దర్శకురాలిగానూ ప్రజ్ఞ కనబరచిన మహానటి!
కళ్లతోనే కోటి భావాలను పలికించగల నటి సావిత్రి. అభినయానికి పర్యాయపదం ఆమె. సావిత్రి పేరు ముందు ప్రభుత్వం వారి ‘పద్మ’ బిరుదులేం లేవు. ప్రజలిచ్చిన ‘మహానటి’ బిరుదు తప్ప. అవార్డులకు అతీతమైన ప్రతిభ సావిత్రి సొంతం. తెలుగు, తమిళ ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్న రూపం ఆమెది. ఒక నటిగా సావిత్రికున్న ప్రజాదరణ ఏ నటికీ లేదంటే అతిశయోక్తి కాదు. ఓ విధంగా చెప్పాలంటే... తెలుగునాట అసలు సిసలైన తొలి లేడీ సూపర్‌స్టార్ సావిత్రి. ఆమె మహానటి మాత్రమే కాదు. మంచి దర్శకురాలు కూడా. తెలుగులో చిన్నారిపాపలు, మాతృదేవత, వింతసంసారం చిత్రాలకు దర్శకత్వం వహించిన సావిత్రి.. తమిళంలో కుళందై ఉళ్లమ్, ప్రాప్తం చిత్రాలను డెరైక్ట్ చేశారు.
నేడు ఆ మహానటి జయంతి. ఈ సందర్భంగా దర్శకురాలిగా ఆమె తొలి సినిమా ‘చిన్నారి పాపలు’(1968) గురించి ముచ్చటించుకుందాం. దర్శకురాలిగా తొలి సినిమాతోనే అందరి దృష్టినీ ఆకర్షించారు సావిత్రి. ‘చిన్నారిపాపలు’ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులందరూ మహిళలే కావడం విశేషం. ప్రముఖ గాయని పి.లీల సంగీతం అందించగా, నటి రాజసులోచన ఈ చిత్రానికి నృత్య దర్శకత్వం వహించారు. మోహన కళాదర్శకురాలిగా పనిచేశారు. పిల్లల మనస్తత్వాల నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు సావిత్రి. ఈ సినిమాకు మొదట అనుకున్న టైటిల్ ‘చిన్నారి మనసులు’. రచయిత ఆచార్య ఆత్రేయ. అయితే... ఆయన అనుకున్న సమయానికి స్క్రిప్ట్ అందివ్వకపోవడంతో... చివరకు ముళ్లపూడి వెంకటరమణను రచయితగా తీసుకున్నారు సావిత్రి.
జగ్గయ్య, జమున, జానకి, శాంతకుమారి, సూర్యకాంతం, ఎస్వీఆర్, రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు స్క్రీన్‌ప్లే కూడా సావిత్రే అందించారు. ‘మాతా ఫిలింస్’ పతాకంపై 1967 అక్టోబర్ 12న మద్రాస్ వాహినీ స్టూడియోలో ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి సావిత్రి భర్త జెమినీగణేశన్ కెమెరా స్విచాన్ చేయగా, ఆదుర్తి సుబ్బారావు క్లాప్ ఇచ్చారు.ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ‘దర్శకురాలిగా తొలి అనుభవం ఎలా ఉంది?’ అని ఓ విలేకరి సావిత్రిని అడిగితే-‘‘కొత్తగా ఏం లేదు. కంగారుగా కూడా లేదు. బహుశా నన్ను గమనించేవారికి కొత్తగా ఉండొచ్చు. నేను గొప్ప దర్శకులతో పనిచేశాను.
నాకు అబ్జర్వేషన్ ఎక్కువ. ఏ షాట్‌కి కెమెరా ఎలా పెడుతున్నారు, ఎక్స్‌ప్రెషన్స్‌ని ఎలా తీసుకుంటారు.. ఇలాంటి అంశాలన్నీ పరిశీలిస్తూ ఉండేదాన్ని. ఆ అనుభవంతోనే ఈ సినిమా చేస్తున్నా’’అని ధీమాగా సమాధానం చెప్పారట సావిత్రి. సావిత్రి డెరైక్షన్ చూడాలని... ఎంతో ఉత్సాహంతో దర్శకులు తాతినేని ప్రకాశరావు, ఆదుర్తి సుబ్బారావు, వి.మధుసూదనరావు సెట్‌కి వచ్చి కూర్చొనేవారట. సన్నివేశాలను ఆ మహానటి తెరకెక్కించే తీరు చూసి అభినందనలు తెలియజేశారట. నటిగా కాక దర్శకురాలిగా కూడా అందరి మన్ననలు అందుకున్న ఆ మహానటి భౌతికంగా మన మధ్య లేకపోయినా... ఆమె జ్ఞాపకాలు మనల్ని నిత్యం వెంటాడుతూనే ఉంటాయి.