
ఆమిర్ ఖాన్ అభిమానులకు శుభవార్త
మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ సినిమా వచ్చి చాలా కాలం గడిచిపోయింది. రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో తెరకెక్కిన పికె సినిమా తరువాత ఆమిర్ వెండితెర మీద కనిపించలేదు. చాలా రోజులుగా బయోపిక్గా తెరకెక్కుతున్న దంగల్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు ఆమిర్. ప్రస్తుతం బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ మీద క్రీడాకారుల బయోపిక్లకు కాసుల పంట పండుతుండటంతో ఆమిర్ కూడా అదే జానర్లో ఓ రెజ్లర్ జీవితాన్ని వెండితెర మీద ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నాడు.
మహవీర్ పొగట్ అనే రెజ్లర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమిర్ నలుగురు అమ్మాయిలకు తండ్రిగా నటిస్తున్నాడు. ఆమిర్.., 50 ఏళ్ల వ్యక్తిగా, రెజ్లర్గా బరిలో దిగే కుర్రాడిగా రెండు డిఫరెంట్ షేడ్స్లో కనిపిస్తున్న ఈ సినిమాకు అంకిత్ తివారీ దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న దంగల్ సినిమా డిసెంబర్ 23న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే అభిమానుల కోసం ఈ గురువారం దంగల్ ట్రైలర్ను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్కు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో ట్రైలర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.