ఫిదా సక్సెస్‌మీట్‌లో నటుడి భావోద్వేగం
హైదరాబాద్: మెగా హీరో వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన మూవీ ‘ఫిదా’. ఈ నెల 21న విడుదలైన మూవీ సక్సెస్ మీట్‌ను గురువారం నిర్వహించారు. ఈ మూవీ భానుమతి పాత్రతో ఆకట్టుకున్న సాయి పల్లవి తర్వాత అందరి చర్చించుకుంటున్నది ఆమె తండ్రి పాత్రలో మెప్పింపిన సీనియర్ నటుడు సాయి చంద్ గురించే. ఈవెంట్లో సాయి చంద్ మాట్లాడుతూ.. కొన్ని ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంటూనే భావోద్వేగానికి లోనయ్యారు. ఇండస్ట్రీలో తమ ఫ్యామిలీది తొలితరమని, ఎన్టీఆర్, ఏఎన్నార్ కంటే ముందుగానే తన తండ్రి కొన్ని మూవీల్లో నటించారని గుర్తుచేసుకున్నారు.
తాను 'మా భూమి'తో వెండితెరకు పరిచయమై ఎన్నో సినిమాల్లో నటించినా గత కొంత కాలం నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉన్నట్లు తెలిపారు. చాలా కాలం తర్వాత నటించినప్పటికీ ఫిదాలో సాయి పల్లవి తండ్రి పాత్రకు మంచి గుర్తింపు దక్కిందన్నారు. విదేశాల నుంచి కూడా చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలు తనకు ఫోన్ చేసి మీరు బాగా నటించారని చెప్పడంపై హర్షం వ్యక్తం చేశారు. ఫిదాలో మిమ్మల్ని చూస్తున్నంతసేపు మా నాన్నే గుర్తొచ్చారని ఫోన్ చేసిన వాళ్లలో ఎక్కువ మంది చెప్పారన్నారు. అయితే నిజ జీవితంలో తనకు అసలు పెళ్లికాలేదని, పిల్లలే లేరని చెప్పిన సాయి చంద్.. తన పాత్రకు గుర్తింపునిస్తూ తండ్రిగా తనను ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు. కొన్ని ప్రొడక్షన్లలో పనిచేయలేదన్న బాధ ఈ మూవీలో నటించడంతో తీరిందన్నారు.
సంబంధిత కథనం
‘దిల్ రాజును చూస్తే ఈర్ష్యగా ఉంది’