ఆ హాస్యం చిరస్మరణీయం | Ace Comidian Ramanareddy humor memorable | Sakshi
Sakshi News home page

ఆ హాస్యం చిరస్మరణీయం

Published Mon, Nov 11 2013 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 12:30 AM

ఆ హాస్యం చిరస్మరణీయం

ఆ హాస్యం చిరస్మరణీయం

 చెరుకు గడలా పొడవైన ఆకారం...
 దానికి తోడు మూతిపై ఫ్రెంచ్ మీసం... 
 తెలుగుదనం ఉట్టిపడేట్టు లాల్చీ, పంచెకట్టు... 
 భుజాలను ఎగరేస్తూ విచిత్రమైన నడక... 
 
ఠపీమని ఆగి... అలాగే వెనక్కు తిరిగి... నెల్లూరు యాసలో నోరెళ్లపెట్టి.. ‘యట్టా...’ అన్నాడంతే... థియేటర్లో నవ్వులే నవ్వులు. ఆ నవ్వులు అలాగే ఇరవై ఏళ్ల పైచిలుకు నిరాటంకంగా థియేటర్లలో వినిపించాయి. ఆ మాటకొస్తే ఇప్పటికీ తెలుగు లోగిళ్లలో వినిపిస్తూనే ఉన్నాయి. మరి రమణారెడ్డా మజాకా! ఎన్ని హిట్ సినిమాల్లో నటించినా... రెండేళ్లు తెరపై కనిపించకపోతే... ఆ నటుడ్ని ఈజీగా మరిచిపోతున్న రోజులివి. అలాంటి ఓ నటుడు భౌతికంగా దూరమై 39 ఏళ్లు అవుతున్నా... ఇంకా ఆ జ్ఞాపకాలు, ఆ పాత్రలు, ఆ మేనరిజాలు జనాల హృదయాల్లో పచ్చబొట్టులా నిలిచిపోయాయంటే.. ఆ వ్యక్తి ఎంత సాధించి ఉండాలి? అందుకే రమణారెడ్డి చిరస్మరణీయుడు, తెరస్మరణీయుడు. నేడు ఆ మహానటుని వర్థంతి. అందుకే కాసేపు స్మరించుకుందాం.  
 
 రమణారెడ్డి నెల్లూరు ప్రాంత వాసి. ఉద్యోగం శానిటరీ ఇన్‌స్పెక్టర్. సద్యోగం నాటకాలు వేయడం, మోనో యాక్టింగ్. సెలవు దొరికితే చాలు... చలో చెన్నపట్నం అనేవారు. అవకాశాల కోసం నిర్మాతల్నీ దర్శకుల్ని కలుస్తూ ఉండేవారు. నిర్మాత శంకరరావు... ఆయన నిర్మించిన ‘మాయ పిల్ల’(1951) సినిమాలో తొలి అవకాశం ఇచ్చారు. పాత్ర మంచిదే. సినిమానే సరిగ్గా ఆడలా. దాంతో రెడ్డిగారు జనాల్లో రిజిస్టరవ్వలా. కానీ మొక్కవోని ధైర్యంగా ఉద్యోగానికి కూడా రాజీనామా ఇచ్చేసి, అవకాశాలకోసం ప్రయత్నాలు సాగించారు రమణారెడ్డి. ఈ క్రమంలో ఆయన నటించిన చిత్రాలు దీక్ష, మానవతి, కన్నతల్లి. ఇవి కూడా ఆయనకు పెద్దగా పేరు తేలా. అప్పుడొచ్చింది ‘మిస్సమ్మ’. అందులో చేసిన ‘డేవిడ్’ పాత్ర రమణారెడ్డిని స్టార్‌ని చేసేసింది. ‘మేరీ...
 
 ప్లీజ్’ అని రమణారెడ్డి..., ‘ధర్మ... ప్లీజ్’ అని రేలంగి... ఆ సినిమాలో చేసిన అల్లరి అంతాఇంతానా. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి కామెడీ పంట పండించిన సినిమాలు ఎన్నో. ‘హాలీవుడ్‌కి లారెల్-హార్డీ... తెలుగు తెరకు రేలంగి-రమణారెడ్డి అంతే...’ అన్నారంతా.  రమణారెడ్డి అనగానే చటుక్కున గుర్తొచ్చే పాత్ర ‘చినమయ’. ‘మాయాబజార్’లోని ఈ పాత్ర ఆయనకు ఎనలేని కీర్తి తెచ్చింది. ‘ఓరి నీ తెలివీ... అస్మదీయులకు విరుగుడు తస్మతీయులని వీడు కొత్త పదం కనిపెట్టాడు ప్రభూ...’ అంటూ చినమయగా... నెల్లూరు యాసలో రమణారెడ్డి చెప్పిన డైలాగ్ మరిచిపోగలమా. ‘అం అహా... ఇం ఇహీ... ఉం ఉహూ...’ అంటూ ప్రేక్షకులను నిజంగానే మంత్రముగ్ధుల్ని చేశారాయన. ‘పౌరాణిక పాత్ర చేస్తూ ఆ నెల్లూరు యాసేంటి?’ అని అడిగితే.. ‘నా భాష అది, ఎట్టా వదులుద్ది’ అనేవారు రమణారెడ్డి. ‘గుండమ్మకథ’ చిత్రంలోని ‘గంటన్న’ పాత్ర రమణారెడ్డి పోషించిన పాత్రల్లో మరపురానిది. ‘ఏమవుతాను... ఎత్తికుదేస్తే రెండు చక్కలవుతాను. వరసకు అన్ననూ... జీతంబెత్తం లేని గుమస్తాను. నన్ను గంటన్న అంటార్లేండీ...’ అంటూ ఆయన ధాటిగా చెప్పిన డైలాగులు ఇంకా జనాల నోళ్లలో నానుతూనే ఉన్నాయి. 
 
 రమణారెడ్డి అనగానే... ఇల్లరికం, కులగోత్రాలు, దీపావళి, హరిశ్చంద్ర, కార్తవరాయుని కథ, భార్యాభర్తలు... ఇలా లెక్కకు మించిన ఆణిముత్యాలు గుర్తొస్తాయి. రమణారెడ్డికి మేజిక్ చేయడం సరదా. ఆయన మంచి మెజీషియన్ కూడా. స్వచ్ఛంద సంస్థల కోసం ఆయన పలు మేజిక్ షోలు చేసేవారు. ‘కుటుంబ సేవకు సినిమాలు ఎలాగూ ఉన్నాయి. ఈ మేజిక్‌షోలు సమాజ సేవ కోసం’ అనేవారాయన. కె.ఎస్.ప్రకాశరావుగారు ఓ చిత్రంలో రమణారెడ్డితో నారద పాత్ర వేయించారు. ఆయన వద్దని వారించినా ప్రకాశరావుగారు వినలేదట. దాంతో తప్పక నారదునిగా నటించారు రమణారెడ్డి. అస్తిపంజరం లాంటి ఆ ఆకారం కనిపించకుండా... ఆయనకు ఒక జుబ్బా కూడా తొడిగారు. షూటింగ్ అయిపోగానే... ‘మరి నాతో హనుమంతుడి పాత్ర ఎప్పుడు వేయిస్తున్నారు’ అని ప్రకాశరావుతో చమత్కరించారట రమణారెడ్డి.  రమణారెడ్డి మృదుభాషి. జోకు పేల్చి సెలైంట్‌గా ఉండటం ఆయన స్టైల్. రెండు దశాబ్దాల పాటు అందరినీ నవ్వించిన ఆయన... 54 నాలుగేళ్లకే కానరాని లోకాలకు వెళ్లిపోయారు. రమణారెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినా... ఆయన పాత్రలు మాత్రం జనహృదయాల్లో చిరస్థాయిగా నిలిచే ఉంటాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement