
తమిళసినిమా: ‘వదిన జ్యోతికతో కలిసి తొలిసారిగా సినిమాలో నటిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది’ అని నటుడు కార్తీ ట్విటర్‌లో పేర్కొన్నారు. గతంలో అగ్ర కథానాయికగా వెలుగొందిన జ్యోతిక.. నటుడు సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న తరువాత నటనకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ‘36 వయదినిలే’ చిత్రంతో మళ్లీ నటిగా ఎంట్రీ ఇచ్చి ఆమె.. వరుసగా వుమెన్ ఒరియంటెడ్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె తన మరిది, నటుడు కార్తీతో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
చిత్రంలోనూ వీరు వదినా మరిదిగా నటించడనుండడం విశేషం. మలయాళ దర్శకుడు జిత్తు జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైకం 18 స్టూడియోస్ సమర్పణలో పారలల్ మైండ్స్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ శనివారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రం గురించి నటుడు కార్తీ తన ట్విటర్‌లో స్పందిస్తూ.. ‘వదినతో కలిసి తొలిసారి నటించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. జిత్తు జోసెఫ్ దర్శకత్వంలో నటించనుండటం ఆనందకరం. ఈ చిత్రంలో నటుడు సత్యరాజ్ కీలక పాత్ర పోషించబోతున్నారు. మీ ఆశీస్సులతో చిత్రం ఈ రోజు ప్రారంభమైంది’ అని పేర్కొన్నాడు. నటుడు సూర్య కూడా కార్తీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన నేపథ్యంలో సూర్య, కార్తీ తండ్రి, సీనియర్ నటుడు శివకుమార్ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఈ చిత్రానికి గోవింద వసంత్ సంగీతాన్ని, ఆర్‌డీ.రాజశేఖర్ ఛాయాగ్రహణను అందిస్తున్నారు.