విడుదలకు నోచుకోని తలైవా
తమిళసినిమా, న్యూస్‌లైన్: తలైవా చిత్రం తమిళనాట శుక్రవారం విడుదల కాలేదు. దీంతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యూరు. ఇళయదళపతి విజయ్ నటించిన తాజా చిత్రం తలైవా. దీనిని శుక్రవారం విడుదల చేయడానికి సన్నాహాలు జరిగాయి. అయితే చిత్రాన్ని ప్రదర్శించరాదంటూ చెన్నైలోని పలు థియేటర్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తలైవాను తిలకించిన సెన్సార్ బృందం చిత్రంలో విజయ్ చెప్పే కొన్ని సంభాషణలపై అభ్యంతరం తెలిపింది. ఈ కారణాలతో థియేటర్ల యూజమాన్యం వెనకంజ వేసింది.
అభిరామి రామనాథన్ ఆధ్వర్యంలో థియేటర్ల యాజమాన్యం గురువారం రెండుసార్లు సమావేశమై సుదీర్ఘంగా చర్చించి నా ఫలితం లేకపోయింది. తలైవా చిత్రం తమిళనాడు, పాండిచ్చేరిలో శుక్రవారం విడుదల కాలేదు. ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, ముంబ యిలో విడుదలైంది. మరోవైపు విజయ్ అభిమానులు తమిళనాట ఆందోళనలకు దిగారు. చిత్రాన్ని ప్రదర్శించనందుకు థియేటర్లలో బాంబులు పెట్టనున్నట్లు కొందరు ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడడం గమనార్హం. కొందరు అభిమానులు అయితే సినిమాను చూసేందుకు సరిహద్దుల్లోని ఆంధ్రప్రదేశ్, కేరళకు పయనమయ్యారు.
పైరసీ భయం: తలైవా సినిమా నిర్మాతలకు మరో భయం పట్టుకుంది. ఈ చిత్రం తమిళనాడులో విడుదల కాకున్నా ఇతర రాష్ట్రాల్లో ప్రదర్శితమవుతోంది. దీంతో పైరసీ సీడీలు తమిళనాడుకు చేరే అవకాశం ఉందని నిర్మాతలు కలత చెందుతున్నారు.