సరికొత్తగా ‘అభియుమ్ అనువుమ్’
తమిళసినిమా: ప్రేక్షకులకు అలుపు పుట్టించని చిత్రాలంటే ప్రేమ కథా చిత్రాలే అని చెప్పడం ఏమాత్రం అవాస్తవం కాదు. మంచి కథా, కథనాలతో ఈ తరహా చిత్రాలు ఇప్పటికే కోకొల్లలుగా వచ్చాయి. ఇకపై కూడా వస్తాయి. అలాంటి కథలను చెప్పే విధానంలో కొత్తదనం ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. అలాంటి తాజా చిత్రమే అభియుమ్ అనువుమ్ అంటున్నారు మహిళా దర్శకురాలు బీఆర్.విజయలక్ష్మి. సరిగమ ఇండియా లిమిటెడ్ సంస్థకు చెందిన యోడ్లీ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రఖ్యాత ఛాయాగ్రహకుడు సంతోష్ శివన్ నిర్వహణ బాధ్యతలను చేపట్టడం విశేషం.
ఈ చిత్రం ద్వారా మలయాళంలో కథానాయకుడిగా ఎదుగుతున్న టావిరో థామస్ హీరోగానూ, ఆయనకు జంటగా పియా బాజ్‌పాయ్ నటించింది. ఇతర ముఖ్య పాత్రల్లో ప్రభు, సుహాసిని, రోహిణి, మనోబాల తదితరులు నటించారు. చిత్రం గురించి దర్శకురాలు బీఆర్. విజయలక్ష్మి తెలుపుతూ అభయుమ్ అనువుమ్ వంటి విభిన్న ప్రేమ కథా చిత్రం ఇప్పటి వరకూ తెరపైకి రాలేదన్నారు. ఇలా చాలా మంది చెప్పి ఉంటారన్న విషయం తనకూ తెలుసని, అభియుమ్ అనువుమ్ చిత్రం చూసిన తరువాత ప్రేక్షకులే తాను చెప్పింది నిజం అని నమ్ముతారని చెప్పారు. ఈ చిత్రానికి ధరణి సంగీతాన్ని అందిస్తున్నారని తెలిపారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న అభియుమ్ అనువుమ్ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోందని, త్వరలోనే విడుదల తేదీ వెల్లడిస్తామని దర్శకురాలు చెప్పారు.