
ఎం.ఎస్.నారాయణ ఆరోగ్యం విషమం
హైదరాబాద్: ప్రముఖ హాస్యనటుడు, దర్శకుడు ఎం.ఎస్.నారాయణ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. సంక్రాంతి పండుగకని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వెళ్లిన ఆయన అనారోగ్యానికి గురయ్యారు. దీంతో చికిత్స నిమిత్తం కిమ్స్ ఆసుపత్రికి ఈ నెల 20న తీసుకొచ్చారు. అయితే ఎం.ఎస్. మరణించారని గురువారం పలు టీవీ చానళ్లలో వార్తలు రావడంతో సినీరంగ ప్రముఖులు, ఆయన సన్నిహితులు, అభిమానులు హతాశులయ్యారు.
ఈ నేపథ్యంలో కిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నారాయణ మాట్లాడుతూ ఎం.ఎస్.నారాయణ గుండెపోటుకు గురయ్యారని, ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామనీ, డయాలసిస్ కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎం.ఎస్.నారాయణను సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, హాస్యనటుడు బ్రహ్మానందం, నటులు రావు రమేష్, శ్రీనివాస్ రెడ్డి, ఉత్తేజ్, అనంత్ తదితరులు పరామర్శించారు.
నాన్న కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం: శశికిరణ్
తమ తండ్రి ఎం.ఎస్. ఆరోగ్యం విషమంగా ఉందని ఆయన కుమార్తె శశికిరణ్ మీడియాకు తెలిపారు. త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.