తమిళనాడు, పెరంబూరు: ఇవాళ సినిమా వాళ్లు రాజకీయాల్లోకి.. రాజకీయనాయకులు సినిమాలోకి రావడం సర్వ సాధారణంగా మారింది. సినిమా వాళ్ల నెక్ట్స్ స్టెఫ్ రాజకీయాలుగా ఉంటే, రాజకీయాల్లోని సీనియర్లు సినిమాలవైపు చూస్తున్నారని చెప్పవచ్చు. తాజాగా నటి ప్రియారామన్ రాజకీయరంగప్రవేశం ఖరారైంది. ఈమె బీజేపీ తీర్థం పుచ్చుకోనుంది. మలయాళీ భామ అయిన ప్రియారామన్ నటుడు రజనీకాంత్ కథను సమకూర్చి నటించిన ‘వళ్లి’ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ప్రవేశించింది.
తొలి చిత్రంలోనే బలమైన పాత్ర లభించడం, అదీ రజినీకాంత్ వంటి స్టార్ హీరోతో కలిసి నటించడంతో మంచి ప్రాచుర్యం లభించింది. తరువాత సూర్యవంశం తదితర చిత్రాల్లో నటించిన ప్రియారామన్ టాలీవుడ్‌లోనూ నటిగా పరిచయం అయ్యారు. కే.విశ్వనాధ్ దర్శకత్వం వహించిన శుభసంకల్పం చిత్రంలో కమల్‌హాసన్‌తో కలిసి నటించింది. మరి కొన్ని తెలుగు చిత్రాల్లోనూ నటించింది. కాగా నేశం పుదుసు అనే చిత్రంలో నటుడు రంజిత్‌తో కలిసి నటించిన ప్రియారామన్ ఆయన్ని ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంది.
వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మనస్పర్థలతో 2014లో విడిపోయి విడాకులు తీసుకున్నారు. నటనకు గ్యాప్ ఇచ్చిన నటి ప్రియారామన్ ఇటీవల మళ్లీ బుల్లితెరలో నటించడంతో పాటు, టీవీ కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆమె రాజకీయరంగప్రవేశం చేయడానికి సిద్ధమయ్యారు. బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి లైన్ క్లియర్ అయ్యిందని ఆమె ఒక భేటీలో పేర్కొన్నారు. ప్రియరామన్ ఆంధ్రాకు చెందిన బీజేపీ నాయకులతో చర్చలు జరుపుతోందని, త్వరలోనే ఆమె ఆ పార్టీలో చేరే విషయమై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రియారామన్ మాజీ భర్త రంజిత్ కూడా ఆ మధ్య తమిళనాడులోని బీజేపీ పార్టీలో చేరారు. ఆ పార్టీ అధిష్టానంపై ఏర్పడ్డ అసంతృప్తి కారణంగా బయటకు వచ్చి ఆ తరువాత డీఎంకేలో చేరారన్నది గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment