
కమల్‌కి ఆమిర్ క్షమాపణ
‘‘ఒక చిత్రానికి సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ జారీ అయ్యాక, ఆ చిత్రం విడుదలను అడ్డుకునే హక్కు ఎవరికీ ఉండదు. ఒకవేళ ఎవరైనా అడ్డుకోవాలని ప్రయత్నిస్తే, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నట్లే’’ అని ఆమిర్ ఖాన్ అన్నారు. ముంబయ్‌లో మూడు రోజుల పాటు జరిగిన ‘ఫిక్కీ - ఫ్రేమ్స్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమ ప్రారంభం ఆమిర్‌ఖాన్, కమల్‌హాసన్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా పలు విషయాల గురించి ఆమిర్ మాట్లాడారు. వాటిలో సెన్సార్ సర్టిఫికెట్ పొందిన చిత్రాలను నిషేధించడానికి కొందరు చేస్తున్న ప్రయత్నం గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఈ సందర్భంగా కమల్‌హాసన్ నటించి, దర్శకత్వం వహించిన ‘విశ్వరూపం’ చిత్రాన్ని గుర్తు చేసుకున్నారు. దీని గురించి ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ - ‘‘కమల్‌హాసన్ ‘విశ్వరూపం’ చిత్రాన్ని నిషేధించిన సమయంలో నా పనులతో నేను బిజీగా ఉండటం వల్ల ఈ విషయం గురించి పట్టించుకోలేకపోయాను. వాస్తవానికి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే పరిశ్రమ మొత్తం ఏకతాటిపై నడవాలి. కానీ, ఆ పని చేయడానికి నా వంతుగా నేను ముందుకు రానందుకు సిగ్గుపడుతున్నా. కమల్‌హాసన్‌కి సహాయం చేయలేకపోయినందుకు ఆయనకు బహిరంగంగా క్షమాపణ చెబుతున్నా. ‘కమల్‌గారూ! మీరు ఇబ్బందిలో ఉన్న సమయంలో మీ వెంట మేం లేకపోయినందుకు చాలా బాధపడుతున్నా’. సెన్సార్ ఆమోదం పొందిన ఏ చిత్రాన్నీ ఎవరూ నిషేధించకూడదు. అలాంటి నిషేధాలను నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా’’ అన్నారు.