
శ్రద్ధాశ్రీనాథ్
తమిళసినిమా: నా జీవిత లక్ష్యం అమ్మగా నటించాలన్నదే అంటోంది నటి శ్రద్ధా శ్రీనాథ్. కన్నడ చిత్రం యూటర్న్ ఈ అమ్మడి సినీ జీవితమే పెద్ద టర్నింగ్ తీసుకుందన్నది తెలిసిందే. ఇక కోలీవుడ్‌లో విక్రమ్ వేదా సక్సెస్‌ఫుల్ పయనాన్ని అమర్చింది. మొత్తం మీద ఇప్పుడు తమిళం, తెలుగు, కన్నడం భాషల్లో నటిస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న శ్రద్ధాశ్రీనాథ్ తన గురించి చెప్పిన కొన్ని విషయాలను ఆమె మాటల్లోనే చూద్దాం. నా తండ్రి సైనికాధికారి, అమ్మ ఉపాధ్యాయురాలు. నేను లా విద్యార్థిని.ఇది క్లుప్తంగా నా వ్యక్తిగత జీవితం.
చదువుకునే రోజుల్లోనే సినిమాల్లో నటించాలన్న ఆశ కలిగింది. ఇది గ్లామర్ ప్రపంచం అని తెలుసు. అయినా నా ఆశను అమ్మనాన్నలకు చెప్పగా మొదట ససేమిరా అన్నారు. ఇంకా చెప్పాలంటే భయపడ్డారు. ఆ తరువాత ఎలాగోలా వారిని ఒప్పించి, నా కోరికను నెరవేర్చుకున్నాను. నేను మణిరత్నం చిత్రాలు చూస్తూ పెరిగాను. ఆయన దర్శకత్వంలో నటించాలని ఎవరైనా కోరుకుంటారు. అలాంటి అవకాశం నాకు అంత త్వరగా వస్తుందని ఊహించలేదు.
కాట్రువెలియిడై చిత్రంలో నటించడానికి పిలుపురాగా గెస్ట్ పాత్ర అయినా కాదనకుండా నటించాను. ఆయన దర్శకత్వంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. విక్రమ్‌వేదా చిత్రంలో మంచి పాత్ర అమరింది. నేను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని. పొగరు తలకెక్కదు. సొంత కట్టుబాట్లు, ఆత్మాభిమానం అందరికీ ఉండాలి. తమిళ సినీ అభిమానులు నన్ను తమిళ అమ్మాయిగానే చూస్తున్నారు.
తమిళ చిత్రపరిశ్రమ అభివృద్ధి పథంలో పయనిస్తోంది. ఇక్కడి సాంకేతిక నిపుణులు అన్ని భాషల్లోనూ సాధిస్తున్నారు. ప్రేక్షకులు ఎంతకాలం అభిమానిస్తారో అంత వరకూ నటిస్తూనే ఉంటాను. ఇక నా లక్ష్య పాత్ర అన్నది జయలలిత పాత్రలో నటించడమే. ఒక సాధారణ నటి నుంచి ముఖ్యమంత్రి వరకూ ఎదిగిన అమ్మ జయలలిత జీవిత చరిత్రను ఎవరైనా చిత్రంగా తెరకెక్కిస్తే అందులో అమ్మ జయలలితగా నటించాలని కోరుకుంటున్నాను. జయలలిత జీవితం, సాధన నన్ను భ్రమింపజేస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment