‘గాలిపటం’ భారం కాదు... బాధ్యత
‘‘దర్శకునిగా నా వయసు రెండు సినిమాలు. ఇంత తక్కువ సమయంలోనే ఓ సినిమా నిర్మాణ బాధ్యతలు తలకెత్తుకున్నాను. ‘గాలిపటం’ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయాలనుకున్నప్పుడు... ఓ వైపు పెద్ద సినిమా చేస్తూ, మరో వైపు ఈ చిన్న సినిమాను నిర్మించడం భారమవుతుందని నా శ్రేయోభిలాషులు అన్నారు. అయితే... నేను ఈ సినిమాను భారంగా భావించడం లేదు. బాధ్యతగా ఫీలవుతున్నాను. ఎందుకంటే... నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు అండగా నిలిచిన నా మిత్రులకు ఏదైనా చేయాలనుకునే తలంపుతో నేను నిర్మిస్తున్న సినిమా ఇది’’ అని సంపత్ నంది అన్నారు.
ఆది, ఎరికా ఫెర్నాండెజ్, క్రిస్టినా అఖీవా, ప్రీతీరానా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘గాలిపటం’ చిత్రానికి నవీన్ గాంధీ దర్శకుడు. కిరణ్ ముప్పవరపు, విజయ్‌కుమార్ వట్టికూటిలతో కలిసి సంపత్‌నంది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు వి.వి.వినాయక్ పాటల సీడీని ఆవిష్కరించి సంపత్ నందికి అందించారు. దర్శకుడు హరీశ్ శంకర్ ప్రచార చిత్రాలను విడుదల చేశారు. పదికాలాల పాటు నిలిచిపోయే సినిమా ఇదని ఆది చెప్పారు. సంపత్ నందితో తనది పన్నెండేళ్ల ప్రయాణమని, ‘గాలిపటం’ ద్వారా తనకు అద్భుతమైన అవకాశం ఇచ్చాడని సంగీత దర్శకుడు భీమ్స్ ఆనందం వెలిబుచ్చారు. ఇంకా దర్శక, నిర్మాతలు కూడా మాట్లాడారు.