డ్రగ్స్ కేసులో హీరో నందు విచారణ పూర్తి
హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ ఫోన్‌కాల్స్ డేటా ఆధారంగా వర్థమాన హీరో నందు అలియాస్ ఆనంద కృష్ణను సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. డ్రగ్స్ కేసులో భాగంగా 12వ రోజు మంగళవారం ఉదయం నందు నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయానికి హాజరయ్యారు. కెల్విన్, జీశాన్‌లతో నందుకు పరిచయం ఉందని, అందులో భాగంగానే డ్రగ్స్ వ్యవహారంపై ప్రశ్నించనున్నామని సిట్ అధికారులు ఇప్పటికే వెల్లడించిన విషయం విదితమే. ఆ దిశగా సిట్ అధికారులు...నందూను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సుమారు మూడు గంటల పాటు ఆయన్ని సిట్ అధికారులు విచారణ జరిపారు. ప్రధానంగా కెల్విన్‌తో సంబంధంపై సిట్ ఆరా తీసినట్లు తెలిసింది. నందు విచారణతో తొలి విడత విచారణ పూర‍్తయింది.
కాగా వర్ధమాన నటుడు తనీష్‌ను కూడా సిట్ నిన్న ప్రశ్నించిన విషయం విదితమే. ఇప్పటివరకూ సిట్ అధికారులు చిత్రపరిశ్రమకు చెందిన 11మందిని విచారణ చేశారు. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, కెమెరా మెన్ శ్యామ్ కే నాయుడు, నటుడు సుబ్బరాజు, హీరోలు తరుణ్, నవదీప్, సినీనటి చార్మీ, ముమైత్ ఖాన్, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, హీరో రవితేజ, ఆయన డ్రైవర్ శ్రీనివాసరావు, తనీష్ సిట్ విచారణకు హాజరయ్యారు. కాగా తర్వలో మరికొందరికి నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం.