
తమిళసినిమా: ఆడవారి మాటలకు అర్థాలేవేరులే అన్నారో మహాకవి. ఇది చాలా మంది విషయంలో నిజమని అనిపించకమానదు. నటి అదితిరావునే తీసుకుంటే మణిరత్నం దర్శకత్వంలో కార్తీతో రొమాన్స్ చేసిన జాణకు ఆ చిత్రం నిరాశ పరిచినా ప్రచారం మాత్రం బోలెడు వచ్చేసింది. మణిరత్నంను పొగడ్తల్లో ముంచేయడం లాంటి భేటీలతో ఫ్రీ పబ్లిసిటీ కొట్టేసిన అదితిరావు మరోసారి ఆయన దర్శకత్వంలో నటించే అవకాశాన్ని కొట్టేసింది. కాగా తాజాగా గ్లామరస్ ఫొటోలను, ఈత దుస్తులు ధరించిన ఫొటోలను తరచూ ఇంటర్నెట్‌లో విడుదల చేస్తూ నెటిజన్లకు మంచి పని చెబుతోంది. కొంత విమర్శలను పోగేసుకుంటోందనుకోండి. అవకాశాల కోసమేనా ఈ ట్రిక్స్ అన్న ప్రశ్నలను లైట్‌గా తీసుకుంటోంది.
అలాంటి వాటిని పట్టించుకోకపోవడంతో పాటు అసలు తనకు గ్లామరస్ దుస్తులు నప్పవని స్టేట్‌మెంట్స్ ఇచ్చేస్తోంది. ఈ అమ్మడు ఏంమంటోందో చూద్దాం. నా దుస్తులను నేనే ఎంపిక చేసుకుంటాను. హద్దులు మీరిన గ్లామర్ దుస్తులు నా శరీరాకృతికి నప్పవు. నిజం చెప్పాలంటే ధరించే దుస్తులను చూసి మనుషులను విలువ కట్టే విధానం ఇంకా సమాజంలో కొనసాగుతూనే ఉంది. నా కుటుంబం, స్నేహితులను దృష్టిలో పెట్టుకునే దుస్తులను ఎంపిక చేసుకుని ధరిస్తాను. ఇక కెరీర్ గురంచి చెప్పాలంటే ఈ ఏడాది తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చాను.అదే విధంగా తమిళం, హిందీ భాషల్లో ఒక్కో చిత్రం చేస్తున్నాను. ఏకకాలంలో ఎక్కువ చిత్రాలు చేసే అలవాటు నాకు లేదు. సినిమాలో నా పయనం నిదానంగానే ఉంటుంది. కాబట్టి నా మార్కెట్ తగ్గింది. అందుకే అవకాశాలు రాబట్టుకోవడానికి గ్లామరస్ చిత్రాలను విడుదల చేస్తున్నాను అని భావించనక్కర్లేదు. ఇక్కడ నేనింకా సాధించాల్సింది చాలా ఉంది అని నటి అదితిరావు అంటోంది. అయినా అంటారు గానీ ఆడవారి మాటలకు అర్థాలే వేరు కదా! నిజాలు చెబుతారా? అంగీకరిస్తారా?
Comments
Please login to add a commentAdd a comment