సిని పరిశ్రమలో ఎవరు ఎప్పుడు ఎలా స్టార్ అవుతారో చెప్పలేం. ఒక్క సినిమా రాత్రికి రాత్రే ఆకాశానికి ఎక్కించవచ్చు.. లేదంటే పాతాళానికి పడేయవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా సక్సెస్ లేకపోతే కష్టం. స్టార్ కుటుంబాల నుంచి వచ్చిన వారికి కూడా ఇలాంటి ఇబ్బందులు తప్పవంటున్నారు బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్. చాలా కాలం తర్వాత ‘మన్మర్జియా’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అభిషేక్. అయితే ఈ చిత్రంలో ఆయన సహాయ నటుడిగా కనిపించారు. ఒకప్పుడు హీరోగా నటించి.. ఇప్పుడు సహాయ నటుడిగా చేయడం తనను చాలా బాధించింది అంటున్నారు అభిషేక్.
తాజాగా అభిషేక్ ‘కాఫీ విత్ కరణ్’ షోకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కరణ్ ‘ఇన్నాళ్లు హీరోగా నటించి.. ఇప్పుడు సినిమాలో మరో కథానాయకుడి వెనక ఉండటం ఎలా అనిపించింది?’ అని ప్రశ్నించారు. అందుకు అభిషేక్ సమాధనమిస్తూ.. ‘నిజంగా అది గుండెల్ని పిండేసే విషయం. ఇన్నాళ్లు హీరోగా చేసి.. ఇప్పుడు సహాయ నటుడి పాత్రను పోషించడం కష్టం, బాధాకరం. ఇండస్ట్రీ అనేది చాలా దారుణమైన ప్రదేశం. ఇక్కడ ఏ వ్యక్తి కూడా ఇది నా సొంత.. ఇది పొందడానికి పూర్తిగా నాకే అర్హత ఉంది అని అనుకోడానికి లేద’ని తెలిపారు.
అంతేకాక ‘రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితులు మారుతుంటాయి. విజయాలు ఉంటే సెంటర్(కథానాయకుడిగా)లోనే ఉంటావు. లేదంటే పక్కకు జరిపేస్తారు. ఇన్నాళ్లు సెంటర్‌లో ఉన్న నన్ను పక్కకు జరపడం చాలా బాధించింది. కానీ బాధలో నుంచే స్ఫూర్తి కల్గుతుందని గుర్తుపెట్టుకోవాలి. మళ్లీ సెంటర్‌లోకి రావడానికి కృషి చేయాలి’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment