విజయ్ నిరాహార దీక్ష
‘తలైవా’ చిత్రం విడుదల వ్యవహారంలో ఆ చిత్ర హీరో విజయ్ అనూహ్య నిర్ణయానికి వచ్చారు. వెంటనే విడుదలకు చర్యలు చేపట్టాలంటూ నిరాహారదీక్షకు దిగనున్నారు. ‘తలైవా’ చిత్రం ఈ నెల తొమ్మిదిన విడుదల కావలసి ఉండగా, థియేటర్లకు బాంబు బెదిరింపులు రావడంతో విడుదల కాలేదు. అయితే ఈ చిత్రం పొరుగు రాష్ట్రాలు ఆంధ్ర, కేరళ, కర్నాటకలతో పాటు విదేశాల్లోనూ విడుదలైంది.
దీంతో ‘తలైవా’ పైరసీ సీడీలు తమిళనాడులో మార్కెట్‌లోకి రావటం చిత్ర యూనిట్‌ను దిగ్భ్రాంతి కలిగించింది. ఈ చిత్ర నిర్మాత చంద్రప్రకాష్ జైన్ ‘తలైవా’ విడుదలకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితకు గురువారం విజ్ఞప్తి చేశారు. శుక్రవారం దర్శకుడు విజయ్, సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్‌కుమార్‌లతో కలసి చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయానికి వెళ్లి అదనపు పోలీసు కమిషనర్ నల్లశివంను కలిసి ఒక లేఖను అందించారు.
‘తలైవా’ చిత్రం పొరుగు రాష్ట్రాలలో విడుదల కావడంతో ఇంటర్‌నెట్‌లోనూ, పైరసీ సీడీల ద్వారా విచ్చల విడిగా బయటకొచ్చేస్తోందని తెలిపారు. ‘తలైవా’ చిత్రం విడుదల కోసం హీరో విజయ్, సత్యరాజ్, హీరోయిన్ అమలాపాల్ ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం కలిసి చెన్నైలో నిరాహారదీక్షకు పూనుకుంటున్నట్లు తెలిపారు. అందుకు అనుమతి ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేశారు.