
నయన చిత్రంలో స్నేహ
స్నిగ్ధ మనోహరి నటి స్నేహను మళ్లీ వరుసగా తెరపై చూడబోతున్నామన్నది సంతోషకరమైన సమాచారం.
స్నిగ్ధ మనోహరి నటి స్నేహను మళ్లీ వరుసగా తెరపై చూడబోతున్నామన్నది సంతోషకరమైన సమాచారం. ఇంతకు ముందు పక్కింటి అమ్మాయిగా మనందర్నీ అలరించిన స్నేహ ఆ తరువాత భక్తిరస పాత్రల్లోనూ అద్భుత నటనతో రక్తికట్టించారు.అలాంటి మంచి నటి మూడేళ్ల క్రితం నటుడు ప్రసన్నను ప్రేమించి పెళ్లి చేసుకుని నటనకు దూరం అయ్యారు. ఇది ఆమె అభిమానులకు నిరాశ కలిగించిన అంశమే అవుతుంది. అలాంటి వారికి స్నేహ మళ్లీ చిన్న గ్యాప్ తరువాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారన్నది తాజా వార్త.
గత ఏడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్నేహ మళ్లీ రీఎంట్రీ అవుతున్నారు. ఇప్పటికే మలయాళంలో అక్కడి సూపర్‌స్టార్ మమ్ముట్టికి జంటగా గ్రేట్‌ఫాదర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా తమిళంలో నటించడానికి పచ్చజెండా ఊపారన్నది తాజా సమాచారం. అయితే ఇందులో స్నేహ కథానాయకిగా నటించడం లేదట. లేడీ సూపర్‌స్టార్ నయనతార నాయకిగా నటించనున్న ఈ చిత్రంలో స్నేహ ఒక ముఖ్యపాత్రను పోషించనున్నారట. వివరాల్లోకెళితే తనీఒరువన్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని అందించిన దర్శకుడు మోహన్‌రాజా తాజాగా శివకార్తికేయన్ హీరోగా చిత్రం తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు.
ఈ చిత్రాన్ని ప్రస్తుతం రెమో చిత్రాన్ని నిర్మిస్తున్న 24 ఏఎం.స్టూడియోస్ అధినేత ఎండీ.రాజా నిర్మించనున్నారు. ఇందులో శివకార్తికేయన్, నయనతార జంటగా నటించనున్నారు. ఈ చిత్రంలో నటి స్నేహ ఒక కీలక పాత్రను పోషించనున్నారట. దీని గురించి నిర్మాత తెలుపుతూ ఇందులో స్నేహ అక్కగానో, చెల్లెలిగానో నటించడం లేదన్నారు. చాలా ముఖ్యమైన పాత్రను చేస్తున్నారని, చిత్రం అంతా ఉండే ఈ పాత్ర ఆమె కెరీర్‌లో లైఫ్‌టైమ్ పాత్రగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఇందులో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్, సతీష్, ఆర్‌జే.బాలాజి ముఖ్యపాత్రలను పోషించనున్నారట. త్వరలో చిత్రం సెట్‌పైకి వెళ్లనుంది.