సినిమా రివ్యూ: ఆడు మగాడే కానీ...
సినిమా రివ్యూ: ఆడు మగాడే కానీ...
Published Sat, Dec 7 2013 2:29 PM | Last Updated on Sat, Sep 2 2017 1:22 AM
ఎస్సెమ్మెస్, ‘ప్రేమ కథా చిత్రం’తో గుర్తింపు తెచ్చుకున్న సుధీర్‌బాబు ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ అనే ఓ క్రేజీ, ఫ్యాన్సీ టైటిల్‌తో మరోసారి డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ద్వారా కృష్టారెడ్డి గంగదాసు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. టైటిల్‌తో విడుదలకు ముందే ప్రేక్షకుల్లో అంచనాలను పెంచిన ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ ఏలాంటి టాక్‌ను సంపాదించుకుందో తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళ్తాం.
సిద్ధు అల్లరి చిల్లరిగా తిరిగే ఓ తుంటరి యువకుడు. చిన్నతనం నుంచి అందర్ని కష్టాల్లో ఇరికించడం సిద్దూకి అలవాటు. సిద్దూ వ్యవహారం ఎలా ఉంటుందంటే.. సొంత తండ్రి ప్రసాద్ (నరేశ్) కూడా వీడు నా కొడుకు అని చెప్పుకోవడానికి కూడా భయపడేంత రేంజ్‌లో ఉంటుంది. సిద్దూ నుంచి ఎదురయ్యే కష్టాల్ని భరించలేక హాస్టల్ ఉంచి చదివిస్తుంటాడు. చాలా జాలీగా కాలం గడుపుతున్న సిద్దూ, ఇందూ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇందూకి చెర్రి (రణధీర్) అనే ఓ అన్నయ్య ఉంటాడు. ఇందూ వైపు ఎవడైనా చూస్తే తాట తీయడం చెర్రీ పని. అయితే ఒకానొక కారణంగా శంకరన్న అనే రౌడీ పొలిటీషియన్‌ను సిద్దు విపరీతంగా కొడుతాడు. అయితే శంకరన్నకు ఎవరు కొట్టారనే విషయం తెలియదు. తనను కొట్టిన వ్యక్తిపై పగను పెంచుకొని అతని అంతు చూడటానికి వెతుకుతుంటాడు. కథ ఇలా సాగుతుంటే తన ప్రేమ కోసం సిద్దూ అదే కాలేజిలో చదువుతున్న శంకరన్న మరదలు అంజలీతో చెర్రీ ప్రేమలో పడేలా నాటకం ఆడుతాడు. అంజలీ ప్రేమ విషయం తెలుసుకున్న శంకరన్న చెర్రీపై దాడి చేస్తాడు. చెర్రీ, అంజలీలు విడిపోవడానికి సిద్దూనే కారణమని తెలుసుకున్న ఇందూ అతనికి దూరంగా ఉంటుంది. అయితే శంకరన్నను ఎదురించి విడిపోయిన చెర్రీ, అంజలీలను ఎలా కలిపాడు. వారి ప్రేమను పెళ్లిదాకా ఎలా తీసుకువచ్చాడు. అలాగే ఇందూను ప్రేమను సిద్దూ ఎలా గెలుచుకున్నాడు అనేది ఈ చిత్ర కథ.
లవ్, యాక్షన్, కామెడీ అంశాలకు తన ఎనర్జీని మేళవించి సుధీర్ ఆకట్టుకున్నాడు. టైమింగ్, మెచ్యురిటీ, డాన్స్ లతో సిద్దూ పాత్రకు పూర్తి న్యాయం చేకూర్చాడు. గత రెండు చిత్రాల్లోని ఫెర్ఫార్మెన్స్‌కు ధీటుగా తనదైన శైలిలో సుధీర్ బాబు మరోసారి నటుడిగా తనకు తాను ప్రూవ్ చేసుకున్నాడు. పాటల్లో సిక్స్‌ప్యాక్ బాడీతో సుధీర్ అదరగొట్టాడు. కథలను జాగ్రత్తగా ఎంచుకుని తన సినిమాలను చక్కగా ప్లాన్ చేసుకుంటే.. త్వరలోనే టాలీవుడ్ లో స్టార్‌గా ఎదగేందుకు అన్ని అంశాలు సుధీర్‌లో పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు.
ఇందూ పాత్రలో అస్మితా సూద్ మంచి పాత్రే లభించింది. గ్లామర్‌తో ఆకట్టుకున్న కీలక సన్నివేశాల్లో ఎమోషన్స్ పలికించడంలో కొంత తడబాటుకు గురైంది. అయినా అస్మితా పర్వాలేదనింపించింది. అంజలీ పాత్రలో పూనమ్ కౌర్‌కు అంతగా ప్రాధాన్యత ఉన్న పాత్రేమి కాదు. ప్రధాన విలన్‌గా అజయ్ తనదైన మార్కును ప్రదర్శించాడు. కొన్ని సీన్లలో అజయ్ మంచి పరిణతిని ప్రదర్శించాడు. శంకరన్న లాంటి పాత్రలను అజయ్ ఇప్పటికే ఎన్నో చేశాడు. అజయ్ కేరిర్‌కు అంతగా పేరు తీసుకురాకపోయినా.. విలన్ రేసులో తాను ఉన్నానని చెప్పుకోవడానికి పనికివచ్చే రేంజ్ మాత్రమే. సుమన్, నరేశ్‌లు అతిధి నటుల పాత్రకే పరిమితమయ్యారు. ఇక ఈ సినిమాలో కుక్క పాత్ర హైలెట్ అని చెప్పవచ్చు. పృథ్వీ, కృష్ణభగవాన్ కామెడీ కొంత ప్లస్ అని చెప్పవచ్చు.
ఈ చిత్రంలో గొప్పగా చెప్పుకావాల్సిందేమైనా ఉందంటే అది డైలాగ్స్. ఈ సినిమాలో డైలాగ్స్ ప్రధాన ఆకర్షణ. ’సంతానం కోసం సముద్ర స్నానం చేస్తే ఉప్పు నీళ్లతో ఉన్నది పొయింది’, కొడుకును ఇవ్వమంటే కసబ్ ను ఇచ్చావ్ లాంటి డైలాగ్స్ తోపా టు, మరికొన్ని సన్నివేశాల్లో డైలాగ్స్ బాగా పేలాయి. ఫోటోగ్రఫి కూడా అదనపు ఎస్సెట్. ఈ చిత్రంలో శ్రీ సంగీతం అంతగా ఆక ట్టుకోలేకపోవడం, పాటలు క్యాచీగా లేకపోవడం మైనస్.
ఆడు మగాడ్రా బుజ్జీ అనే ఎనర్జీ ఉన్న టైటిల్‌తో దర్శకుడిగా పరిచయమైన కృష్ణారెడ్డి తొలి భాగంగా ఓకే అనిపించాడు. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో తొలి భాగంపై గ్రిప్‌ను సాధించినట్టు కనిపించినా.. అదే ఊపును ద్వితీయార్ధంలో కొనసాగించలేకపోయాడు. కుక్క ఎపిసోడ్, కృష్ణ భగవాన్ సీన్లు బాగా పండించాడు. తొలి భాగంలో ప్రేక్షకుల్ని కన్విన్స్ చేయడంతోపాటు.. రెండవ భాగంపై ఆసక్తిని రేకేత్తించాడు. అయితే రెండవ భాగంపై ఆశలు పెంచుకున్న ప్రేక్షకులకు నిరాశను పంచాడు. తొలి చిత్రం ద్వారా రొటీన్ కథను ఎంచుకోవడం కృష్ణారెడ్డి కొంత సాహసామేనప్పటికి.. ఆడు మగాడ్రా బుజ్జీ టైటిల్‌లో ఉండే ఫోర్స్‌ను పూర్తి స్థాయిలో చూపించడంలో విఫలమయ్యాడనే చెప్పవచ్చు.
Advertisement