Thalaivaa
-
తలైవా సీరియస్ వార్నింగ్.. ఇంకోసారి రిపీట్ అయిందో..!
తమిళ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్‌కు కోపం వచ్చింది. తన ఫొటోలను అనుమతి లేకుండా వినియోగించ వద్దంటూ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. సూపర్ స్టార్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ మేరకు తలైవా తరపు న్యాయవాది పబ్లిక్ నోటీస్ విడుదల చేశారు. దీంతో కోలీవుడ్‌లో ఈ విషయంపై చర్చ మొదలైంది. ఆ నోటీస్‌లో ఏముందంటే..'రజినీకాంత్ సెలబ్రిటీ హోదాలో ఉన్నారు. బిజినెస్‌పరంగా ఆయన పేరు, ఫొటోలు ఉపయోగించుకునే హక్కు ఆయనకు మాత్రమే ఉంంది. కొందరు ఆయన మాటలను, ఫొటోలను, వ్యంగ్య చిత్రాలను దుర్వినియోగం చేస్తున్నారు. ఇలా ఆయన అనుమతి లేకుండా ప్రజాదరణ పొందుతూ వారి ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తుకుంటున్నారు. సినీ ఇండస్ట్రీలో ఆయన ఓ సూపర్‌స్టార్. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇండస్ట్రీలో ఆయనకు ఎంతో గౌరవం ఉంది. రజినీకాంత్ ప్రతిష్ఠకు ఏదైనా భంగం కలిగిస్తే దాని వల్ల ఎంతో నష్టం కలుగుతుంది. ఇకపై రజినీకాంత్ అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు వాడకూడదు.' అని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా.. తలైవా ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో జైలర్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ హీరో శివరాజ్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
రాజకీయాల్లోకి రజనీ
సాక్షి, చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ (66) రాజకీయ రంగ ప్రవేశంపై మూడేళ్లుగా నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. రాజకీయాల్లోకి రావాలా వద్దా అన్న ఊగిసలాటకి ఎట్టకేలకి తలైవా తెరదించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకి సరిగ్గా 6 నెలల ముందు రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా ట్విట్టర్ వేదికగా గురువారం ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరిలో రాజకీయ పార్టీ ప్రారంభిస్తానని, దీనికి సంబంధించిన వివరాలను డిసెంబర్ 31న వెల్లడిస్తానని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా తాము ఆధ్యాత్మిక లౌకిక రాజకీయాలనే కొత్త పంథాలో నడవనున్నట్టు తెలిపారు. ‘‘మేము తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో గెలుస్తాం. నీతి నిజాయితీ, పారదర్శకత, అవినీతిరహిత రాజకీయాలు ఎలా ఉంటాయో చూపిస్తాం. ఈసారి ఎన్నికల్లో అద్భుతాలు జరగబోతున్నాయి’’అని రజనీ ట్వీట్ చేశారు. ఇప్పుడు జరగకపోతే ఎప్పటికీ జరగదు, మేము మారుస్తాం. మేము అన్నింటినీ మారుస్తాం అన్న హ్యాష్‌ట్యాగ్‌లను జత చేరుస్తూ రజనీ తన రాజకీయ అరంగేట్రం ప్రకటన చేశారు. రాజకీయ అరంగేట్రంపై రజనీకాంత్ స్పష్టతనివ్వడంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. చెన్నై కోడంబాక్కంలో శ్రీరాఘవేంద్రస్వామి కల్యాణమండపం వద్ద బాణా సంచా కాల్చారు. నగర వీధుల్లో తిరుగుతూ లడ్డూలు పంచిపెట్టారు. గెలుపోటములకు మీదే బాధ్యత సోషల్ మీడియాలో రాజకీయ రంగ ప్రవేశం ప్రకటన చేశాక రజనీకాంత్ తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ తమిళనాడు రాజకీయాల తలరాత మార్చడం ఎంతో అవసరమన్నారు. ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ అది సాధ్యం కాదని, తమిళ ప్రజల కోసం తన ప్రాణాలైనా ఇస్తానని చెప్పారు. కరోనా వైరస్ కారణంగా తన పొలిటికల్ ఎంట్రీ కాస్త ఆలస్యమైందన్నారు. రాజకీయాల్లో విజయం సాధించడమంటే అది ప్రజా విజయమేనన్న రజనీ ‘‘నేను ఎన్నికల్లో గెలిస్తే అది ప్రజా విజయం, ఒకవేళ నేను ఓడిపోతే కూడా అది వాళ్ల పరాజయమే. నా గెలుపు మీ గెలుపు ఎలాగో, నా ఓటమి మీ ఓటమి కూడా. అంతా మీ చేతుల్లోనే ఉంది’’అని వ్యాఖ్యానించారు. గత అక్టోబర్‌లో అనారోగ్య కారణాలతో రాజకీయాల్లోకి రాలేనంటూ రజనీకాంత్ పేరిట రాసిన ఒక లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ లేఖలో పేర్కొన్నట్టుగా అనారోగ్య సమస్యలు తనని వేధిస్తున్నాయని, కిడ్నీ మార్పిడి ఆపరేషన్ అవడంతో కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు సమూహాలకు దూరంగా ఉండాలని వైద్యులు సలహా ఇచ్చారని అప్పట్లోనే చెప్పారు. బీజేపీ ప్రముఖునికి పదవి బీజేపీ మేధావుల విభాగం తమిళనాడు అధ్యక్షుడు అర్జున్ మూర్తి రజనీ కొత్త పార్టీకి సమన్వయకర్తగా నియమితులయ్యారు. పార్టీ పర్యవేక్షకుడిగా గాంధీ మక్కల్ ఇయక్కం అధ్యక్షుడు తమిళరువి మణియన్‌ను నియమించారు. రజనీతోపాటు వీరిద్దరూ కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. -
అనుభవ పాఠాలు
అనుభవాలు పాఠాలు నేర్పుతాయంటారు. తానొకటి తలస్తే దైవం మరొకటి చేస్తుందని నటి అమలాపాల్‌కు బాగా అర్థం అయ్యిందట. మైనా చిత్రంతో పల్లకి ఎక్కిన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుసగా దైవ తిరుమగళ్, వేట్టై వంటి హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. అదే సమయంలో టాలీవుడ్ నుంచి పిలుపురావడంతో ఇంకేముంది స్టార్ ఇమేజ్ వచ్చేసిందని సంబరపడిపోయింది. అంతకంటే ఆనందం ఇళయదళపతి సరసన తలైవా చిత్రంలో నటించే అవకాశం రావడం. దీంతో ఉన్నత స్థానం ఖాయమని ఆశల పల్లకిలో ఊరేగింది. ఎంతగానో ఊహించుకున్న తలైవా చిత్రం ఆశించిన విజయాన్ని అందించకపోవడంతో ఆమె కట్టుకున్న ఆశల గూడు పేకముక్కలా కూలిపోయింది. ఆ తర్వాత కోలీవుడ్‌లో ఒక్క అవకాశం కూడా రాకపోవడం విశేషం. తెలుగులోనూ అదే పరిస్థితి. దీంతో అమలాపాల్‌కు ఒక్క విషయం బోధపడిందట. దేనిపైనా అంతగా ఆశ పెట్టుకోరాదని. ఇకపై ఏ విషయం గురించి అతిగా ఊహించుకోకూడదని, జరిగేది జరుగుతుందనే తత్వాన్ని అలవరుచుకుంటోందట. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు తమిళ చిత్రాలు, ఒక మలయాళ చిత్రం ఉన్నాయి. ఇకపై జయాపజయాలను సీరియస్‌గా తీసుకోకుండా నటించాలని, అనూహ్య పరిస్థితులు వచ్చినా ధైర్యంగా ఉండాలని మానసికంగా సిద్ధమైనట్లు అమలాపాల్ పేర్కొంది. -
విజయ్ నిరాహార దీక్ష
‘తలైవా’ చిత్రం విడుదల వ్యవహారంలో ఆ చిత్ర హీరో విజయ్ అనూహ్య నిర్ణయానికి వచ్చారు. వెంటనే విడుదలకు చర్యలు చేపట్టాలంటూ నిరాహారదీక్షకు దిగనున్నారు. ‘తలైవా’ చిత్రం ఈ నెల తొమ్మిదిన విడుదల కావలసి ఉండగా, థియేటర్లకు బాంబు బెదిరింపులు రావడంతో విడుదల కాలేదు. అయితే ఈ చిత్రం పొరుగు రాష్ట్రాలు ఆంధ్ర, కేరళ, కర్నాటకలతో పాటు విదేశాల్లోనూ విడుదలైంది. దీంతో ‘తలైవా’ పైరసీ సీడీలు తమిళనాడులో మార్కెట్లోకి రావటం చిత్ర యూనిట్‌ను దిగ్భ్రాంతి కలిగించింది. ఈ చిత్ర నిర్మాత చంద్రప్రకాష్ జైన్ ‘తలైవా’ విడుదలకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితకు గురువారం విజ్ఞప్తి చేశారు. శుక్రవారం దర్శకుడు విజయ్, సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్కుమార్లతో కలసి చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయానికి వెళ్లి అదనపు పోలీసు కమిషనర్ నల్లశివంను కలిసి ఒక లేఖను అందించారు. ‘తలైవా’ చిత్రం పొరుగు రాష్ట్రాలలో విడుదల కావడంతో ఇంటర్నెట్లోనూ, పైరసీ సీడీల ద్వారా విచ్చల విడిగా బయటకొచ్చేస్తోందని తెలిపారు. ‘తలైవా’ చిత్రం విడుదల కోసం హీరో విజయ్, సత్యరాజ్, హీరోయిన్ అమలాపాల్ ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం కలిసి చెన్నైలో నిరాహారదీక్షకు పూనుకుంటున్నట్లు తెలిపారు. అందుకు అనుమతి ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేశారు. -
'అన్న' చూడలేకపోయానని యువకుడి ఆత్మహత్య
తమిళ హీరో విజయ్ నటించిన 'అన్న' సినిమా చూడలేకపోయానన్న ఆవేదనతో తమిళనాడులో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. విజయ్ వీరాభిమాని అయిన విష్ణు (20) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తుంటాడు. అతడు కోయంబత్తూరు శివార్లలోని తుడియాలూరు ప్రాంతంలో నివసిస్తుంటాడు. 'అన్న' సినిమా శుక్రవారమే విడుదల కావాల్సి ఉండగా, అది వాయిదా పడింది. దీంతో విష్ణు చాలా ఆవేదన చెందాడు. ఎలాగైనా సినిమా చూడాలన్న ఉద్దేశంతో అతడు ఇక్కడకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేరళ రాష్ట్రంలోని వేలాంతవాళం అనే ఊరు వెళ్లాడు. కానీ, అక్కడ అతడికి టికెట్ దొరకలేదు. దాంతో తీవ్రంగా నిరాశ చెంది, కోయంబత్తూరు తిరిగి వచ్చేశాడు. కానీ తిరిగొచ్చాక, తెల్లవారు జామున తన ఇంట్లోని సీలింగ్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. నిర్మాతలకు వ్యతిరేకంగా ఉన్న ఓ వర్గం నుంచి బెదిరింపులు రావడంతో 'అన్న' సినిమా విడుదల తమిళనాడులో నిలిచిపోయింది. -
విడుదలకు నోచుకోని తలైవా
తమిళసినిమా, న్యూస్‌లైన్: తలైవా చిత్రం తమిళనాట శుక్రవారం విడుదల కాలేదు. దీంతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యూరు. ఇళయదళపతి విజయ్ నటించిన తాజా చిత్రం తలైవా. దీనిని శుక్రవారం విడుదల చేయడానికి సన్నాహాలు జరిగాయి. అయితే చిత్రాన్ని ప్రదర్శించరాదంటూ చెన్నైలోని పలు థియేటర్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తలైవాను తిలకించిన సెన్సార్ బృందం చిత్రంలో విజయ్ చెప్పే కొన్ని సంభాషణలపై అభ్యంతరం తెలిపింది. ఈ కారణాలతో థియేటర్ల యూజమాన్యం వెనకంజ వేసింది. అభిరామి రామనాథన్ ఆధ్వర్యంలో థియేటర్ల యాజమాన్యం గురువారం రెండుసార్లు సమావేశమై సుదీర్ఘంగా చర్చించి నా ఫలితం లేకపోయింది. తలైవా చిత్రం తమిళనాడు, పాండిచ్చేరిలో శుక్రవారం విడుదల కాలేదు. ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, ముంబ యిలో విడుదలైంది. మరోవైపు విజయ్ అభిమానులు తమిళనాట ఆందోళనలకు దిగారు. చిత్రాన్ని ప్రదర్శించనందుకు థియేటర్లలో బాంబులు పెట్టనున్నట్లు కొందరు ఫోన్లో బెదిరింపులకు పాల్పడడం గమనార్హం. కొందరు అభిమానులు అయితే సినిమాను చూసేందుకు సరిహద్దుల్లోని ఆంధ్రప్రదేశ్, కేరళకు పయనమయ్యారు. పైరసీ భయం: తలైవా సినిమా నిర్మాతలకు మరో భయం పట్టుకుంది. ఈ చిత్రం తమిళనాడులో విడుదల కాకున్నా ఇతర రాష్ట్రాల్లో ప్రదర్శితమవుతోంది. దీంతో పైరసీ సీడీలు తమిళనాడుకు చేరే అవకాశం ఉందని నిర్మాతలు కలత చెందుతున్నారు.