
టార్గెట్ @10
ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మహిళలు బరువు పెరగడం సహజమే. నటి స్నేహ కూడా బరువు పెరిగారు. తర్వాత కాస్త బరువు తగ్గారు కూడా. ఇప్పుడు ఇంకా బరువు తగ్గే పనిలో ఉన్నారు. ఏదో ప్రెగ్నన్సీ వల్ల పెరిగిన బరువో? డెలివరీ తర్వాత పెరిగిన బరువునో ఆమె తగ్గించాలనుకోవడంలేదు. అసలు తగ్గాలన్న ఉద్దేశం కూడా స్నేహకు లేదు. అయితే క్యారెక్టర్ డిమాండ్ చేసిందని తగ్గుతున్నారు. మొత్తం పది కిలోలు తగ్గాలన్నది ఆమె టార్గెట్. ఆల్రెడీ ఏడు కిలోలు తగ్గారు స్నేహ. మరో మూడు కిలోలు తగ్గాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఎందుకంటే... ఆమెకంటే వయసులో ఏడాది చిన్నోడైన ఫాహద్ ఫాజిల్‌కి జోడీగా కనిపించనున్నారు స్నేహ. ‘ధృవ’ తమిళ మాతృక ‘తని ఒరువన్’ తర్వాత దర్శకుడు మోహన్ రాజా తీస్తున్న సినిమా ‘వేలైక్కారన్’. శివ కార్తికేయన్, ఫాహిద్ ఫాజిల్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో నయనతార, స్నేహ హీరోయిన్లు. ‘‘ఫాహిద్‌తో ఓ మలయాళ సినిమా చేశా. కానీ, అందులో మా కాంబినేషన్‌లో ఎక్కువ సీన్లు లేవు. ‘వేలైక్కారన్’ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా? అని ఎదురు చూస్తున్నా’’ అన్నారు స్నేహ. ఈ సినిమాలో వీలైనంత సన్నగా కనిపించాలని ఇంట్లోనే ఉదయం కార్డియో, సాయంత్రం వెయిట్ ట్రైనింగ్ వర్కౌట్స్ చేస్తున్నారామె.