విశాల్‌తో రొమాన్స్‌కు రకుల్ ప్రీత్ సింగ్ సిద్ధం అవుతుందా? దీనికి కోలీవుడ్ నుంచి ఎస్ అనే సమాధానమే వస్తోంది. నటుడు అరుణ్ విజయ్‌కు జంటగా తడయారు తాక్క చిత్రం ద్వారా తమిళ పరిశ్రమకు దిగుమతి అయిన ఉత్తరాది బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఆ తరువాత పుత్తగమ్, ఎన్నమో ఏదో వంటి చిత్రాల్లో నటించినా ఇక్కడ కేక పుట్టించలేకపోయినా ఈ చిన్నది ఆపై టాలీవుడ్‌కెళ్లి అక్కడిప్పుడు కేక పుట్టిస్తోంది.
తెలుగు యువ హీరోలతో నటిస్తూ యమ బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ కు కోలీవుడ్‌లో రాణించలేకపోయాననే బాధ చాలా కాలంగా వెంటాడుతూనే ఉంది. ఆ మధ్య రామ్ చరణ్‌తో నటించిన బ్రూస్‌లీ చిత్ర తమిళ అనువాద ఆడియో కార్యక్రమంలో పాల్గొన్న ఈ అమ్మడు మంచి అవకాశం వస్తే తమిళంలో నటించడానికి రెడీ అని ఒక స్టేట్‌మెంట్ పడేసింది. అది ఇప్పుడు వర్కౌట్ అవుతున్నట్లు సమాచారం. రకుల్ త్వరలో విశాల్‌లో డ్యూయెట్లు పాడటానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. దీనికి తుప్పరివాలన్ అనే టైటిల్‌ను కూడా నిర్ణయించారు.
ఈ చిత్రం ద్వారా రకుల్ ప్రీత్ సింగ్ కోలీవుడ్‌కు రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది. మిష్కిన్ చిత్రాల్లో కథానాయికలకు, కథానాయకులకు సమానంగా ప్రాధాన్యం ఉంటుందన్న విషయం తెలిసిందే. అందువల్ల ఈ చిత్రంతో కోలీవుడ్‌లో తన విజయ ఖాతాను తెరవాలని రకుల్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తుప్పరివాలన్ చిత్రంలో రకుల్‌ను ఎంపిక చేయడానికి చర్చలు జరుగుతున్నాయని, కాగా ఇంకా ఆమె ఒప్పందంపై సంతకం చేయలేదని విశాల్ వర్గం అంటోంది.