మణిరత్నం దర్శకత్వంలో మాధవన్?
తమిళసినిమా: మణిరత్నం దర్శకత్వంలో నటుడు మాధవన్ నటించనున్నారా? ఈ ప్రశ్నకు అలాంటి అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల నుంచి సమాధానం వస్తోంది. మణిరత్నం, మాధవన్‌లది హిట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. ఇంతకు ముందు వీరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు ప్రేక్షకులకు అనుభూతిని కలిగించాయి. మణిరత్నం దర్శకత్వం వహించనున్న ఈ ద్విభాషా చిత్రంలో టాలీవుడ్ స్టార్ రామ్‌చరణ్ తేజ, మాలీవుడ్ నటుడు ఫాహిద్ ఫాజిల్ కలిసి నటించనున్నట్లు ప్రచారంలో ఉంది.
ఈ చిత్రం సెప్టెంబర్ లో సెట్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితిలో మాధవన్‌ను తన చిత్రంలో నటింపజేసే ప్రయత్నంలో మణిరత్నం ఉన్నట్లు సమాచారం. మణిరత్నం తన తాజా చిత్రంలో మాధవన్‌ను నటింపజేయాలనుకుంటున్నారా, ఆ తరువాత చిత్రం గురించి చర్చలు జరుపుతున్నారా అన్నది తెలియాల్సి ఉంది. విక్రమ్ వేదా చిత్రంలో పోలీస్ అధికారిగా నటించి మంచి పేరు తెచ్చుకున్న మాధవన్ ప్రస్తుతం ఒక తమిళ హిందీ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు.