
ముంబై: ప్రస్తుతం టాలీవుడ్‌ను కుదిపేస్తున్న క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారాన్ని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేయడం ద్వారా సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ బాలీవుడ్‌లో కొత్త వివాదానికి తెరలేపారు. ఇండస్ట్రీ మహిళను రేప్ చేసి, రోడ్డున పడేయదని, అందుకు బదులు ఆమెకు జీవనోపాధిని అందిస్తుందని ఆమె పేర్కొన్నారు. సరోజ్ ఖాన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పలువురు సినీ ప్రముఖులు ఆమె వ్యాఖ్యలను తప్పుబట్టారు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో నెలకొన్న క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై బీబీసీ ఒక సంచలన డాంక్యుమెంటరీని ప్రసారం చేయబోతోంది. రాధికా ఆప్తే, ఉషా జాధవ్ వంటి ప్రముఖులతో సహా పలువురు వర్థమాన నటీనటులు తమ అనుభవాలను ఈ డాక్యుమెంటరీలో వెల్లడించారు.
‘బాలీవుడ్ డార్క్ సీక్రెట్’ పేరిట ఈ డాక్యుమెంటరీని బీబీసీ ప్రసారం చేయనుంది. ‘హాలీవుడ్ తరహాలో బాలీవుడ్‌లో మీటూ ఉద్యమం లేదు. కానీ హిందీ చిత్ర పరిశ్రమ కూడా లైంగిక వేధింపులు, దూషణలకు అతీతం కాదని పలువురు నటీనటుల అనుభవాన్ని రజనీ వైద్యనాథన్ మన ముందుకు తెస్తున్నారు’ అంటూ దీనిని ప్రసారం చేయనుంది.
ఈ డాంక్యుమెంటరీలో రాధికా ఆప్తే మాట్లాడుతూ.. ‘కొందరు తమను తాము దేవుళ్లుగా భావిస్తారు. వాళ్లు శక్తివంతుల. మేం మాట్లాడినా ఎవరూ పట్టించుకోరులే అనే భావనలో ఉంటారు. ఒకవేళ ఎవరైనా మాట్లాడితే వారి కెరీర్ నాశనమైనట్టేనని భావిస్తారు. మహిళలు, పురుషులు కలిసికట్టుగా ముందుకొచ్చి ఇది జరగకూడదని నిర్ణయిస్తే ఇది ఆగిపోతోంది. అలాంటిది ఇక్కడ రావాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు. సినిమాల్లో అవకాశం దొరకాలంటే నిర్మాతతో, దర్శకుడితో పడుకోవాలని తనకు చెప్పారని నటి ఉషా జాధవ్ తన అనుభవాలను వివరించారు.
ఈ డాక్యుమెంటరీలో ఓ వర్ధమాన నటి షాకింగ్ విషయాలు వెల్లడించారు. తనను ఒక వ్యక్తి నిత్యం లైంగికంగా వేధించాడని ఆమె తెలిపారు. ‘ఇండస్ట్రీలో పని దొరకాలంటే.. ఎప్పుడు వీలైతే అప్పుడు శృంగారంలో పాల్గొనడం ఆనందంగా భావించు. నీ సెక్సువాలిటీని ఒప్పుకో’ అని అతను సూచించాడని చెప్పారు. ‘ అతను కావాలనుకున్నప్పుడల్లా నన్ను తాకేవాడు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ముద్దు పెట్టుకునేవాడు. అతని ప్రవర్తన నన్ను షాక్‌కు గురిచేసింది’ అని ఆమె తెలిపారు. గతంలోనూ పలువురు బాలీవుడ్ నటీమణులు క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. రిచా చద్దా, స్వర భాస్కర్ వంటి వారు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని వెల్లడించారు. అయితే, తమను లైంగికంగా వేధించిన వారి పేర్లను వారు వెల్లడించలేదు.
Comments
Please login to add a commentAdd a comment