మధుమతిలో నా పార్ట్ ఓకే: ఉదయభాను
'మధుమతి' హీరోయిన్ ఉదయభాను తనకు సినిమా ప్రివ్యూ చూపించలేదని అర్థరాత్రి హైదరాబాద్లో హంగామా సృష్టించింది. చిత్ర నిర్మాతపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు ప్రివ్యూ చూపించాల్సిందేనని పట్టుబట్టింది. ఎట్టకేలకు ఉదయభాను రాత్రి పొద్దుపోయిన తర్వాత పోలీసుల సమక్షంలో ప్రివ్యూ చూసింది.
ప్రివ్యూ చూసిన అనంతరం ఉదయభాను విలేకర్లతో మాట్లాడుతూ మధుమతి చిత్రంలో అసభ్యకరం ఏమీ లేదని... తన పాత్ర విషయంలో ఎలాంటి అభ్యంతరకరం లేదని సర్టిఫికెట్ ఇచ్చేసింది. అయితే విడుదల ముందే తనకు సినిమాను చూసే అధికారం ఉందని, అయితే నిర్మాతను అడిగితే థియేటర్లు ఖాళీ లేనందున ప్రివ్యూ చూపించలేదని చెప్పారని చెప్పింది. తాను ఎవరిపైన కేసు పెట్టలేదని ఉదయభాను స్పష్టం చేసింది. సినిమా చూడాలనుకున్నాను... చూశానంటూ ఆమె సింపుల్గా తేల్చేసింది.
ఉదయభాను ప్రధాన పాత్రధారిణిగా రూపొందుతోన్న‘మధుమతి’ చిత్రానికి రాజ్‌శ్రీధర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని గోమాతా ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై కె.రాణి శ్రీధర్, రమేశ్‌బాబు తెరకెక్కించారు. ఉదయభాను ఈ సినిమాలో వేశ్య పాత్ర పోషించగా, విష్ణుప్రియన్, దీక్షాపంథ్ కీలక పాత్రధారులు.
కాగా ప్రివ్యూ వివాదంపై దర్శకుడు రాజ్‌శ్రీధర్ మాట్లాడుతూ ....పోలీసులతో కలిసి ఉదయభాను సినిమా చూడాల్సిన విషయం ఏమీ వచ్చిందని ... ప్రివ్యూ చూపించమని అడిగితే తామే చూపించేవాళ్లమని అన్నారు. సెన్సార్ యూఏ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత సినిమాను పర్యవేక్షించటానికి పోలీసులు ఎవరని రాజ్శ్రీధర్ ప్రశ్నించారు. తన భవిష్యత్ ప్రణాళికలకు ఈ చిత్రం అడ్డు కానుందేమో అనే అనుమానంతోనే ఉదయభాను ఇలా వ్యవహరించి ఉంటుందని దర్శకుడు అభిప్రాయపడ్డాడు.
మరోవైపు నిర్మాత మాట్లాడుతూ మధుమతి చిత్రంలో ఉదయభాను అద్భుతంగా నటించిందన్నారు. ఆమె నటించిన పాత్రకు తప్పకుండా అవార్డు వచ్చి తీరుతుందన్నారు. ఆ క్రెడిట్ అంతా ఉదయభానుదేనన్నారు. ఇక మధుమతి చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రంలో ఉదయభాను చాలా బోల్డ్ గా నటిస్తుందనే టాక్ మొదటి నుంచి ఉండటంతో..ఏదో అందాల ఆరబోత ఉంటుందనే అంచనాల్లో ఒక వర్గం ప్రేక్షకులు ఉన్నారు.
ఈ సినిమా ట్రైలర్స్ కూడా అదే విధంగా ఉండటంతో ప్రేక్షకుల అంచనాలు పెరిగాయి. మరి మధుమతిగా భాను ఏమేరకు ప్రేక్షకుల్ని ఆలరిస్తోందో చూడాలి. కాగా వచ్చే ఎన్నికల్లో ఉదయభాను పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు పుకార్లు జోరుగా షికార్లు చేస్తున్నాయి.