
ధనుష్‌తో సునైనా చిందులు
నటుడు ధనుష్ చిత్రంలో చిందులేయడానికి సిద్ధమైంది నటి సునైనా. కోలీవుడ్‌లో తన ఉనికిని చాటుకుంటున్న మరో టాలీవుడ్ భామ సునైనా. అయితే కొన్ని చిత్రాల్లో కథానాయకిగా నటించినా ఎందుకనో నటిగా తనకుంటూ ఒక స్థాయికి చేరుకోలేకపోయింది. కోలీవుడ్, టాలీవుడ్‌లోనూ అడపాదడపా అవకాశాలను అందుకుంటోంది. ఆ మధ్య కవలైవేండామ్ చిత్రంలో అతిథిగా మెరిసిన సునైనా ఆ తరువాత మళ్లీ కోలీవుడ్‌లో కనిపించలేదు.
అయితే పస్తుతం సముద్రకనికి జంటగా తొండన్ చిత్రంలో నటించింది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. టాలీవుడ్‌లోనూ పెళ్లికి ముందు ప్రేమకథ అనే ఒక చిత్రంలో నటిస్తున్న సునైనాకు కొత్తగా అవకాశాలేమీ లేవు. తమిళంలో తొండన్ చిత్రం కోసం ఎదురుచూస్తున్న ఈ అమ్మడికి ధనుష్ చిత్రంలో నటించే అవకాశం రావడంతో ఎగిరి గంతేసి ఒప్పేసుకుందట. ధనుష్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో ఎన్నై నోక్కి పాయుం తోట్టా ఒకటి.
గౌతమ్‌మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 90 శాతం చిత్రీకరణ పూర్తి చేసుక్ను తరుణంలో దర్శకుడికి, ధనుష్‌కు మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో షూటింగ్ ఆగిపోయింది. తాజాగా ఇద్దరి మధ్య సయోధ్య కుదరడంతో మళ్లీ చిత్ర నిర్మాణం మొదలైంది. కాగా 90 శాతం చిత్రీకరణ పూర్తి అయిన ఎన్నైనోక్కి పాయుం తోట్టా చిత్రంలో నటి సునైనాను ఎంపిక చేయడం ఏమిటన్న విషయం గురించి ఆరా తీయగా అమ్మడు ఈ చిత్రంలో సింగిల్ సాంగ్‌కు చిందులేయనుందని చిత్ర వర్గాలు తెలిపాయి. మొత్తం మీద చాలా మంది కథానాయకిల మాదిరిగానే సునైనా కూడా ఐటమ్ సాంగ్‌కు సై అనేసిందన్న మాట. చిత్రంలో ఈ జాణ పాట కనువిందు చేస్తే మరిని అలాంటి అవకాశాలు రావచ్చు.