేమ్‌కుమార్ పట్రా అన్నారు. ఆయన సమర్పణలో క్రాంతి, తనిష్క్, క్రాంతికుమార్, వాసు, కృష్ణతేజ ప్రధాన పాత్రలు, వెంకట్, అస్మితాసూద్ ప్రత్యేక పాత్రలు పోషించిన చిత్రం ‘ఆ అయిదుగురు’. అనిల్ జేసన్ గూడూరును దర్శకునిగా పరిచయం చేస్తూ సరితా పట్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 4న ఈ సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ, ‘‘ఐదుగురు పాండవులు, ఒక్కడే కృష్ణుడు... ఈ కాన్సెప్ట్‌తో ఈ కథ తయారు చేశాం. ఐదుగురు యువకులుగా కొత్తవారిని పరిచయం చేశాం. ఇక వీరిని నడిపించే పాత్రను వెంకట్ పోషించారు. నా సంస్థ నుంచి వచ్చిన సినిమాలు ఆ నలుగురు, వినాయకుడు. ఈ రెండూ నంది అవార్డులు అందుకున్నాయి. ఈ చిత్రంతో మూడోసారి నందిని అందుకోబోతున్నా’’ అని నమ్మకం వ్యక్తం చేశారు ప్రేమ్‌కుమార్. ఈ సినిమాలో ఓ కామెడీ పాత్ర చేశానని, ఇక నుంచి నటునిగా కూడా కొనసాగాలనుకుంటున్నానని ప్రేమ్‌కుమార్ చెప్పారు.
‘‘తెలుగు సినీ చరిత్రలోని టాప్ 100 చిత్రాల్లో నా ‘ఆ నలుగురు’ కూడా ఉంది. ఒక పాతాళభైరవి, ఒక శంకరాభరణం లాంటి క్లాసిక్స్‌తో పాటు నా ‘ఆ నలుగురు’ కూడా చెప్పుకుంటారు. ఒక నిర్మాతగా నాకిది చాలు. ఇక నుంచి కూడా విలువలతో కూడిన సినిమాలే తీస్తాను’’ అని ప్రేమ్‌కుమార్ వెల్లడించారు. చిన్న సినిమాలకు పంపిణీదారుల నుంచి కూడా ప్రోత్సాహం అందడం లేదని, ఎదురు డబ్బులిచ్చి సినిమాలను విడుదల చేయాల్సిన పరిస్థితి నెలకొందని, అదే బూతు సినిమాలనైతే... పోటీ పడి మరీ విడుదల చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.