జగన్‌ అనే నేను.. అనే మాటకోసం... | Actor Krishnudu Special Interview In Sakshi | Sakshi
Sakshi News home page

జగన్‌ అనే నేను.. అనే మాటకోసం ఎదురు చూస్తున్నా

Published Wed, Aug 22 2018 11:03 AM | Last Updated on Wed, Aug 22 2018 4:52 PM

Actor Krishnudu Special Interview In Sakshi

అనంతపురం, గుమ్మఘట్ట : ‘నువ్వు హీరో అవుతావా? సినీ పరిశ్రమలో అడుగుపెట్టడం కూడా నీకు సాధ్యం కాదని అందరూ నవ్వుకున్నారు. సినిమా రంగాన్ని ఇంటిలోనూ అసహ్యించుకునేవారు. ఇలా చీదరించుకున్న వారంతా ఈ రోజు అభిమానించే స్థాయికి స్వశక్తితో ఎదిగా’నని ‘వినాయకుడు’ ఫేమ్‌ కృష్ణుడు తెలిపారు. క్రికెట్‌ టోర్నీ ముగింపు కార్యక్రమానికి మంగళవారం అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గానికి వచ్చిన ఆయన తన సినీ రంగ ప్రవేశం.. రాజకీయ అరంగేట్రం తదితర అంశాలపై ‘సాక్షి’తో ముఖాముఖి.

మీ కుటుంబ నేపథ్యం గురించి చెబుతారా?
మాది తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం చింతలపల్లి గ్రామం. అమ్మా, నాన్న సావిత్రి, సీతరామరాజు. వ్యవసాయం చేసేవారు. నాతో పాటు తమ్ముడు సుబ్రమణ్యం రాజు, చెల్లి విజయలక్ష్మి ఉన్నారు. చిన్న వయసులోనే చదువు కోసం వైజాగ్‌ సమీపాన గుడిలోవా బంధువుల గ్రామం చేరాం. ఐదేళ్ల కిత్రం ఇష్టపడ్డ అమ్మాయిని వివాహం చేసుకున్నా. మాకు ఒక అమ్మాయి.

సినిమాలపై ఆసక్తి ఎలా ఏర్పడింది..?
గుడిలోవా గ్రామంలోని విజ్ఞానవిహార్‌ పాఠశాలలో చదువునేటపుడు సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. ఎనిమిదో తరగతి చదువుతున్నపుడు పాఠశాల వార్షికోత్సవ సమయంలో రాముడి పాత్రలో నటించే అవకాశం వచ్చింది. తొలిసారి ముఖానికి రంగువేశా. వైజాగ్, బెంగళూరు ప్రాంతాల్లో పాలిటెక్నిక్‌ పూర్తిచేశా. సినీ రంగంలో అడుగుపెట్టి హీరోగా నటించి తీరాలని కసితో 12 ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకుల మధ్య నా ప్రయాణం సాగింది.  

సంతృప్తినిచ్చిన పాత్ర ఏది?
వినాయకుడు సినిమాలో ‘వినాయకుడి’ పాత్ర నాకు ఎంతో బాగా నచ్చింది. ఈ పాత్ర ప్రేక్షకుల్లో ఎంతో ఆదారాభిమానం చూరగొంది. ఈ చిత్రాన్ని ఎన్నటికీ మరచిపోలేను.  

ఇప్పటి దాకాఎన్ని చిత్రాలు నటించారు..
హీరోగా, సహనటునిగా దాదాపు వంద చిత్రాలు తెలుగులో చేశా. అందులో విలేజ్‌లో వినాయకుడు, వినాయకుడు, ఓయ్, ఏమాయ చేశావే తదితర చిత్రాల్లోని పాత్రలు నాకు మంచి గుర్తింపు తెచ్చాయి.  

మీ అసలు పేరు ఏమిటి..?
నా అసలు పేరు కృష్ణంరాజు. ఈ పేరుతో ఇప్పటికే ఒక గొప్ప హీరో ఉన్నారు. అందుకని నేను సినీరంగ ప్రవేశం చేయగానే కృష్ణుడిగా పేరు మార్చుకున్నా.

మీ జీవితంలో మలుపుతిప్పిన ఘటన..
బాల్యం నుంచే సినిమా హీరో కావాలనుకునేవాడిని. 20 ఏళ్ల వయసులో బైక్‌ యాక్సిడెంట్‌ జరిగింది. కుడికాలు పూర్తిగా దెబ్బతినింది. అప్పుడు మూడేళ్లపాటు బెడ్‌రెస్ట్‌. ఇక నాజీవితం ఇంతేనేమో.. అనుకున్న లక్ష్యం చేరుతానో లేదోనని ఆందోళన చెందాను. నా బాధ చూసి తమ్ముడు, చెల్లి, స్నేహితులు ఓదార్చేవారు. ఆ సమయంలోనే అధికంగా బరువు పెరిగిపోయాను. లావుగా ఉన్నందున నాకు సహనటుడుగా అవకాశం దక్కింది. తర్వాత డైరెక్టర్‌ కిరణ్‌సాయి సహకారంతో హీరోగా అవకాశం వచ్చింది.

రాజకీయాల్లోకి రావడానికి ప్రేరణ ఏమిటి..?
ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వ పటిమ చూసి ఇష్టపడ్డా. ప్రజలే తన ఊపిరిగా.. కుటుంబంగా అలుపెరుగకుండా వారి కోసం ‘ప్రజాసంకల్ప యాత్ర’ పేరుతో పాదయాత్ర చేయడం చూసి చలించిపోయా. వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేయడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. పేదల కష్టాలను కళ్లారా చూసి.. వారి కోసం ఆయన ఇస్తున్న హామీలు, సంక్షేమ పథకాల రూపకల్పన నచ్చాయి. అందుకే రాజకీయాల్లోకి రావాలనుకున్నా. వైఎస్సార్‌సీపీలో చేరా.

ప్రేక్షకాదరణ ఎలా ఉంది?
బొద్దుగా ఉన్న నన్ను ప్రేక్షకులు రిసీవ్‌ చేసుకున్న తీరును ఎన్నటికీ మరచిపోలేను. నిజంగా వారందరికీ థ్యాంక్స్‌ చెబుతున్నా. హ్యాపీడేస్‌ సినిమా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. ఈ సినిమా రీలిజ్‌ తర్వాత రాజమండ్రికి వెళ్లా. ‘అప్పుడు చాలాబాగా నటించారు.. బొద్దుగా ముద్దొచ్చేలా ఉన్నావం’టూ ప్రేక్షలు చెప్పడం చూస్తే నిజంగా సంతోషమేసింది.

ఆటలంటే ఇష్టమా..?
క్రికెట్‌ అంటే నాకు చచ్చేంత ప్రాణం. సచిన్‌ బ్యాటింగ్‌ను ఎంతగానో ఇష్టపడుతా. క్రికెట్‌ ఆడే వారికి నా ప్రోత్సాహం అందిస్తూనే ఉన్నా.

‘అనంత’తో మీకున్న అనుబంధం
రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది. ఆయన కుమారుడు ప్రవీణ్‌రెడ్డి నాతో అన్యోన్యంగా ఉంటాడు. నేను అభిమానించే ఫ్యామిలీలో కాపు కుటుంబం కూడా ఒకటి. గొప్ప మనసున్న నాయకుడు కాపు.

ప్రజాసంకల్ప యాత్రపై మీ స్పందన?
ప్రజల కష్టాలు స్వయంగా తెలుసుకునేందుకు ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ సూపర్బ్‌. ఎండనక.. వాననక.. పాదయాత్ర చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. ఇటీవల ఆయనతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నా. ‘మీకేమన్నా ఇంత కష్టం’ అని అడిగితే.. ‘నాన్నలా మంచి చేసి... పేరు సంపాదించుకోవాలి. పేదల కష్టాలు తొలగించటమే నా ధ్యేయం’ అని చెప్పారు. ఎంతటి గొప్ప మనసు జగనన్నది. జగన్‌ అనే నేను.. అనే పదం కోసం నాతో సహా ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

గుమ్మఘట్ట మండలం గొల్లపల్లిలో క్రికెట్‌ టోర్నీ ముగింపు కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలతో కలిసి పాల్గొన్న కృష్ణుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement